అపజయమంటే ఎవరికైనా బాధే!! కొన్ని అపజయాలైతే ఎన్నటికీ మర్చిపోలేని చేదు అనుభవాలను మిగిల్చి ముందుకు సాగకుండా చేస్తాయి. కాని విశ్వాస జీవితంలో అపజయాలు కొన్నిసార్లు అవసరమవుతాయి కూడా. కొన్ని అపజయాల్లో నేర్చుకున్న అత్యంత విలువైన పాఠాలు భవిష్యత్తులో మహా విజయాలకు పునాది రాళ్ళవుతాయి. అందుకే దావీదు ‘శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను’ అంటాడు( కీర్తన 119:71). గొప్ప పట్టణమైన యెరికోలో సాధించిన ఘనవిజయం నేర్పిన పాఠాలకన్నా ఎంతో చిన్నదైన హాయి పట్టణంలో ఎదురైన ఘోరపరాజయం, ఇశ్రాయేలీయులకు, వారి నాయకుడైన యెహోషువకు అత్యంత విలువైన పాఠాలు నేర్పింది.
యెరికోలో ఆకాను అనే వ్యక్తి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఉదంతంతోపాటు, దేవుని వాగ్దానాలు, సహాయం మీదకన్నా, ‘అది చాలా చిన్న పట్టణం, రెండుమూడు వందల మంది చాలు హాయిని జయించడానికి’ అంటూ వేగులవాళ్ళు తెచ్చిన సమాచారం మీద పూర్తిగా ఆధారపడ్డ కారణంగా యెహోషువ, అతని జనులు అక్కడ ఘోరంగా పరాజయం పాలయ్యారు. పైగా యెరికో దాడిలో, దేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన దేవుని మందసం ఇశ్రాయేలీయులతోనే ఉంది. అలా యెరికో జైత్రయాత్రలో దేవుడే ప్రత్యక్షపాత్రను నిర్వర్తించాడు. అందుకే ఆ పట్టణాన్ని అంత సునాయాసంగా ఇశ్రాయేలీయులు గెలిచారు.
యెరికో చాలా పెద్ద పట్టణం కదా దేవుని తోడుండాలనుకున్నారు, హాయి చాలా చిన్నదే కాబట్టి దేవుని తోడు అఖ్ఖర్లేదు, లక్షలమంది సైన్యమూ అవసరం లేదు, రెండు మూడువేలమంది మాత్రం చాలునన్న తప్పుడు వ్యూహం పన్ని, దారుణంగా ఓడిపోయారు. యెరికో విజయాన్ని ఆస్వాదించే అవకాశమే లేకుండా హాయి ఘోరపరాజయం ఇశ్రాయేలీయులను పూర్తిగా కుంగదీసింది (యెహోషువ 7). ఎన్నో గొప్ప విజయాలు సాధించిన విశ్వాసుల జీవితాల్లో చాలా చిన్నచిన్న విషయాల్లో ఎదురయ్యే అపజయాలే శాంతి, సంతృప్తి లేకుండా దిగజార్చుతాయి. ‘నేను’ ‘నా’ అన్న పదజాలం, భావజాలం దేవుని తోడ్పాటు అఖ్ఖరలేకుండా ముందుకు సాగవచ్చునన్న నకిలీ ధీమాను విశ్వాసికి కలుగజేస్తాయి.
ప్రపంచాన్ని శాసించే స్థాయిని చేరుకున్న గొప్ప విశ్వాసులు, ఇంట్లో భార్య, పిల్లలే తమ మాట వినని దీనపరిస్థితుల్లో అంతర్గతంగా కుంగి కుమిలిపోయే దుస్థితి ఏర్పడేందుకు దేవుని విస్మరించడమే కారణం. యెరికోలో అసలు యుద్ధమే జరుగలేదు, కాని దేవుడు వారితో ఉన్నందున ఘనవిజయం సొంతమైంది. హాయి పట్టణస్థులు సంఖ్యలో కొద్దిమంది, పైగా చాలా బలహీనులైనా, దేవుడు తమతో లేని కారణంగా ఎంతో బలవంతులైన ఇశ్రాయేలీయులు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. విషయం చిన్నదైనా, ఎంతో పెద్దదైనా దేవుని తోడ్పాటు ఉంటేనే జీవితంలో విజయం వరిస్తుందున్న ప్రాథమిక పాఠాన్ని విశ్వాసి నేర్చుకోవాలి.
నిజానికి యెరికో విజయం తర్వాత హాయిపై దాడికి వెళ్ళడానికి ముందు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటే ఇంత అనర్ధం జరిగుండేది కాదు. యెరికో విషయంలో ఆకాను అనే వ్యక్తి చేసిన పాపాన్ని దేవుడు అప్పుడే తెలిపి ఉండేవాడు, ప్రాయశ్చిత్తం జరిగి ఉండేది, హాయిలో మొదటే విజయం వరించి ఉండేది. కుటుంబంలో పరిస్థితులు విషమించిన తర్వాత మోకరించి ప్రార్ధించేకంటే, తల్లిదండ్రులు ఆరంభం నుండీ ప్రార్ధనా జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిని విస్మరించకుండా ఉంటే కుటుంబాల్లో శాంతికి విఘాతం కలుగదన్నది విశ్వాసులు తెలుసుకోవాలి. విజయాలు సాధించేవారికే అపజయాల ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.
దేవునితో ఎడతెగని బాంధవ్యమే జీవితంలో, కుటుంబంలో శాంతి పరిమళించడానికి ప్రధాన కారణం. జీవితంలో విజయాలు, అపజయాలు అంతర్భాగం. కాని అపజయం పొందిన తర్వాత దేవుని ప్రార్ధించి, నిందించే బదులు మన జీవితంలో ఉన్న ఆకానులను, అవిధేయతలను ముందు తెలుసుకొని పరితాపం చెందాలి. అది జరగకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా ఎంత ప్రార్ధించినా ఫలితముండదు సరికదా అపజయాలు కొనసాగుతూనే ఉంటాయి.
బాక్సింగ్ లో తిరుగులేని జగద్విజేత మహమ్మద్ అలీ మార్చి 8,1961న తనతో తలపడుతున్న జో ఫ్రేజియర్ అనే బాక్సర్‌ను బాక్సింగ్ రింగ్‌లోనే తూలనాడుతూ అత్యంత అవమానకరంగా మాట్లాడాడు. బాక్సింగ్‌లో నేను చక్రవర్తిని, నన్ను ఓడించేవాడే లేడు, నువ్వెంత, నీ బలమెంత... ఒక చీమలాగా నిన్ను నలిపేస్తానంటూ హుంకరించాడు. ఆ తర్వాత కొద్దినిముషాలకే జో ఫ్రేజియర్ కొట్టిన ఒకే ఒక అనూహ్యమైన దెబ్బకు దిమ్మతిరిగి కిందపడిపోయి ప్రపంచ చాంపియన్షిప్‌ను చేజార్చుకున్నాడు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment