ఆమె రాజ్యాంగసభలోని సభ్యురాలైనప్పటికీ కుల ప్రాతిపదికన కేటాయించే రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. మహిళలకూ ప్రత్యేకమైన రిజర్వేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆమె మరెవరో కాదు.. రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఏకైక దళిత మహిళా రాజ్యాంగ సభ సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్.
భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలోని మొత్తం 389 మంది సభ్యులలో 15 మంది మహిళలున్నారు. నాడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు మహిళా సభ్యులు రిజర్వేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే వీరు మహిళలకు ఎలాంటి రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయలేదు.
జర్నలిస్ట్ నిధి శర్మ రచించిన పుస్తకం 'షీ ది లీడర్: ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’లో మహిళా రాజకీయ నేతల గురించి లోకానికి అంతగా తెలియని కథనాలను అందించారు. పుస్తకం ప్రారంభంలో 1947, ఆగస్టు 28న షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గం అంశంపై చర్చిస్తున్నప్పుడు.. రిజర్వేషన్‌ను వ్యతిరేకించిన ఏకైక దళిత మహిళా సభ్యురాలు దాక్షాయణి వేలాయుధన్ అని పేర్కొన్నారు.
నాడు సభలో దాక్షాయణి వేలాయుధన్ ఇలా అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘వ్యక్తిగతంగా నేను ఎటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా లేను. దురదృష్టవశాత్తూ బ్రిటీష్ సామ్రాజ్యవాదం మనపై కొన్ని మచ్చలు మిగిల్చింది. మనం హెచుతగ్గులను చూసి భయపడుతున్నాం. అందుకే ఈ అంశాలన్నింటినీ అంగీకరించవలసి వచ్చింది. ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపును తొలగించలేం. సీట్ల రిజర్వేషన్ కూడా ఒక రకమైన ప్రత్యేక ఎంపిక వంటిదే. అయినా మనం దీనిని సహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది అవసరమైన పరిణామం అని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
దాక్షాయణి వేలాయుధన్ ఎవరు?
దక్షిణాయణి వేలాయుధన్ 1912, జూలై 15న నేటి ఎర్నాకులం(కేరళ) జిల్లాలోని చిన్న ద్వీపమైన ముళవుకడ్‌లో జన్మించారు. ఆమె పులయ సమాజానికి చెందినవారు. కుల వ్యవస్థలో వీరి సమాజం అట్టడుగున ఉండేది. ఈ సమాజంలోని వారు వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. అంటరానితనం కారణంగా వారు బహిరంగ రహదారులపై నడవడాన్ని కూడా నిషేధించారు. దీనికితోడు ఈ సమాజానికి చెందిన స్త్రీలు తమ శరీరపు పైభాగాన్ని దుస్తులతో కప్పుకోవడాన్ని నిషేధించారు. ఈ విధంగా పులయ సమాజానికి చెందిన మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
దళితులకు సంబంధించిన కాయాల్ సమావేశం 1913లో కొచ్చిలో జరిగినప్పుడు వేలాయుధన్ కుటుంబసభ్యులతో పాటు తరలివచ్చారు. అక్కడ వారి సమాజానికి తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. ఇటువంటి సంఘటనలు వేలాయుధన్ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. శాసనోల్లంఘన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాయుధన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1945లో దాక్షాయణి కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినేట్ అయ్యారు. ఈ కౌన్సిల్ ద్వారా 1946లో భారత రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు
మరోవైపు ఆమె ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్)వారపత్రిక ‘జై భీమ్’లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూవుండేవారు. డాక్టర్ అంబేద్కర్‌ను విమర్శించడానికి కూడా ఆమె వెనుకాడలేదు. అంబేద్కర్ రాజకీయాలను, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం ఆయన చేసిన డిమాండ్‌ను ఆమె తీవ్రంగా విమర్శించారు. దాక్షాయణి వేలాయుధన్ 1978 జూలై 20న తన 66 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
Comments
Please login to add a commentAdd a comment