
ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు గిల్బోవ పర్వతం వద్ద జరిగిన యుద్ధంలో యోనాతానుతో సహా దావీదుకు బద్ధశత్రువైన సౌలు ముగ్గురు కుమారులూ చనిపోయారు. ఓడిపోతున్న సౌలును ఫిలిష్తీయులు తీవ్రంగా గాయపర్చారు. శత్రువుల చేజిక్కడం ఇష్టం లేక తనను కత్తితో చంపమని సౌలు తన అస్త్రాలు మోసే సైనికుని కోరితే అతడు భయపడి ఒప్పుకోకపోగా, తనకత్తిమీద తానే పడి సౌలు ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక అమాలేకీయుడు సౌలు కిరీటాన్ని, కంకణాలను తొలగించి అక్కడినుండి పరుగెత్తుకొంటూ వచ్చి వాటిని దావీదుకిచ్చి సౌలు మరణవార్తను తెలిపాడు. పైగా కొనప్రాణంతో ఉన్న సౌలు ఇక ఎట్లైనా చనిపోతాడనుకొని తానే చంపి వచ్చానని అతను తెలియజేశాడు.
తనను అంతకాలంగా భీకరంగా వెంటాడి, తీవ్రశ్రమల పాలు చేసిన తన బద్ధశత్రువు సౌలు చనిపోయాడని తెలిస్తే దావీదు గొప్పగా సంతోషిస్తాడని, అతని శిబిరంలో ఆరోజు విందులు వినోదాలు జరుగుతాయని, తనను సన్మానిస్తారని ఆ అమాలేకీయుడు ఉహించాడు. కాని సౌలు, యోనాతాను, ఇంకా ఇతర ఇశ్రాయేలు వీరుల మరణవార్త, దేవుని ప్రజలపై ఫిలిష్తీయుల విజయవార్త విని దావీదు దుఃఖంతో కుప్పకూలిపోయి శిబిరంలో ఉపవాస దినాన్ని ప్రకటించాడు. పైగా అభిషిక్తుడైన సౌలు రాజును ఎలా చంపావంటూ నిలదీసి దావీదు ఆ అమాలేకీయునికి మరణశిక్ష విధించాడు.. పైగా వారి సంస్మరణార్ధం దావీదు ఒక విలాపగీతాన్ని రచించి యూదా వారికి నేర్పించాడు (2 సమూయేలు 1:1–27).
అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశ్యాలన్నీ నెరవేరుస్తాడని దేవుడన్నాడు (1 సమూ 13:14,అపో.కా.13:22). సౌలు భ్రష్టుడే, తనను చంపాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నించిన బద్ధశత్రువే, కాని ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడే అతన్ని నియమించిన విషయాన్ని దావీదు మర్చిపోలేదు. ఎన్నో ఆశలతో తాను తన ప్రజలకు రాజుగా నియమించిన సౌలు అలా భ్రష్టుడైపోవడం, అంత అవమానకరంగా ఓటమిపాలై చనిపోవడం మొదట దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచి దుఃఖం కలిగించింది. మనం ఓడిపోతే, పడిపోతే, అభాసుపాలైతే ’చేజేతులా చేసుకున్నాడు, అనుభవించనివ్వు’ అని సంతోషించేవాడు కాదు దేవుడు. మనం పైకి లేవడానికి, నిలదొక్కుకోవడానికి, జీవితాల్ని సరిచేసుకోవడానికి లెక్కలేనన్ని అవకాశాలిచ్చే మన పరలోకపు తండ్రి ఆయన.
లోకంలో పడిపోనివాళ్ళు, పరిశుద్ధులు, నీతిమంతులు ఎవరూ లేరు. దావీదే కాదు, ఆ మాటకొస్తే బైబిల్ లోని మరే ఇతర భక్తుడు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అంతా ఎప్పుడో ఒకసారి పడిపోయిన వారే. అయితే కృపతో దేవుడందించిన సహాయ హస్తాన్ని అందుకొని పైకిలేచినవారే!! ‘నేను ధూళిని, బూడిదను’ అని విశ్వాసులకు జనకుడైన అబ్రాహామే ప్రకటించుకుంటే (ఆది18:27), మమ్మల్ని మించిన వారు లేరంటూ ఎవరైనా మీసాలు మెలేస్తే అదెంత హాస్యాస్పదం? సౌలు తన శత్రువు, భ్రష్టుడన్న విషయాన్ని దావీదు మర్చిపోయి ఒకరాజు స్థాయికి తగినవిధంగా అతని సంస్మరణ ఆచార క్రియలు చేపట్టడం అతని గొప్పదనం.
దేవుని మనసును పసిగట్టి ఆ మేరకు వ్యవహరించడం దావీదు వద్దే నేర్చుకోవాలి. గొప్ప భక్తులే అయినా వాళ్ళూ మనుషులే, మలినులే అన్న విషయాన్ని ఎంతో నిజాయితీతో బయలుపర్చిన బైబిల్ అందుకే పరిశుద్ధగ్రంథమని పిలువబడుతోంది. మాలిన్యం అసలు లేని వాళ్లు కాదు, యేసుప్రభువు కృపతో మాలిన్యం నుండి వేర్పర్చబడినవారే దేవుని రాజ్యాన్ని అత్యద్భుతంగా నిర్మించి పునీతులయ్యారు. ‘పరిశుద్ధత’ దేవుడు మనకు తన ప్రేమకొద్దీ తొడిగే వస్త్రమే తప్ప అది మనం కష్టపడి సాధించే ’కిరీటం’ కాదు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment