పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం
పల్నాడు ‘ఫల’నాడుగా మారుతోంది. వినూత్న ప్రయోగాలకు వేదికవుతోంది. ఫలప్రదమై ఆనందాలు పంచుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మనవిగాని సరికొత్త పండ్ల తోటల సాగుకు ఇక్కడి కర్షకులు శ్రీకారం చుడుతున్నారు. సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలివిగా ఆలోచించి స్వేదం చిందిస్తే సిరులు కురిపించడం పెద్ద కష్టమేమీ కాదని, కష్టే‘ఫలి’ అని నిరూపిస్తున్నారు. లాభాలు గడిస్తూ అందరిచేత ఔరా అనిపిస్తున్నారు.
సాక్షి, నరసరావుపేట: తక్కువ నీటితో అధిక దిగుబడులిచ్చే సరికొత్త ఉద్యానపంటల సాగుకు పల్నాడు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ లాభసాటి సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పండ్ల తోటల సాగుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఖర్జూర బా(ద్)షా
సాధారణంగా ఖర్జూర పంటను గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సాగుచేస్తారు. ఈ మధ్య రాయలసీమలోని అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. పల్నాడు జిల్లాలోనూ దీనిని సాగుచేయవచ్చని కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన బాషా నిరూపించారు. 15 ఎకరాల ఎర్ర ఇసుక నేలలో గుజరాత్‌లోని ఖచ్ కార్పొరేషన్ ల్యాబ్, రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని అతుల్ ల్యాబ్ నుంచి మూడున్నరేళ్ల వయసున్న 750 మొక్కలు తెచ్చి రెండేళ్ల క్రితం నాటారు. ఒక్కో మొక్కను రూ.5 వేలకు కొన్నారు. తొలి కాపు మొదలైంది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇక్కడి వాతావరణం ఖర్జూర సాగుకు అనుకూలమని రైతు బాషా చెబుతున్నారు. పంట కు సబ్సిడీ అందించడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఉద్యాన రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మెట్టప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలో ఉద్యాన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొత్తం 81,750 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతోపాటు రాయితీలు, ఇతర కార్యక్రమాలకు రూ.13 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది.
యాపిల్ బేర్.. రైతు కు‘భేర్’
థాయ్‌లాండ్‌కి చెందిన యాపిల్ బేర్‌ను ఉత్తరభారత దేశంలో అధికంగా సాగుచేస్తారు. ప్రస్తుతం అచ్చంపేట మండలం గ్రంథిసిరి గ్రామానికి చెందిన రైతు రాంబాబు దీనిని వినూత్నంగా సాగుచేస్తున్నారు. నాలుగెకరాల్లో పంట మొదలుపెట్టారు. ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు యాపిల్ బేర్ పంట చేతికివస్తుంది. ఎకరానికి పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, ఆదాయం సగటున రూ.2 లక్షల వరకు ఉంటుందని రైతు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో యాపిల్ బేర్‌ను కిలో రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతున్నారు. యాపిల్ బేర్ సాగుకు అవసరమైన మెలుకువలను ఉద్యానవనశాఖ అధికారులు అందజేస్తున్నట్టు రాంబాబు వెల్లడించారు.
డ్రాగన్ ‘ఫ్రూట్‌ఫుల్’
ఎన్నో గొప్ప పోషకాలున్న డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మాచర్ల, పెదకూరపాడు, మాచవరం, యడ్లపాడు, నరసరావుపేట మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. మొత్తం 110 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులూ దీని సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. తక్కువ నీటితో పెరిగే ఈ మొక్కలు నాటిన రెండేళ్లలో దిగుబడి ప్రారంభమవుతుంది. మూడేళ్ల తర్వాత ఎకరానికి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తు్తంది. ఉద్యాన వన శాఖ ఎకరానికి రూ.12 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలతోపాటు స్థానికంగా కూడా ఈ పండ్లకు గిరాకీ బాగా ఉంటోంది. (క్లిక్: తాటి.. పోషకాల్లో మేటి)
ఉద్యాన శాఖ సహకారంతో..
నాలుగు ఎకరాల్లో యాపిల్ బేర్ పంట సాగుచేస్తున్నా. మన ప్రాంతంలో ఈ పంట సాగుచేయవచ్చా లేదా అన్న విషయాన్ని అధ్యయనం చేసి ప్రారంభించాను. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. ఉద్యానవన శాఖ నుంచి సాంకేతిక సలహాలు, సూచనలు అందుతున్నాయి. అధిక లాభాలు సాధించే అవకాశం ఉంది.
– రాంబాబు, రైతు, గ్రంథసిరి గ్రామం, అచ్చంపేట
లాభసాటి పంటలు
ఉద్యాన పంటలు లాభసాటిగా ఉంటాయి. కాలానుగుణంగా వస్తున్న కొత్త వంగడాలు, రకాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే సత్ఫలితాలు సాధ్యం. పల్నాడు జిల్లాలో ఖర్జూర, యాపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్ వంటి కొత్త రకం పంటలకు రైతులు శ్రీకారం చుట్టారు. వీరికి సలహాలు, సూచనలతోపాటు రాయితీలు అందిస్తున్నాం. మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగో కూడా చెబుతున్నాం.
– బెన్నీ, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పల్నాడు