ముగిసిన రంజాన్ ఉపవాస దీక్షలు
ఈదుల్ ఫితర్ నేడే
ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
వేడుకలకు సిద్ధమైన ముస్లింలు
నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యూరు. బుధవారం రాత్రి నెలవంక (చాంద్) దర్శనమివ్వడంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు గురువారం ఈదుల్ ఫితర్(రంజాన్) పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మసీదులను ముస్తాబు చేశారు. ఈద్ నమాజ్ కోసం ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. -పోచమ్మమైదాన్/ కాజీపేట
ఆద్యంతం.. ఆధ్యాత్మికం
అరబిక్ క్యాలెండర్ ప్రకారం వరుస క్రమంలో రంజాన్ తొమ్మిదో మాసం. ఈ నెలలో ముస్లింలు ఉపవాస దీక్ష(రోజా) చేస్తుంటారు. ఈ సమయంలో అన్నపానీ యాలు, శారరీక వాంఛలకు దూరంగా ఉంటారు. రోజం తా ప్రార్థనల్లో గడుపుతూ విరివిగా దానధర్మాలు చేస్తారు. ముస్లిం పేదలు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేలా ‘ఫిత్రా’ దానం చేస్తారు. తమ వద్ద ఉండే నిల్వ సొమ్ముపై ‘జకాత్’ చెల్లిస్తారు. చెడుకు దూరంగా ఉంటూనే దైనందిన చర్యలనూ నిర్లక్ష్యం చేయరు. మహిళలు రోజువారీగా ఇంటి పనులు చేస్తూ, పిల్లలు పాఠశాలకు వెళ్తూనే రోజా పాటిస్తారు. ఇలా నెల రోజుల పాటు కఠిన నియమాలతో ఉపవాసం చేసిన ముస్లింలు బుధవారం రాత్రి షాబాన్ నెలవంక దర్శనమివ్వగానే దీక్షలను విరమించారు.
రంజాన్ ఫలాలు దక్కాలంటే...
రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తూ తరావీ నమాజ్‌తో పాటు అన్ని రకాల చెడును వదలాలి. ప్రతీ వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవభీతి ఈ నెలలోనే కాదూ ఎప్పటికీ కనిపించాలి.
ముస్తాబైన మసీదులు
రంజాన్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని మసీదుల ఆవరణలను కార్పొరేషన్ సిబ్బంది శుభ్రం చేశారు. వరంగల్ జెమినీ థియేటర్ సమీపంలోని ఈద్గా, ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈద్గాతోపాటు హన్మకొండలోని బొక్కలగడ్డ, కాజీపేటలోని ఏఆర్‌ఆర్ సమీపంలోని ఈద్గాలను ప్రార్థనల కోసం ముస్తాబు చేశారు.
ఏతెకాఫ్..
రంజాన్ నెల చివరి పదిరోజుల్లో తొమ్మిదిరోజులపాటు మసీదులో ఉండటాన్ని ఏతెకాఫ్ అంటారు. ప్రాపంచిక వ్యవహారాలను పక్కన బెట్టి కేవలం దైవస్మరణతో మసీదులో గడుపుతారు. రాత్రిళ్లు ఇతోధికంగా జాగరణ చేసి మహా శుభరాత్రిగా భావించే ‘లైలతుల్ ఖద్’్రను పొందేందుకు ఏతెకాఫ్ పాటిస్తారు.
రంజాన్‌లోనే దివ్య ఖురాన్ అవతరణ
దివ్య ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించింది. సర్వమానవాళికి ఇది మార్గదర్శకం. 23 ఏళ్ల పాటు దశల వారీగా అల్లాహ్ దీన్ని మహ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లమ్) ద్వారా అవతరింపజేశారు. దైవాజ్ఞను పాటిస్తూ దైనందిన చర్యల్లో నిమగ్నమయ్యే వారికి ఇహ, పరలోక సాఫల్యం ప్రాప్తిస్తుందని ఇస్లాం బోధిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రంజాన్ దీక్షలు మానవులను చెడు నుంచి దూరంగా ఉంచేందుకు శిక్షణ వంటివి. మానవ పరివర్తనకు మంచి మార్గం. దైవాజ్ఞ ప్రకారం ఎవరికి వారే నియమాలు పాటిస్తూ ఈ శిక్షణ పూర్తి చేసుకుంటారు.
నెలవంక కనిపించె.. పండుగ తీసుకొచ్చె..
Published Wed, Jul 6 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM
Advertisement