దేవుడికి చేతకానివి వేషధారణ,నటన
గలిలయ సముద్రం ఆవలనున్న గెరాసేనుల ప్రాంతానికి యేసుప్రభువు ఒకసారి వెళ్లాడు. దారిలో యేసు, ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోనె గాలివానలో చిక్కి మునిగే ప్రమాదం ఏర్పడితే యేసు గాలిని, నీటి పొంగును కూడా గద్దించి నిమ్మళపర్చాడు. అలా గెరాసేనుల దేశానికి వెళ్తే అనేక దయ్యాల పీడితులై భయంకరమైన విధ్వంసక శక్తిని కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు. నీ పేరేమిటని ప్రభువడిగితే తనలో చాలా దయ్యాలున్నాయని సూచిస్తూ ‘సేన’ అని జవాబిచ్చాడు. ప్రభువు ఆజ్ఞతో ఆ దయ్యాలన్నీ అతన్ని వదిలి అక్కడి ఒక పందుల మందలో దూరగా, వాటి ధాటికి తట్టుకోలేక అవి సముద్రంలోకి దూకి చనిపోయాయి. కాని అంతకాలంగా అంతటి విధ్వంసక శక్తిని భరించిన ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై, అత్యంత సాత్వికుడిగా మారాడు. ఆ ప్రాంతాన్నంతా దేవుని సువార్తను అతను ప్రకటించాడని చరిత్ర చెబుతోంది (లూకా 8:26–39).
దయ్యాల సంగతి పక్కనబెడితే, ప్రతి వ్యక్తిలోనూ దేవుడు అనూహ్యమైన శక్తిని నిక్షిప్తం చేశాడు. అది విధ్వంసకశక్తి కావచ్చు, ప్రగతికారక శక్తి కావచ్చు. నిరంతర దైవవాక్యధ్యానం, దేవునితో ఎడతెగని సహవాసం, సద్వర్తనుల సాంగత్యంలో విశ్వాసిలోని శక్తి ప్రగతిశీలకమవుతుంది. మనిషి ఆంతర్యం పల్లపు ప్రదేశం వంటిది. దాంట్లోకి మురుగునీరు చేరితే అది మురికి కూపమవుతుంది. స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే పదిమంది అవసరాలు తీర్చే మంచి నీటి సరస్సు అవుతుంది. మనం జీవితాంతం కలిసి బతకవలసిన వ్యక్తి ‘మనమే’ గనుక మనల్ని మనం సద్వర్తనులుగా సంస్కరించుకోగలిగితే విశ్వాసిగా అదే మన ఘనవిజయం.
లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కతీరు. కొందర్ని కలిస్తే పన్నీటితో తడిసినట్లుంటుంది. మరికొందరిని కదిపితే డ్రైనేజీలో మునిగామా అనిపిస్తుంది. వందలాది దయ్యాల నుండి విముక్తినిచ్చి అతన్ని స్వస్థచిత్తుని చేసిన గాలిని, పొంగే నీటిని గద్దించగలిగిన దేవుని శక్తి ఈ లోకంలోని ఏ వ్యక్తినైనా మార్చగలుగుతుంది. అయితే నేను మారాలి అన్న బలమైన పరివర్తన అరుదుగా కనిపిస్తుంటుంది. అలా నిజపరివర్తన చెందిన విశ్వాసులే సమాజంలో ఆత్మీయ విప్లవాలకు సారథ్యం వహిస్తారు.
దేవుడు ఎన్నడూ చేయనిది, మనిషి మాత్రం ఎప్పుడూ చేయడానికి ఇష్టపడేది ఒకటుంది. అది ‘నటన’! సమాజంలో ఆమోదం, గౌరవం కోసం కొందరు మారినట్టుగా నటిస్తారు. కాని కొద్దిసేపట్లోనే దొరికిపోతారు. దూరం నుండి మంచి నీటికుంటలాగా కనిపించే వేషధారుల విషయం జాగ్రత్త!
వ్యసనాలన్నింటిలోకి అత్యంత భయంకరమైనది ‘వేషధారణ’ లేక నటన! ఈనాడు సమాజాన్ని ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఇది. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్