హెబ్రోను నుండి దావీదుపురం లేదా యెరూషలేముకు తన రాజధానిని మార్చిన తర్వాత అక్కడ దావీదు చక్రవర్తి తన నివాసం కోసం గొప్ప రాజప్రాసాదాలను, తన సిబ్బంది, సైన్యం కోసం వందలాది ఇళ్లను కట్టించాడు. అత్యంత పవిత్రమైన దేవుని నిబంధన మందసాన్ని కూడా దావీదుపురానికి తెచ్చి, ఒక గుడారం వేసి అందులో ఉంచాడు. అయితే ఎంతో దీనస్థితి నుండి చక్రవర్తి స్థాయికి ఎదిగిన తానేమో దేవదారు పలకలు పొదిగిన మహా భవనాల్లో నివసించడం, తన ఔన్నత్యానికి కారకుడైన దేవదేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన నిబంధన మందసమేమో తాత్కాలికమైన ఒక గుడారంలో ఉండటం దావీదుకు బాధకలిగించింది.
వెంటనే ప్రవక్తయైన నాతానును దావీదు పిలిపించి, దేవుని నిబంధన మందసం కేంద్రంగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలనుకొంటున్నానని ప్రకటించాడు.దేవునికి మందిరం కట్టాలనుకోవడమనేది ఎంతో ఉదాత్తమైన ఆలోచన, అందులో తప్పేముంది? అన్న భావనతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ నాతాను దావీదుకు జవాబిచ్చాడు (1 దిన 17:1–14). అదే సమస్య అయ్యింది. రాజులకైనా, సామాన్య ప్రజలకైనా, ప్రవక్తగా నాతాను ప్రతి విషయాన్నిదేవుని సన్నిధిలో విచారించి తెలుసుకొని వారికి బదులివ్వాలి.
కాని అది చక్రవర్తి ఆలోచన, పైగా మందిరం కడతానంటున్నాడు కదా, అందులో తప్పేముంది? అన్న ఉద్దేశ్యంతో నాతాను ’నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ’ రాజుకు పూర్తి స్వేచ్ఛనివ్వడం దేవుడు హర్షించలేదు. నాకు మందిరాన్ని దావీదు కాదు, అతని కుమారుడైన సొలొమోను కడతాడంటూ ఆ రాత్రి దేవుడు నాతానుతో సెలవిస్తే, అదే విషయాన్ని నాతాను మరునాడు దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశానికి దావీదు చేసినంత సేవ మరెవరూ చేయకున్నా, మందిరం కట్టే ఘనతను మాత్రం దేవుడు అతనికియ్యలేదు. అలా దావీదు కట్టిన మహా మందిరంగా చరిత్రలో పేరుగాంచవలసిన యెరూషలేము మందిరం, దేవుని చిత్తంతో సొలొమోను కట్టిన మందిరంగా ప్రసిద్ధి చెందింది.
దేవుని పనులు మనుషుల ఆలోచనలతో కాదు, దైవాభీష్టం మేరకు జరిగినప్పుడే లోక కల్యాణమవుతుంది. దైవప్రతినిధిగా నాతాను దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ దావీదును ప్రోత్సహించడం దేవునికి రుచించలేదు. పైకి మహాచక్రవర్తిగా అందరి మన్ననలందుకొంటున్న దావీదు హృదయం లోపలి పొరల్లోని రహస్యపుటాలోచనలు, దురాలోచనలు ప్రవక్తే అయినా మానవమాత్రుడైన నాతానుకు తెలియదు, కాని దేవదేవునికి తెలుసు. దావీదు, చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న రహస్యాలోచనతో మందిరాన్ని కడతానంటున్నాడా లేక నిజంగా దేవుని మహిమ కోసమే కడతానంటున్నాడా... అన్నది దేవుడు తెలుసుకోలేడా? అందుకే, హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలది అంటోంది బైబిల్ (యిర్మీ 17:9).
బైబిల్‌లో దైవిక విషయాల్లో ‘హృదయం’ అనే ప్రస్తావన వచ్చినపుడు, అది శరీరానికంతటికీ రక్తప్రసరణ చేసే ‘గుండె’గా కాక, మానవ జీవన స్థితిగతులన్నింటికీ మూలమైన, కీలకమైన నిర్ణయాలను చేసే ఒక ‘ఆలోచనావ్యవస్థ’గా దాన్ని అర్థం చేసుకోవాలి. దావీదు అది సరిగ్గా అర్థం చేసుకున్నాడు గనకే దేవుని ఆలోచనకు సమ్మతి తెలిపాడు, ‘నా హృదయానికి ఏక దృష్టిననుగ్రహించు’ అంటూ ప్రార్థించాడు (కీర్తన 86:11), తన నడవడిక, ఆలోచనల్లో ఏవీ దేవునికి అగోచరం కాదంటూ దేవుని స్తుతించాడు (కీర్తన 139).
జీవితంలో మనం ఆయా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశించి, జీవితాన్ని శాసిస్తాయి. అయితే దేవుని సహాయంతో కాక మానవ హృదయంతో ఆలోచించి తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీర్ఘకాలంలో తీరని అశాంతిని రేపి జీవితాన్ని దుర్భరం చేసిన ఉదంతాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల స్వభావసిద్ధంగా ఒక ‘స్వతంత్ర ఆలోచనా వ్యవస్థ’గా పని చేయాలనుకునే మన హృదయానికి ‘దేవుని వాక్యం’ అనే కళ్లెం వేయడం శుభప్రదమైన పరిణామం. విచ్చలవిడితనం, అహంకారం, స్వార్థం, దుర్మార్గం వంటి అనేక పాపాలకు ప్రాప్తిస్థానంగా దుర్గంధపూరితమై ఉన్న హృదయానికి స్వచ్ఛమైన దైవవాక్యంతో ఉదకస్నానం చేయించాలి. దేవుణ్ణి అలా అక్కడే స్థిరప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడది జీవజలాల ఊటలకు, లోకళ్యాణకారకమైన ఆలోచనలకు, చెరగని పవిత్రతకు స్థిర నివాసమై జీవితంలో శాంతి పరిమళించడానికి పునాది అవుతుంది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment