మాటల్లో మృదుత్వం... ఉపవాసి గొప్పతనం!
రమజాన్ కాంతులు
పరలోకంలో స్వర్గద్వారాల్లో మనకు నచ్చిన ద్వారం గుండా ప్రవేశించే అర్హత పొందటానికి అతి సులభమైన మార్గం రమజాన్ ఉపవాసాలు. అందుకే రమజాన్ ఒక మహత్తరమైన మాసం. దీనిలోని ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఒక నియమానుసారంగా రేయింబవళ్లు గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. అందుకోసం రోజువారీ పనులను బేరీజు వేసుకుని ఏ పని ఏ సమయంలో చేయాలో నిర్ణయించుకుని సాధ్యమైనంత వరకు దాని ప్రకారమే నడచుకోవాలి. చాలామంది మహిళలు తమకు పెద్ద పెద్ద సూరాలు కంఠతా రావని తరావీహ్ నమాజులను అజ్ఞానంతో విడిచిపెడుతుంటారు. అది చాలా తప్పు. కంఠతా వచ్చిన చిన్న చిన్న సూరాలనైనా చదువుకోవచ్చు.
నిలబడి చదవలేకపోతే కూర్చొని కూడా చదువుకునే వెసులుబాటు ఉందని గ్రహించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నోటిని అదుపులో ఉంచుకోవాలి. చాడీలు, నోటి దురుసుతనం, కాఠిన్యం, దుర్భాషలకు దూరంగా ఉండాలి. ఉపవాసి గొప్పతనం వారి మాటల మృదుత్వం ద్వారా ఉట్టిపడుతూ ఉండాలి. ఇదే దైవవిశ్వాసానికి చిహ్నం. ఈ సంవత్సరపు రమజాన్ మాసంలో పగలు అధికంగానూ, రేయి తక్కువగానూ ఉంటుంది. అందువల్ల మగ్రిబ్, ఇషా, ఫజ్ర్‌లు తొందరగా వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఉపవాస వ్రతంలో ఎదురయ్యే బాధలను ఓర్పుతో సహించగలిగితేనే అనంత కరుణామయుడైన అల్లాహ్ ప్రేమామృతాన్ని పొందే అదృష్టం కలుగుతుంది.
– తస్నీమ్ జహాన్