అదో ఆశ్రమం. గురువుగారు శిష్యులకు ఎనో విషయాలను సోదాహరణగా చెబుతున్నారు. తాను చెబుతున్న విషయాలు అర్థమవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మధ్యమధ్యలో వాళ్లకు ప్రశ్నలు సంధిస్తూ, వాళ్లు చెబుతున్న సమాధానాలలోని తప్పొప్పులు సరిదిద్దుతున్నారు. అందులో భాగంగా గురువుగారు శిష్యులను ఓ ప్రశ్న అడిగారు– అసలు గురువు ఎందుకు? అని. ఏమి చెప్పాలో తెలియక శిష్యులందరూ ముఖాముఖాలు చూసుకుంటుంటే, ఒక శిష్యుణ్ణి పిలిచి, ‘‘నీ ముఖం ఎలా ఉందో, నీ కళ్లు, ముఖం శుభ్రంగా ఉన్నాయో లేదో చెప్పగలవా?’’ అని అడిగారు. అందుకు ఆ శిష్యుడు ‘‘నా ముఖం నాకు కనపడదు కదా గురువర్యా’’ అన్నాడు. గురువుగారు మందహాసం చేస్తూ, ‘‘నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏం చేస్తావు?’’అనడిగారు. శిష్యుడు ఓ క్షణం ఆలోచించి, ‘‘అద్దంలో చూసుకుంటే నా ముఖం ఎలా ఉందో, నేనెలా ఉన్నానో ఖచ్చితంగా చెప్పొచ్చు గురువుగారూ’’అన్నాడు శిష్యుడు.
‘చక్కగా చెప్పావు. అదే సరైన సమాధానం కూడా. నువ్వు నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే నీ ముఖం గురించి నీకు అంతా అర్థమైపోతుంది. అవునా?’’ అవునన్నట్టు తలూపాడు శిష్యుడు. ‘‘ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏమిటంటే, నీ ముఖాన్ని నువ్వు ఉన్నట్టుగా చూపించే అద్దమే గురువు. గురువు నీకు తెలీని నీ రూపాన్ని నీకు చూపించి, నీలో జ్ఞానాగ్నిని రగిలిస్తాడు. నీలోని శక్తియుక్తులను, నీలోని లోపాలను, నీ ముఖానికి అంటుకుని ఉన్న మురికిని, మరకలను కూడా నీకు చూపిస్తాడు. నీలో ఆత్మవిశ్వాసాన్ని రగుల్కొల్పుతూనే, నీలో ఉన్న అతి విశ్వాసాన్ని తనకున్న జ్ఞానాగ్నితో దహించి వేస్తాడు’’ అంటూ ఒక మామూలు అద్దం ఉదాహరణతో అందరికీ అర్థమయ్యేలా వివరించారు గురువుగారు.
– రమాప్రసాద్ ఆదిభట్ల
కనిపించదు కదా గురువర్యా!
Published Wed, Aug 29 2018 12:09 AM | Last Updated on Wed, Aug 29 2018 12:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment