‘నన్ను వెంబడించాలనుకునేవాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి.. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దాన్ని పోగొట్టుకొంటాడు, నా కోసం ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు’ అంటూ యేసుప్రభువు శిష్యులకు తన కొత్తనిబంధన విశ్వాస మార్గాన్ని ఒకరోజు ఉపదేశించాడు. స్వార్థం, స్వాభిమానం, స్వనీతి, స్వలాభం, ’నేను’, ‘నా’ అనే ‘స్వీయత’నంతా వదిలేసుకోవడం విశ్వాసంలో ఒక ప్రధానమైన భాగమైతే, ఇవన్నీ పోగా మిగిలిన తన సిలువను విశ్వాసి తానే మోస్తూ ప్రభువును వెంబడించడం మరో ముఖ్యమైన భాగం!! విశ్వాసి ఇలా ప్రభువు కోసం పాటుపడుతూ తన ప్రాణాన్ని దక్కించుకోగలుగుతాడని, అలా కాకుండా తనను తానే నమ్ముకొని, తన సిలువను తాను మోయనివాడు లోక ప్రలోభాల్లో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకొంటాడని ప్రభువు అన్నాడు. క్రీస్తును వెంబడించే క్రైస్తవ మార్గంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు న్నాయి, దేవుడిచ్చే శాంతిసమాధానాలున్నాయి.
కాని లోకమిచ్చే ఆనందం, వినోదానికి అవి పూర్తిగా అతీతమైనవి. తనను యెరూషలేములో సిలువ వేయబోతున్నారంటూ మూడున్నరేళ్ల తర్వాత ప్రభువు ప్రకటించినపుడే తామెన్నుకు న్నది విలక్షణమార్గమని, పోగొట్టుకోవడమే ఈ మార్గ రహస్యమని శిష్యులకు బోధపడింది. ఇక ఇస్కరియోతు అనే శిష్యుడైతే, ఇదంతా విని యే సుతో విభేదించి, ముప్పై వెండినాణేల ప్రలోభానికి యూదులకు యేసును అమ్మేసి, తనది లాభసాటి బేరమనుకున్నాడు. కాని ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకొని యేసు మాటలు సత్యమైనవని రుజువు చేశాడు. ఆనాడు ఏదెను తోటలో ఆదాము, హవ్వలకు కూడా పోగొట్టుకోవడం, పొందడం అనే అనుభవాల నేపథ్యం అర్థం కాలేదు. దేవుడు వారిద్దరినీ సృష్టించడానికి మునుపే మంచి విషయాలతో లోకాన్ని నింపి సృష్టించి వారికిచ్చాడు.
అయితే వారి హృదయాంతర్యంలోని సింహాసనాన్ని మాత్రం తనకే ప్రత్యేకించాలని ప్రభువు కోరుకుంటే, ఆదాము, హవ్వ లోకాన్నంతా తమ హృదయంలోకి చేర్చుకొని, ఆజ్ఞాతిక్రమం అనే పాపానికి పాల్పడి దేవుణ్ణి ఆ సింహాసనం నుండి దించి బయటికి పంపేశారు. అదీ అక్కడ జరిగిన నిజమైన విషాదం. అయితే ఆదాము, హవ్వ ఎక్కడ విఫలమయ్యారో అక్కడే, కొన్నేళ్ల తర్వాత వారి వారసుడు, విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము దైవాజ్ఞ పాలనే శిరోధార్యమని భావించి గెలుపొందాడు. అబ్రాహాము జీవితమంతా దేవుని ఆజ్ఞల ప్రకారమే, అంటే అన్నీ పోగొట్టుకొంటూ సాగింది. నీ వాళ్ళందరినీ వదిలేసి నేను చూపే కొత్త ప్రాంతానికి వెళ్ళమంటే, తనకు ప్రాణప్రదమైనవన్నీ వదిలేసి ప్రభువే సర్వస్వమనుకొని ఆయన వెళ్ళాడు. చివరికి కడువృద్ధాప్యంలో కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకును కూడా తనకు బలివ్వమని దేవుడు ఆదేశిస్తే, అందుకు కూడా అతను ఆనందంగా సిద్ధమయ్యాడు. విశ్వాస పరీక్షలో అబ్రాహాము నెగ్గినట్టు ప్రకటించాడు దేవుడు. ఇదీ ప్రభువానాడు బోధించిన విశ్వాస మార్గం.
–రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్
ఈమెయిల్:prabhukirant@gmail.com
Comments
Please login to add a commentAdd a comment