కడుపులో అల్సర్స్‌ | Ulcers Are Caused By Smoking And Alcohol | Sakshi
Sakshi News home page

కడుపులో అల్సర్స్‌

Published Thu, Jan 23 2020 2:08 AM | Last Updated on Thu, Jan 23 2020 2:09 AM

Ulcers Are Caused By Smoking And Alcohol - Sakshi

ఈరోజుల్లో మన జీవనశైలి చాలా ఒడిదొడుకులతో ఉంటోంది. టైమ్‌కు భోజనం తినకపోవడం, మసాలాలతో కూడిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనం గడపడంతో పాటు చాలామంది రాత్రి కాగానే ఆల్కహాల్స్, పగటిపూట సాఫ్ట్‌డ్రింక్స్‌తో అస్తవ్యస్తమైన జీవితం గడుపుతున్నారు.

ఈ జీవనశైలి కారణంగా మనలో అల్సర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి అల్సర్ల గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది ప్రయాణించే మార్గమంతా మంచి లైనింగ్‌తో ఉంటుంది. ఈ లైనింగ్‌ మీద ఆహారం తేలిగ్గా ముందుకెళ్లడానికి జిగురు లాంటి పదార్థం (మ్యూకస్‌) తోడ్పడుతుంది.

ఇక పేగుల దగ్గర మైక్రో విల్లై పేరిట... జీర్ణమైన ఆహారాన్ని ఒంటి లోపలికి ఇంకేలా పీల్చుకోడానికి అంతే సంక్లిష్టమైన నిర్మాణాలుంటాయి. అటు ఆహారం సజావుగా వెళ్లడానికీ, అలాగే దాని లోపలి పోషకాలు లోపలికి ఇంకడానికీ ఉన్న ఆ దారిలో ఎక్కడైనా ఒరుసుకుపోయినట్లుగా ఉంటే... వాటిని ఎరోజన్స్‌ అంటారు. అలాంటి ఎరోజన్స్‌ గాట్లు మరింత లోతుగా ఉంటే... వాటినే అల్సర్స్‌గా పిలుస్తారు. ఒకసారి అల్సర్‌ వస్తే అది మళ్లీ మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అల్సర్‌ వచ్చినవాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అల్సర్స్‌ ఎందుకొస్తాయో, అలా ఒకసారి అల్సర్స్‌ వచ్చి తగ్గినవారితో పాటు... రానివాళ్లు భవిష్యత్తులో అలాంటి సమస్యే ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

ఎలా ఏర్పడతాయి ఈ అల్సర్స్‌?
మన నోటిలో ఉండే మృదువైన పొరను మ్యూకోజా అంటారు. ఆ పొరలాంటి లైనింగ్‌లాంటిదే దాదాపు ఆహారం ప్రయాణించే మార్గమంతా ఉంటుంది. ఈ మొత్తం దారిలో అల్సర్స్‌ ఎక్కడైనా రావచ్చు. అవి వచ్చేందుకు కారణాలెన్నో. అవి వచ్చిన ప్రదేశాన్ని బట్టి... నోట్లో అయితే నోటి అల్సర్‌ అనీ, కడుపులో స్టమక్‌ అల్సర్‌ అనీ, పేగులోని వాటికి ఇంటస్టైనల్‌ అల్సర్‌ అని పేరు పెడతారు.  

కారణాలివి
కడుపులో స్రవించే యాసిడ్‌ లోపలి లైనింగ్‌ను తినేయడం, సమయానికి తినకపోవడం, సిగరెట్స్‌ / పొగతాగడం, ఆల్కహాల్‌ వల్ల మ్యూకోజా దెబ్బతినవచ్చు. ఆ గాయం మరింత తీవ్రమైతే దాన్నే అల్సర్‌ అని చెప్పవచ్చు. కడపులో ఉండే యాసిడ్స్‌ మాత్రమేగాక... ఒక్కోసారి కూల్‌డ్రింక్స్‌ రూపంలో మనం తాగే కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ వల్ల కూడా ఈ మ్యూకోజా గాయపడవచ్చు. కొన్నిసార్లు యాస్పిరిన్, కొన్ని నొప్పినివారణ మందులు వల్లకూడా అల్సర్స్‌ రావచ్చు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్లకు మరో ప్రధాన కారణం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ అల్సర్స్‌ రావచ్చు.  మామూలుగానైతే మ్యూకోజాలో గాయం అయినప్పుడు మనలోని డిఫెన్సివ్‌ ఫ్యాక్టర్‌ వల్ల అది దానంతట అదే తగ్గిపోతుంది. కాని గాయపరిచే శక్తుల ప్రభావం ఎక్కువై, ఆ గాయం మరింత లోతుగా అయినప్పుడు అల్సర్స్‌ ఏర్పడతాయి.

అల్సర్‌ ఉంటే...
కడుపులో అల్సర్స్‌ ఉన్నప్పుడు సాధారణంగా కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పితోపాటు కనిపించే ఇతర లక్షణాలివి...
►అకస్మాత్తుగా అర్ధరాత్రి కడుపు పైభాగంలో నొప్పి, మంటతో నిద్రాభంగం కావడం.
►ఏమీ తినకపోతే కడుపునొప్పి రావడం,
►ఏదైనా తినగానే వాంతులు కావడం, నొప్పి రావడం.
►భోజనం మొత్తం తినలేకపోవడం, అంటే... కాస్తంత తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం.
►కడుపు ఉబ్బరం, తేన్పులు.
►కొందరిలో రక్తహీనత, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

నిర్ధారణ పరీక్షలు ఇవి
రోగి లక్షణాలను బట్టి అల్సర్స్‌ ఉన్నట్లు అంచనా వేసినా... దాన్ని కచ్చితంగా కనుక్కునేందుకు ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. దీని సహాయంతో కేవలం అల్సర్స్‌ నిర్ధారణ మాత్రమేగాక... కొన్నిసందర్భాల్లో క్యాన్సర్‌గా అనుమానించే అల్సర్‌ను బయాప్సీ ద్వారా కనుగొనవచ్చు. ఎండోస్కోపీ కేవలం నిర్ధారణ కోసం మాత్రమేగాక... కొన్ని సందర్భాల్లో అల్సర్‌ ఉన్నచోట రక్తస్రావం జరుగుతుంటే ఆపడం వంటి చికిత్స ప్రక్రియలు చేయడానికి కూడా వీలవుతుంది.

అల్సర్స్‌తో దుష్ప్రభావాలివి
అల్సర్స్‌ నుంచి రక్తస్రావం (బ్లీడింగ్‌) కావడం ఒక కాంప్లికేషన్‌ కాగా... పేగుకు రంధ్రం పడటం (పెర్‌ఫొరేషన్‌) అన్నది మరో కాంప్లికేషన్‌. పేగు సన్నబడటం (స్టెనోసిస్‌) అన్నది ఇంకో కాంప్లికేషన్‌. ఈ రోగుల్లో ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం, మలవిసర్జన నల్లగా కావడం, తీవ్రమైన కడుపునొప్పితో వాంతులు కావడం వంటివి జరుగుతాయి. ఆకలి మందగించి కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ వస్తుంది.

ఇక్కడా అల్సర్స్‌ లక్షణాలే... తేడా గుర్తించాలిలా
పిత్తాశయం (గాల్‌బ్లాడర్‌)లో రాళ్లు, పాంక్రియాటైటిస్, పాంక్రియాటిక్‌ క్యాన్సర్లలోనూ అల్సర్స్‌ ఉన్నప్పటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి కడుపునొప్పి, మంట వంటివి కనిపిస్తే కచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్‌ లేదా అబ్డామినల్‌ సీటీ స్కాన్‌  పరీక్షలు చేయించాలి. అలా చేయించడం వల్ల పరిస్థితి ముదరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక అల్సర్‌ లక్షణాలు కనిపిస్తుంటే ఆ రోగులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

యాంటాసిడ్స్‌ తీసుకుంటున్నా కడుపులో విపరీతంగా మంట, నొప్పి తగ్గకుండటం, వాంతులు, కొంచెం తినగానే కడుపునిండిపోయినట్లు అనిపించడం, రక్తహీనత, బరువు తగ్గడం, రక్తపు వాంతులు కావడం,  మలం నల్లగా ఉండడం వంటివి చోటుచేసుకుంటే తక్షణం అప్పర్‌ గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ ఎండోస్కోపీ చేయించాలి. ఎండోస్కోపీ నార్మల్‌గా ఉంటే అప్పుడు అల్ట్రాసౌండ్‌ లేదా అబ్డామిన్‌ సీటీస్కాన్‌ చేయించాలి.
పైన పేర్కొన్న అంశాలపై అవగాహన పెంచుకుంటే అల్సర్‌ వచ్చిన వారూ సురక్షితంగా ఉండవచ్చు. అల్సర్‌ లేనివారు దాన్ని నివారించుకోవచ్చు.

చికిత్స ఇలా...
అల్సర్‌ కోసం కేవలం చికిత్స మాత్రమే సరిపోదు. మందులు వాడటంతో పాటు చాలా నివారణ జాగ్రత్తలనూ పాటించాలి. పొగతాగడం, ఆల్కహాల్‌ మానేయడం, ఒత్తిడి నివారించుకోవడం, వేళకు తినడం, నొప్పినివారణ మందులు తీసుకోకపోవడం అవసరం. వీటితోపాటు కడుపులో యాసిడ్‌ను తగ్గించే మందులు వాడాలి. ఈ చర్యలతో అల్సర్స్‌ దాదాపుగా తగ్గిపోతాయి. ఒకసారి అల్సర్‌ గనక వచ్చిందంటే ఎప్పుడూ వస్తూనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే దాన్ని నివారించడానికి మందులు వాడాలి. ఇందుకోసం ప్రొటాన్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌తో పాటు టెట్రాసైక్లిన్, మెట్రోనిడజాల్, క్లారిథ్రోమైసిన్, అమాక్సిలిన్, బిస్మత్‌ సాల్ట్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులతో దాదాపు 80–90 శాతం అల్సర్‌ తగ్గుతుంది. అయితే మందులతో తగ్గకపోతే వాళ్లలో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా రక్తస్రావం ఆపడం లేదా స్టెనోసిస్‌ (పేగు సన్నబడటం) జరిగితే దాన్ని సర్జరీ ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది.
డాక్టర్‌ భవాని రాజు, సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement