డప్పు వాయిస్తున్న ఫకీర్ సయ్యద్ సిద్ధివుల్లా
మదనపల్లె సిటీ: ‘అయ్ రోజే దారో.. ఉఠో హరీ ఖరోరం..’ ముస్లింలు నివాసముండే ప్రాంతాల్లో తెల్లవారుజామున వినిపించే దండోరా ఇది. జూన్ మాసంలో పవిత్ర ఉపవాసదీక్షలు చేపట్టే ముస్లిం సోదరులను మేల్కొల్పేందుకు వీధుల్లో డప్పులు కొడుతూ, తమ మధుర స్వరంతో అల్లా శక్తిని పాటల రూపంలో పాడుతూ చేపట్టే కార్యక్రమం ఇది. తెల్లవారుజాము 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు ముస్లింల నివాస ప్రాంతాల్లో ఫకీర్లు దాయారాతో నిద్రలేపుతారు. జిల్లాలో ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కొందరు స్వచ్ఛందంగా ఈ పని చేస్తుండగా, మరి కొందరు ఫకీర్లు వారసత్వంగా కొనసాగిస్తున్నారు.
45 ఏళ్లుగా..
మదనపల్లె పట్టణం బడేమకాన్ దర్గాలో ఫకీర్లు దాదాపు ఐదుగురు ఉన్నారు. వీరి గురువు సయ్యద్ సిద్ధివుల్లా షాతో పాటు మరో నలుగురు శిష్యులు రోజూ ముస్లింలు ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకుని సహరీ కోసం నిద్ర లేపుతారు. ‘అప్పట్లో విద్యుత్‌దీపాలు లేకపోవడంతో లాం తర్లు పట్టుకుని వీధుల్లో తిరిగేవాళ్లం. తరాలు మారినా ఆ సంప్రదాయం అలాగే కొనసాగిస్తున్నాం. ఇషా నమాజు చదివి రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా తెల్లవారుజాము మూడు గంటలకే లేచి ఉపవాసదీక్షలకు సిద్ధమయ్యే ముస్లింలను మేల్కొల్పుతాం’ అని చెబుతారు సయ్యద్ సిద్ధి వుల్లా. మా చాటింపుతో ఎంతో మంది నిద్రలేచి ఉపవాసదీక్షలను పాటిస్తుంటారు. రంజాన్ రోజు ఇచ్చే కానుకలు తీసుకుంటూ అల్లాహ్ పై ఉన్న భక్తితో ఈ పని చేస్తున్నా. దీంతో ఎంతో సంతృప్తి కలుగుతుందని అంటారాయన.
మధురం.. కంఠస్వరం
సయ్యద్ సిద్ధివుల్లా కంఠస్వరం చాలా మధురంగా ఉంటుంది. ఎంత గాఢనిద్రలో ఉన్నా ఆయన కంఠస్వరం వినగానే ఒక్కసారిగా నిద్రలేచి సహరీకు ఏర్పాట్లు ప్రారంభిస్తాం అని చెబుతారు ఇక్కడి ముస్లింలు. దాదాపు 45 ఏళ్లుగా చాటింపు చెబుతున్న సిద్ధివుల్లా స్థానిక ముస్లింలకు సుపరిచితుడు.
ఫకీర్లకే ప్రాధాన్యం..
గతంలో గడియారం, అలారమ్, సైరన్ మోతలు లేకపోవడంతో ఫకీర్లకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఫకీర్లు పొరపాటున చాటింపు వేయకపోతే అక్కడివారు సకాలంలో మేల్కొనకపోవడం వల్ల ఆరోజు వారు ఉపవాసదీక్షలను వదిలేయాల్సి వచ్చేది. కాలానుగుణంగా ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చినా ముస్లింలు మాత్రం ఇంకా ఫకీర్ల చాటింపుపైనే ఆధారపడుతున్నారు. ఫకీర్లు కాలినడకతో పాటు సైకిల్‌లపై డప్పు వాయిస్తూ .. మర్పా కొడుతూ.. డబ్బా వాయిస్తూ ముస్లింలను నిద్ర లేపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment