కళ్ళు లేకపోతేనేం.. చెవులతో చూస్తాను!
ఆయన ఓ జెన్ గురువు. ఆయన వద్ద పదుల సంఖ్యలో శిష్యులున్నారు. వారిలో ఒకడు అంధుడు. ఓ రోజు కొందరు తోటి శిష్యులు అతనితో నువ్వు ఇప్పటి వరకు మన గురువు గారిని చూడలేదు కదా? అందుకు నువ్వు బాధ పడుతున్నావా? అని అడిగారు. అప్పుడు ఆ అంధుడు నాకెందుకు బాధ? నాకెలాంటి బాధా లేదు అన్నాడు.
అక్కడితో ఆగకుండా కంటి చూపు లేకపోతేనేం. చెవులు ఉన్నాయిగా... అవి వింటాయి. వాటిద్వారా ఆయన గొంతు వింటాను. అలాగే చూస్తాను కూడా. కనుక నాకు ఆయనను చూడలేదేనన్న విచారం ఏ కోశానా లేదు అన్నాడు. నిజమా? ఏమిటీ మాట వల్ల ఒకరిని చూడటం సాధ్యమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ?
నేను చెప్పేది అక్షరాలా నిజం... ఇంకా చెప్పాలంటే మీరు చూడటం కన్నా నేను ఎక్కువ వింటాను. అంతేకాదు, మిమ్మల్నీ, గురువుగారినీ అందరినీ వింటాను, చూస్తాను. అలాగే మీకన్నా ఎక్కువే అర్ధం చేసుకుంటాను... నాకు బోలెడు నిజాలు కూడా తెలుస్తాయి... అన్నాడు అతను.
ఎలాగది? ఏముంది... కొందరు తీయగా మాట్లాడుతారు. కానీ వాళ్ళ గొంతులో ఈర్ష్య కలిసుంటుంది. ఈ ఈర్ష్య వెలుపలికి కనిపించదు. కానీ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. వినిపిస్తుంది. మరి కొందరు మనం ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు ఏదో ఓదారుస్తున్నట్టు కొన్ని మాటలు చెప్తారు. కానీ ఆ మాటలు నిజం కావు. వారు లోలోపల మన ఓటమిని తలచి తలచి హేళనగా నవ్వుకుంటారు. అది నాకు తెలుసు....
మరి మన గురువుగారు...? నేను ఇప్పటి వరకు కలిసిన వారిలో ఆయన ఒక్కరే ఏది మాట్లాడితే ఆ మాటల్లోని భావాలతో మమేకం అవుతారు. ఆయన మాటలో కల్మషం ఉండదు. లోపల ఒకటి ఉంచుకుని బయట ఒకటి మాట్లాడని వారెవరైనా ఉన్నారు అంటే అది మన గురువుగారే... ఆయన మాటకు గానీ భావానికి గానీ తేడా ఉండదు. రెండూ ఒక్కలాగానే ఉంటా యి. ఆయన మాటల్లో ఏవగింపు గానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాట్లాడటం గానీ ఆయనలో నేనిప్పటి వరకూ చూడలేదు... అన్నాడు అంధ శిష్యుడు.
- యామిజాల జగదీశ్‌ర0త