సూర్యుని చూడలేకపోయినా, సూర్యుని ‘నీడ’ లో సేదదీరగలం. అలాగే దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడకున్నా, దేవుని నీడను, కృపను, ముఖ్యంగా ఆయన అదృశ్యహస్తపు మహాశక్తిని ఎస్తేరు తన జీవితంలో అడుగడుగునా అనుభవించింది. ఎస్తేరు ఒక సాధారణ యువతి, బబులోనులో యూదుబానిస, తనవాళ్లంటూ లేక మొర్దేకై అనే బంధువు వద్ద ఆశ్రయం పొందిన అనాథ. కాకపోతే ఎస్తేరు పుష్కలంగా దైవభయమున్న అసమానమైన సౌందర్యవతి. బబులోను మహారాణి వష్తి పదవీచ్యుతురాలైనపుడు, వందలాదిమంది లో అనామకురాలైన ఎస్తేరు ఆ పదవికి ఎంపికై, బబులోను సామ్రాజ్యానికి మహారాణి కావడం వెనుక దేవుని అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. తాను మహారాణినయ్యానంటూ ఆమె ఎప్పుడూ విర్రవీగలేదు.
కాని, బైబిల్ భాషలో చెప్పాలంటే, తగిన సమయంలో దేవుడు తనను హెచ్చిస్తాడన్న విశ్వాసంతో బలిష్టమైన ఆయన చేతికింద దీనమనసుతో, దైవభయంతో ఆమె జీవించింది(1పేతురు 4:6). అయితే తల్లిగర్భంలో ఆకృతిని కూడా పొందక మునుపే ఎస్తేరు పట్ల సంసిద్ధమైన దేవుని అనాది సంకల్పం అమలయ్యే రోజొకటి రానే వచ్చింది. యూదులకు బద్ధశత్రువులైన అమాలేకీయుల అగగు అనే రాజు సంతతికి చెందిన హామాను(1సమూ 15:8) తాను ప్రధానమంత్రి కాగానే, బబులోను సామ్రాజ్యంలోని యూదులందరి ఊచకోతకు ముహూర్తం కూడా నిర్ణయించాడు. ఎస్తేరు పెంపుడు తండ్రి మొర్దేకై ఆ సమాచారాన్ని ఎస్తేరుకు చేరవేసి, చక్రవర్తిని కలిసి ఆ తాకీదును రద్దుచేయించమన్నాడు. ఎస్తేరు యూదురాలన్న విషయం అత్యంత రహస్యం. అందువల్ల ఇపుడా విషయం తెలిస్తే చక్రవర్తి అహేష్వేరోషు ఆమెకు మరణదండన విధించవచ్చు. పైగా ఆహ్వానం లేకుండా చక్రవర్తి సన్నిధికి వెళ్లిన వారికి, ఆయన ప్రసన్నుడైతే తప్ప, విధిగా మరణ దండన విధించాలన్న చట్టం ఉంది.
సమస్య ఒక మహాపర్వతం లాగా ఎదురైతే, ఎంత భక్తి ఉన్నా ప్రాణభయానిదే పై చెయ్యి అవుతుంది. ఎస్తేరు ప్రాణభయాన్ని వ్యక్తం చేయగా, మొర్దేకై ‘నీవు మౌనం వహిస్తే, దేవుని తన ప్రజలకు మరో విధంగా సహాయం చేస్తాడు. కాని ఈ సమయం కోసమే నిన్నింతగా హెచ్చించిన దేవుని సంకల్పాన్ని నీవు నిర్వీర్యం చేస్తున్నావేమో చూసుకో!!’ అంటూ సరైన సమయంలో, సరైన హెచ్చరిక చేశాడు. ఆ వెంటనే నేను నశిస్తే నశిస్తాను, కాని దేవుని ప్రజల్ని కాపాడుతానని ఎస్తేరు తీర్మానించుకొని, తన కోసం ప్రార్ధించమంటూ మొర్దేకైని, తన యూదుప్రజలను వేడుకొంది. వాళ్ళ ప్రార్ధనా బలంతో, కొండంత విశ్వాసంతో ఎస్తేరు చక్రవర్తి సన్నిధికి వెళ్లగా, ఆయన ప్రసన్నుడై ఆమె కోరినట్టే తాకీదును రద్దు చేసి, యూదుల్ని సంహరించాలనుకున్న హామానును, అతని కుటుంబాన్నంతటినీ నాశనం చేశాడు. అలా ఎస్తేరు తన ప్రాణాలకు తెగించి, తన వాళ్ళైన వేలాది మంది ప్రాణాలు కాపాడింది.
దీనంతటిలో ఎస్తేరుది ప్రత్యక్షపాత్ర కాగా, మొర్దేకైది పరోక్షమైనదైనా అత్యంత ప్రధానమైన పాత్ర. ఒకానొక కీలకమైన దశలో, ఎస్తేరును దేవుని ఆలోచనతో అనుసంధానం చేసి, ఆమెను కార్యోన్ముఖురాలిని చేశాడతను. ఈ మొర్దేకై పాత్రను విశ్వాసుల కుటుంబాల్లో తల్లిదండ్రులు, చర్చిల్లో పాస్టర్లు నిర్వహించాలి. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవాళ్లు. ఇపుడు తల్లిదండ్రులే పిల్లలకు భయపడే ఆధునిక విష సంస్కృతి వ్యాపిస్తోంది. పిల్లలకు ‘ఇది తప్పు’ అని తల్లిదండ్రులు చెప్పడమే తప్పైపోయిన ‘భ్రష్ట యుగం’ మనది. ఇప్పటి పాస్టర్లు బైబిల్లో మర్మాలు, కొత్త కొత్త విషయాలు గొప్పగా చెబుతారు. కాని ‘తప్పును తప్పు’ అని ధైర్యంగా చెప్పే పరిస్థితే లేదు.‘కరెక్షన్’ అంటే ‘దిద్దుబాటు’ లేని కుటుంబాలు, చర్చీలే సమాజాన్ని ఛిద్రం చేస్తాయి. పూర్వం నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ కుటుంబాల్ని ఎంతో గొప్పగా నిర్మించుకొని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే, ఎంతో చదువున్న నేటి తరం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యలేక గాలికొదిలేస్తున్నారు. ‘నేనొక పల్లెటూరివాణ్ణి, నాది నిరక్షరాస్య నేపథ్యం’ అంటూ డప్పు కొట్టుకోవడం కాదు, ఈ నాటి ఉన్నతస్థితిలో దేవునికి, నీ వాళ్లకు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబుందా? ఇళ్లలో, చర్చిల్లో ఎస్తేరులు, మొర్దేకైలు లేక విశ్వాసులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరకపోతే, అదొక మహా సంక్షోభం.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment