అల్లాహ్ కానుక.. ఈద్ ఉల్ ఫితర్
పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగిశాయి. శుక్రవారం మగ్రీబ్ నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నెలంతా ఉపవాసాలు ఉన్నవారికి అల్లాహ్ ఇచ్చిన కానుక ‘ఈదుల్ ఫితర్’. రంజాన్ నెల ముగింపు రోజు ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ (ఈద్). శనివారం ఈ పర్వదినం సందర్భంగా ప్రార్థనల కోసం నగరంలోని ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. ఈద్ నమాజ్‌లను ఈద్గాలోనే చేయాలనే నిబంధన ఉంది. ఈద్గాకు వెళ్లలేనివారు మసీదులో ప్రార్థన చేయవచ్చు. నగరంలో గల ఈద్గాలు, ప్రముఖ మసీదుల చరిత్ర ఇదీ..
మట్టి వాడని ‘మక్కా మసీదు’
చార్మినార్: దేశంలోని పురాతన మసీదులో మక్కా మసీదు ఒకటి. చార్మినార్ కట్టడానికి అతి సమీపంలో ఇది ఉంది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చి ఇక్కడి మసీదు నిర్మాణ సమయంలో ఉపయోగించారని, అందుకే దీనికి ‘మక్కా మసీద్’గా పేరొచ్చిందన్నది చరిత్ర. ఈ కట్టడం నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేదు. రాళ్ల పొడిని మాత్రమే ఉపయోగించారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పెద్ద రాతి కొండను తొలిచి రాళ్లను తీశారు. వీటిని మాత్రమే నిర్మాణానికి వాడారని కథనం. ఈ మక్కా మసీదు నిర్మాణం 1617లో ప్రారంభమై దాదాపు 77 ఏళ్లపాటు సాగింది. ఇందులో ఒకేసారి మూడు వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు.
స్పానిష్ శైలిలో ‘ఇబ్బద్-ఉద్దౌలా’
జూబ్లీహిల్స్: సుమారు 120 ఏళ్ల క్రితం నిజాం ప్రభువుల కాలంలో బేగంపేటలో నిర్మించిన ‘ఇబ్బద్-ఉద్‌దౌలా మసీద్’ స్పానిష్ నిర్మాణ శైలికి అద్దంపడుతుంది. ప్రస్తుత ఎస్పీరోడ్డులోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీని ఆనుకొని ఎయిర్‌పోర్ట్‌కు అతి సమీపంలో దీన్ని నిర్మించారు. నిజాములకు మంత్రులుగా పనిచేసిన పైగా వంశీలు స్పెయిన్‌లో పర్యటించి అక్కడి మసీద్ నిర్మాణ కౌశలానికి ముచ్చటపడ్డారు. సరిగ్గా అలాంటి శైలిలో హైదరాబాద్‌లో ఓ మసీద్‌ను నిర్మించాలని సంకల్పించారు. స్పెయిన్ నుంచి ఆర్కిటెక్ట్‌ను పిలిపించి నిర్మాణ ం చేపట్టారు. తొలినాళ్లలో నవాబుల కుటుంబ సభ్యులు మాత్రమే ప్రార్థనలు చేసేవారు. కాలక్రమంలో సామాన్యులనూ అనుమతించారు. అరబ్బీ భాషలో అల్లాను స్మరిస్తూ లిఖించిన సందేశాలు, ఠీవిగా కనిపించే గుమ్మటాలు, తీర్చిదిద్దిన ఇంటీరియర్, వైభవం ఉట్టిపడే శిల్ప సౌందర్యం దీని ప్రత్యేకత.
శతాబ్దాల చరిత్ర చిలకలగూడ ఈద్గా
బన్సీలాల్‌పేట్: సుమారు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించిన చిలకలగూడలోని ఈద్గా మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 25 వేల మంది సామూహిక ప్రార్థనలు చేయవచ్చు. చిలకలగూడ, సీతాఫల్‌మండి, మహ్మద్‌గూడ, బోయిగూడ, బౌద్ధనగర్, పార్సీగుట్ట, పద్మారావునగర్ తదితర 40 ప్రాంతాలకు చెందిన ముస్లింలు రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు చేస్తారు. రెండు వర్గాలకు చెందిన ముస్లింలు పండుగ రోజు ఒకరి తర్వాత ఒకరు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయడం ఇక్కడి ఆనవాయితీ. అంతేగాక ముస్లిం మహిళలు సైతం సామూహిక ప్రార్థనలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
మహిళ పేరుతో ‘బీ సాహెబా’
పంజగుట్ట: మండు వేసవిలోనూ ఒక్క ఫ్యాన్ కూడా అవసరం లేకుండా ఎంతో చల్లగా ఉంటుంది పంజగుట్ట జాతీయ రహదారిపై ఉన్న మసీదు బీ సాహెబా మసీదు. 1932లో బీ సాహెబా అనే వృద్ధురాలు ఇక్కడి స్థలాన్ని కొనుగోలు చేసి సుందరంగా మసీదును నిర్మించింది. కొద్దికాలానికే ఆమె మరణించడంతో ఆమె సమాధిని మసీదులోనే నిర్మించారు. అనంతరం ఆమె పేరుతోనే బీ సాహెబా మసీదుగా పేరు పెట్టినట్టు ప్రస్తుత మసీదు అధ్యక్షుడు మహ్మద్ షర్ఫుద్దీర్ ఖాజా పాషా తెలిపారు. ఎర్రమంజిల్ కాలనీలో నివసించే ఫక్రుల్ ముల్క్ అనే నిజాం రాజు ఈ మసీదులో ప్రతిరోజు ప్రార్థనలు చేసేవారట. ఇప్పటికీ నిత్యం 2000 మందికి పైగా ప్రార్థనలు చేస్తారు.
తాడ్‌బన్ మీరాలం ఈద్గా
తాడ్‌బన్‌లోని మీరాలం ఈద్గాలో సుమారు రెండు లక్షల మందిపైగా సామూహిక ప్రార్థనలు చేయవచ్చు. ఇక్కడ సామూహిక ప్రార్థనలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. తాడ్‌బన్ ప్రధాన చౌరస్తాలో మూడు వైపుల రహదారులను పూర్తిగా సామూహిక నమాజ్‌ల కోసం సిద్ధం చేశారు.
ప్రాచీన ఈద్గా కుతుబ్‌షాహీ..
నగరంలో 32 ఈద్గాలు ఉండగా, వాటిలో అత్యంత ప్రాచీనమైనది గోల్కొండలోని కుతుబ్ షాహీ ఈద్గా. క్రీ.శ. 1517లో సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ దీన్ని నిర్మించారు. బహదూర్‌పురాలోనీ మీరాలం ఈద్గాను అసఫ్ జహీల కాలంలో నిర్మించారు. గోల్కొండ కోటలో 1997లో సుల్తాన్ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారి అయిన మీర్ జుమ్లా అమీనుల్ ముల్క్ అలీఫ్ ఖాన్ బహదూర్ నిర్మించారు. దీనిని కుతుబ్‌షాహీఈద్గాగా పిలుస్తారు. గోల్కొండ శివారులో మరో ప్రాచీమైన ఈద్గాను 1518లో సుల్తాన్ కులీ కుబుత్‌షా నిర్మించారు. దీన్ని ఖదీమం ఈద్గాగా పిలుస్తారు.
ముగిసిన ఉపవాసాలు
నెల రోజులుగా ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలు శుక్రవారం సాయంత్రం దీక్షలను విరమించి రంజాన్ పండుగకు సిద్ధమయ్యారు. మగ్రీబ్ నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ రోజున సామూహిక ప్రార్థనలు చేసేవారు తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించాలనే సంప్రదాయం ఉండటంతో పాత నగరంలోని ప్రధాన మార్కెట్లు రాత్రివేళ కూడా సందడిగా మారాయి. శనివారం జరిగే సామూహిక ప్రార్థనల కోసం మీరాలం ఈద్గా మైదానాన్ని ముస్తాబు చేసారు. ఈద్గాకు వచ్చేవారి కోసం ఆర్టీసీ రంజాన్ స్పెషల్ బస్సులను నడపనుంది. ప్రార్థనలకు వచ్చేవారికి తాగునీరు అందించేందుకు జలమండలి మంచినీటి ప్యాకెట్లను సిద్ధం చేసింది. -చార్మినార్