ఫిత్రా... ఉపవాసులకే పరిమితం కాదు!
రమజాన్ కాంతులు
పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గతంతోపాటు, బాహ్య శరీరంలోకూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈ ప్రత్యేక దానాన్ని షరి అత్ పరిభాషలో ‘సద్ ఖా ఫిత్ర్’అంటారు.
ఫిత్రాదానం చెల్లించనంత వరకూ రమజాన్ ఉపవాసాలు భూమ్యాకాశాల మధ్య వేలాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు. అందుకని ఉపవాసాలు దేవుని స్వీకార భాగ్యానికి నోచుకోవాలంటే ఫిత్రాదానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. దీంతోపాటు ఫిత్రాదానం వల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ముహమ్మద్‌ప్రవక్త (సం) ఫిత్రాదానాన్ని, ‘దీనులు, నిరుపేదల భృతి’అన్నారు. ఈ కారణంగానే ఫిత్రాదానాన్ని కేవలం ఉపవాసులకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ విస్తరించారు. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలి.