రాంగోపాల్‌పేట్: జైన మత ఆచారాల పేరుతో 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టి మరణించిన ఆరాధన మృతిపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని కోరుతూ జాతీయ బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. పాట్ మార్కెట్‌కు చెందిన లక్షి్మచంద్ సమ్‌దారియ, మనీషా సమ్‌దారియా దంపతుల కుమార్తె ఆరాధన (13) తల్లిదండ్రులు, మత పెద్దల ప్రోద్భలంతో ఉపవాస దీక్ష కారణంగా అస్వస్థతకు గురై ఈ నెల 3న మరణించిన సంగతి విదితమే. దీనిపై బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఆరాధన తల్లిదండ్రులపై హత్యానేరం నమోదు చేయాలని కోరుతూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే విషయాన్ని బాలల హక్కుల సంఘం జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో వారు స్పంధించారు. ఈ ఘటన పూర్తి వివరాలతో 10 రోజుల్లో నివేధిక అందించాలని జాతీయ కమిషన్ వారికి నోటీసుల్లో పేర్కొంది. కాగా ఆరాధన కేసు విషయంలో నవంబర్ 29లోగా దర్యాప్తు పూర్తి చేయాలని లోకాయుక్త ఉత్తర మండలం డీసీపీని ఆదేశింది.