ఈద్ ముబారక్
నేడు రంజాన్
విశాఖపట్నం : నెలవంక కనిపించింది.. రంజాన్ వచ్చేసింది.. ఉపవాస దీక్షలు విరమించి ముస్లింలు సందడి చేశారు. శనివారం ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరపనున్నారు. రంజాన్ వేడుకలతో నగరంతో పాటు గ్రామీణ జిల్లా అంతటా కోలాహలం నెలకొంది. మసీదులను విద్యుత్ దీపాలతోఅలంకరించారు. అత్తరు వాసనలతో వాతావరణమంతా సుగంధభరితమైంది. అల్లాహ్‌పై విశ్వాసానికి ప్రతీక రంజాన్. పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లో పేర్కొన్న విధంగా ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని ఈ పర్వదినాన్ని పాటిస్తారు. పవిత్ర మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి, దానధర్మాలు చేస్తారు. పేదలు కూడా పండగను ఆనందంతో జరుపుకోవాలనేది ఇందులో సారాంశమని మతపెద్దలు చెబుతారు.
నేడు ఇలా చేస్తారు :
మసీదులు, ఈద్గాలను అలంకరిస్తారు.
పేదలకు ఇవ్వాల్సిన జకాత్, ఫిత్రాలను (దానాలను) రంజాన్ పండగ ప్రత్యేక నమాజ్‌కు వెళ్లేలోగా అందజేస్తారు.
కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకొని, కళ్లకు సుర్మా రాసుకొని నమాజ్‌కు తరలివెళ్తారు.
ఉదయం జరిగే ప్రత్యేక నమాజ్‌ను మసీదుల్లో గాని, ఈద్గాల్లో గాని ఆచరిస్తారు.
పండగ సందర్భంగా చిన్నారులకు ఈదీ (ప్రత్యేక కానుకలు)ను పెద్దలు అందజేయడం ఆనవాయితీ, కానుకలు నగదు రూపంలో గాని, దుస్తులు రూపేణా ఉంటాయి.
కుటుంబంలోని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, దీవెనలు తీసుకోవడం తప్పనిసరిగా భావిస్తారు.
బంధుమిత్రులను ఇళ్లకు విందుకు ఆహ్వానిస్తారు.
ప్రత్యేక వంటకాలు....
సేమియాతో ఖీర్, షీర్‌ఖుర్మా, సేమియా ఉప్మా తదితర వంటకాలు చేస్తారు. ఇక మధ్యాహ్నం భోజనంలో పసందైన, రుచికరమైన పలు రకాల బిర్యానీలు తయారు చేస్తారు. సాయంత్రం బంధువుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అనంతరం సమీపంలో దర్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
రంజాన్ ప్రత్యేకతే వేరు...
స్వల్ప విషయాలు మినహా రంజాన్ పండగ ఆచార వ్యవహారాల్లో నాటికీ, నేటికీ పెద్దగా తేడా లేదు. గత రోజుల్లో తెల్లవారు జామున యువకులు, పెద్దలు గ్రూపులుగా ఏర్పడి సహర్ సమయానికి రెండు గంటలు ముందుగా ఇంటింటికి వచ్చి మేల్కొలుపు కార్యక్రమం నిర్వహించేవారు. మేల్కొని సహర్‌కు వంటలు చేసేవారు. అప్పట్లో ముఖ్యంగా మొఘలుల వంటకాలకు ఆదరణ తక్కువ. కోస్తాంధ్రలో సైతం ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన హలీమ్, మొఘల్ బిర్యానీ, ఇరానీ చాయ్ అప్పుడు లేవు. ఇఫ్తార్ సమయంలో గోధుమనూకతో చేసిన గంజియే ప్రత్యేకంగా ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉండడంతో కుటుంబీకులు, బంధుమిత్రులతో ఇఫ్తార్, సహర్ విందుల్లో హడావుడి ఉండేది. రకరకాల వంటకాలుండేవి. అప్పట్లో రంజాన్‌లో ప్రత్యేక తరావీ నమాజ్‌లో కొన్నిసార్లు ఖురాన్‌లో అన్ని అధ్యాయాలు ఒకే రాత్రిలో పూర్తి చేసేవారు. రాత్రి 9 గంటలకు మొదలైన నమాజ్ తెల్లవారు 3.30 గంటల వరకూ జరిగేది.
-మహ్మద్ ఖాసిమ్, అక్కయ్యపాలెం