రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి.
పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్‌కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది.
సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం.
ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం.
Comments
Please login to add a commentAdd a comment