చక్కని పండు..రుచిలో మెండు
♦ ఔషధ గుణాల ఖర్జూరాలు
♦ ఉపవాస దీక్ష విరమణలో ప్రథమ స్థానం
♦ రంజాన్ మాసంలో విరివిగా విక్రయాలు
నిగనిగలాడే రంగు.. చూడచక్కని రూపం.. దూరం నుంచే నోరూరించే నైజం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయి.. తక్షణం శక్తినిచ్చే లక్షణం ఖర్జూర పండు సొంతం. అంతేనా.. ఎన్నో ఔషధ గుణాలూ ఉన్నాయండోయ్. రంజాన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రోజా. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను త్యజించి రోజాను పాటిస్తారు. వీరికి ఇఫ్తార్ సమయానికి తప్పక గుర్తుకొచ్చేది ఖర్జూరం. దీన్ని తీసుకోవడం వల్లశరీరానికి తక్షణ శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉపవాస దీక్షను ఖర్జూరతోనే విరమించడాన్ని సున్నత్‌గా పేర్కొంటారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
ఇఫ్తార్‌కు ఈ పండు తప్పనిసరి
ఉపవాస దీక్ష ముగిసాక ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం పండ్లనే అధిక శాతం తీసుకుంటారు. ప్రస్తుతం వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారత్‌లో పండే ఖర్జూరాలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చెందిన దాదాపు 65 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కల్మీ, సుక్రీ, క్లాస్, సుగా ఈ-వార్డ్, అజ్‌వా, మెడ్‌జాల్ కింగ్, మరియమ్, జఫ్రాన్ రకాలు ముఖ్యమైనవి. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ. 4000 ధర పలుకుతున్నాయి.
కొనేటప్పుడు జాగ్రత్త..
మార్కెట్లో చాలా రకాల ఖర్జూరాలు దొరుకుతున్నాయి. కొంద రు వ్యాపారులు నాసిరకం విక్రయిస్తుంటారు. అందుకే చెల్లించే డబ్బుకు తగినట్టుగా నాణ్యమైన ఖర్జూరాలను తీసుకునేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్జూరాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఎలాంటి జిగురు అంటకూడదు. అలా ఉంటే నిగనిగలాడేందుకు ఎలాంటి రసాయనాలు వాడలేదని అర్థం. ఖర్జూరాల పైపొర పల్చగా ఉండి, గుజ్జు తాజాగా ఉండాలి. నాణ్యమైన ఖర్జూరాలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి.
వారెవ్వా.. అజ్‌వా
ఖజూర్ రకాలన్నింటిలోకీ చాలా ఖరీదైన రకం అజ్‌వా. సౌదీ అరేబియాలో పండే ఈ రకం ఖజూర్ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైన పండుగా గుర్తింపు పొందింది. నల్లటి రంగులో ఉండే అజ్‌వా ఖజూర్‌లోని గింజలను తొలగించి, వీటిలో పూర్తిగా బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్టఫ్ చేసి వాటిని తేనెలో వాటిపై కుంకుమపువ్వును వేసుకుని నోట్లో వేసుకుంటే.. ఆ రుచి ఇక మరిచిపోలేం. అందుకూ ఈ పండు ధర కూడా అధికమే. కిలో ధర రూ.2వేలకు పైనే ఉంటుంది.
ఖజూర్ కింగ్ ‘మెడ్‌జాల్’
ఖర్జూరాల్లో మెడ్‌జాల్ ‘కింగ్’ లాంటిది. ఖజూర్‌లన్నీ డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్‌తో అంతటి రుచిని పొందితే..ఎటువంటి స్టఫింగ్ లేకుండా అమోఘమైన రుచిని సొంతం చేసుకుంది మెడ్‌జాల్‌కింగ్ రకం. ఇజ్రాయిల్ దేశ సరిహద్దు ప్రాంతమైన జోర్డన్‌లో ఇది పండుతుంది అత్యంత బరువైన ఖజూర్‌గా కూడా దీన్ని చెబుతారు. రెం డు మెడ్‌జాల్ పండ్లు తింటే చాలు ఇక భోజనం చెయ్యాల్సిన అవసరమే లేదని ఖజూర్‌ప్రియులు చెబుతారు. కిలో ధర రూ.1,800.
నోరూరించే ‘సగాయి’..
అజ్‌వా తరువాత తియ్యదనంలో మేటిగా చెప్పబడే రకం సగాయి. దుబాయ్‌లో ఈ రకం ఖర్జూరం అధికంగా పండుతుంది. ప్రపంచ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఖజూర్ ఇది. ఇవి కూడా కేవలం ఖజూర్‌గానే కాక వీటిలో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి వాటికి వైట్ హనీని జతచేసి కుంకుమ పువ్వుతో కలిపి విక్రయిస్తారు. కిలో ధర రూ.4వేల వరకు ఉంటుంది.