విశ్వాసిలో స్వనీతి వల్ల అసంతృప్తి తలెత్తడం, పక్కవాడు లాభపడితే అసూయ చెలరేగటం చాలా అనర్థదాయకం. దేవుని ‘సమ న్యాయవ్యవస్థ’పై అవగాహన లోపించినపుడు ఇలా జరుగుతుంది. అందుకే దేవుని అనంతమైన ప్రేమను, అపారమైన సమన్యాయభావనను ఆవిష్కరించే ఒక చక్కని ఉపమానాన్ని యేసుప్రభువు వివరించాడు (మత్తయి 20:1–16). ఒక భూ యజమాని తన ద్రాక్షతోటలో పనికి తెల్లవారుజామునే కొందరు కూలీలను ఒక దేనారానికి (దాదాపు 220 రూపాయలు) కుదుర్చుకున్నాడు. ఆలస్యంగా 9, 12, 3 గంటలకు ముఖ్యంగా సాయంకాలం 5 గంటలకొచ్చిన కూలీల్ని కూడా ‘మీకేది న్యాయమో అదిస్తాను’ అని చెప్పి ఆయన తన తోటలో పనికి పంపాడు. పని చివర కూలీలందరికీ యజమాని సమానంగా ఒక దేనారాన్నిచ్చాడు.
అయితే ఎక్కువ సేపు, ఎక్కువ పని చేసినందుకు తమకు ఎక్కువ దొరుకుతుందని ఆశించి, భంగపడిన మొదటి కూలీలు తనపై సణుగుతుంటే, ‘మీకిస్తానన్న కూలి మీకిచ్చానుకదా? అందరికీ సమానంగా ‘పూర్తికూలీ’ నేనివ్వాలనుకొంటే మీకెందుకు బాధ? ఇది నా డబ్బు, నా ఔదార్యం!!’ అన్నాడా యజమాని. అవును మరి, దేవుని ఔదార్యం ముందు ప్రపంచంలోని మానవ నిర్మిత న్యాయవ్యవస్థలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. న్యాయవ్యవస్థలకు నేరస్థుని శిక్షించడమే తెలుసు. చాలా సమాజాలకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే తెలుసు. కాని కరడుగట్టిన నేరస్థుని కూడా ప్రేమించి, క్షమించి, సంస్కరించి, తన ప్రేమతో నింపి, అతన్ని సమాజానికి ఆశీర్వాదంగా మార్చే దేవునిది ఉహలకందని ఔదార్యం అన్నది బైబిల్ బోధించే అపూర్వ సత్యం, అద్భుతమైన పాఠం. దేవుని ‘ఔదార్యమే’ పరలోకరాజ్యాన్ని నడిపే రాజ్యాంగం!!
మనం దేవుని పని ఎంత కష్టపడి పనిచేస్తున్నామన్నది కాక, ఎంత ‘ఇష్టపడి’ ఆనందంగా పనిచేస్తున్నామన్నది పరలోకపు యజమాని, న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తాడు, తన ఔదార్యంతో దానికి ప్రతిఫలాన్నిస్తాడు. రాగానే తమకు పని దొరికిందని ఉదయాన్నే వచ్చిన కూలీలు మొదట ఆనందించారు, కాని ఆలస్యంగా వచ్చి, తక్కువ పని చేస్తున్న కూలీలకన్నా తమకు ఎక్కువ దొరుకుతుందన్న దురాశ తో తమ ఆనందాన్నంతా ఆవిరిచేసుకొని అసంతృప్తితో ఇళ్లకెళ్లారు. కాని చివరలో, ఒక గంట కోసమే వచ్చిన కూలీలు, ఎంతో కొంత కూలీ దొరికినా చాలు, ఆ రోజుకు తమ కుటుంబానికి అన్నం పెట్టుకోవచ్చుననుకొంటుంటే, అనూహ్యంగా ఒక పూర్తి దేనారం దొరకడంతో, యజమాని ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బై పట్టరాని ఆనందం తో ఇళ్లకు వెళ్లారు.
అలా, మొదటి కూలీల ఆనందాన్ని ‘దురాశ’ అసంతృప్తి గా మార్చగా. చివరి కూలీల ‘కృతజ్ఞత’ వాళ్ళ దుఃఖాన్ని, లేమిని కూడా అవధుల్లేని ఆనందంగా మార్చిందన్న ‘విశ్వాస నిత్యసత్యాన్ని’ యేసు బోధించాడు. మనకు చెందనిదాన్ని ఆశించడం దురాశేనని, విగ్రహారాధనలాగే దేవునికది హేయమైనదని బైబిల్ చెబుతోంది (కొల 3:5). ఆకాశమంత ఎత్తయిన, మహాసముద్రాలంత లోతైన దేవుని ఔదార్యాన్ని కొలవడం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, మహామేధావులకు కూడా అసాధ్యమే. కాని దేవుని ప్రేమస్పర్శ తో పరివర్తన చెందిన ఒక పాపి, నిరక్షరాస్యుడైనా సరే, దేవుని ఔదార్యాన్ని అనర్గళం గా వివరించగలడు. దేవునిపట్ల కృతజ్ఞత విశ్వాసి ఆంతర్యంలో అనంతమైన ఆనందపు ఊటల్ని సృష్టిస్తుంది. కాని అసంతృప్తి విశ్వాసి జీవితాన్ని ఆర్పి బూడిదగా మార్చుతుంది.
విశ్వాసుల జీవితాల్లో నిత్యశాంతి, కుటుంబశాంతి కరువైందంటే తప్పకుండా వాళ్లలోనే ఏదో లోపమున్నట్టే. కొళాయి విప్పి దాని కింద బిందెను తలకిందులుగా పెడితే అది నిండుతుందా? దేవుని రాజ్య మౌలిక విలువలు, దేవుని రాజ్యాంగ నిర్దేశనలు, దేవుని ఔదార్యానికి అనువుగా ఎప్పటికప్పుడు జీవితాలను ‘సరిచేసుకునే’ విశ్వాసుల్లో అందుకే ఆనందం, సంతృప్తి, జీవన సాఫల్యం సమృద్ధిగా పొర్లిపారుతుంది. ‘నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు’ అన్నాడు ప్రభువు (యోహాను 15:5).
దేవుని తోటలో పని దొరికితే, కేవలం ‘అదనపు డబ్బుకు’ ప్రలోభపడి దేవునికి దూరమైన ఈ ఏశావు బాపతు వాళ్ళనేమనాలి? అయితే, తాము పూర్తి కూలి పొందే అర్హత లేనివాళ్లమని గ్రహించి ఎంతో తగ్గింపుతో, కృతజ్ఞత తో దేవుని హత్తుకున్న చివరి కూలీలతోనే దేవుడు తన రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించుకొంటున్నాడు. మనమంతా ఆ వర్గం విశ్వాసులలోనే ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే దేవుని రాజ్యం, మన అర్హతలతో కాదు, దేవుని ఔదార్యంతో నిర్మించబడుతుంది, నడుస్తుంది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment