వజూ చేస్తున్న ముస్లింలు, (ఇన్‌సెట్) సైపుల్లాసాహెబ్
మదనపల్లె సిటీ: రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ముస్లింలు మసీదులకు వెళ్లి రోజుకు అయిదు సార్లు ప్రార్థనలు చేస్తారు. ముందుగా వీరంతా వజూ పాటించాల్సి ఉంది. ఇస్లాంలో ‘వజూ’ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వజూ లేనిదే నమాజు చెల్లదు. ఒక్క నమాజుకే కాదు పవిత్ర ఖురాన్ గ్రంథం చేతిలో పట్టుకోవాలన్నా, పఠించాలన్నా, గుసూల్ చేయాలన్నా వజూ తప్పనిసరి. వజూలో నాలుగు ఫరజ్‌లు (అల్లా ఆజ్ఞలు) దాగి ఉన్నాయి. ఈ అంశాన్ని అల్లా పవిత్ర ఖురాన్‌లోని సూరే మాయిదా (ఆయాత్–6)లో సెలవిచ్చారు. వజూ చేసిన వారి అవయవాలు వజూ నీళ్లు ప్రవహించిన చోట ప్రళయకాలంలో ఆ మెరుపు ఆధారంగానే మహమ్మద్ ప్రవక్త తన ఉమ్మతీయులను గుర్తిస్తారనేది పవిత్ర ఖురాన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రళయకాలపు దాహంతో కొట్టుమిట్టాడే తన ఉమ్మతీయులకు మహమ్మద్ ప్రవక్త తన స్వహస్తాలతో ఆబే కౌసర్ జలం తాపిస్తారు. ముస్లింలు నమాజు రోజుకు ఐదు పూటలా పాటిస్తారు. దీని కోసం ఐదు సార్లు వజూ చేయాల్సి ఉంటుంది. వజూలో ఆయా అవయవాల ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయని హఫీజ్ సైపుల్లాసాహెబ్ తెలిపారు.
వజూ చేసే విధానం..
♦ రెండు చేతులను మణికట్టు దాకా మూడు సార్లు శుభ్రమయ్యేలా కడుక్కోవాలి.
♦ నోట్లోకి నీళ్లు తీసుకుని బాగా కదిలించి పుక్కలించాలి.
♦ ముక్కపుటల్లోకి నీళ్లు ఎక్కించి ముక్కును శుభ్రం చేసుకోవాలి.
♦ దోసిలితో నీళ్లు తీసుకుని ముఖం సంపూర్ణంగా తడిసేలా కడుక్కోవాలి.
♦ మోచేతుల దాకా నీరు పోనిచ్చి కుడిచేతిని ఎడమచేతితోను, ఎడమచేతిని కుడిచేతితోనూ మోచేతుల దాకా కడుక్కోవాల్సి ఉంటుంది.
♦ దోసిలితో కొద్ది నీళ్లు తీసుకుని తలవెంట్రుకలు మొత్తం తాకుతూ చేతులను మెడపైభాగం నుంచి పోనిచ్చి బాగా రుద్దుతూ అదే చేతులతో చెవులను శుభ్రపరచుకోవాలి. ఈ విధానాన్ని మసా చేయడం అంటారు.
♦ పాదాలను అంకిల్స్ వరకు సంపూ ర్ణంగా, శుభ్రంగా కడగాలి.
♦ వజూను బిస్మిల్లా అని ప్రారంభించాలి. ప్రతి ప్రక్రియను మూడు సార్లు చొప్పున చేయాలి. వజూ కంటే ముందు మిస్వాక్ కర్రతో దంతాలను శుభ్రపరచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment