
దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితనాన్ని నైలు నదిలో, ఒక జమ్ముపెట్టెలో ఒంటరిగా గడిపాడు. ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచినా, అక్కడా తనవాళ్లెవరూ లేని ఒంటరితనమే నలభై ఏళ్ళ పాటు మోషేను వెంటాడింది. తన వాళ్ళనుకొని హెబ్రీయుల వద్దకు వెళ్తే వాళ్ళతణ్ణి ఈసడించి మరింత ఒంటరి వాణ్ణి చేశారు. ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి, అక్కడ తనకు పిల్లనిచ్చిన మామతో మందలు మేపుతూ, తన జీవితానికంటూ ఒక గమ్యం, లక్ష్యం, అర్ధం కనబడని పరిస్థితుల్లో మోషే మరో నలభై ఏళ్ళు గడిపాడు. అలా ఎనభై ఏళ్ళు నిండిన పండు వృద్ధుడై జీవితాంతంలో తానిక ప్రజలకు కాని, తన దేవునికి కాని చేయగలిగిందేమీ లేదనుకొని తీవ్ర నిస్పృహకు, తీరని ఒంటరి భావనకు లోనైన దశలో మోషే రాసిన 90వ కీర్తన, బైబిల్‌లోని 150 కీర్తనల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది.
ఎంతో ప్రతిభ కలిగి, దేవునిలో అత్యున్నతంగా ఎదిగి కూడా, దేవుడు తన ద్వారా ఏం చెయ్యాలనుకొంటున్నాడో తెలియని పరిస్థితుల్లో, అదిక తన జీవిత చరమాంకమనుకొని ‘మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు, అధికబలముంటే ఎనభై సంవత్సరాలు’ అని ఆ కీర్తనలో మోషే పాడుకున్నాడు (కీర్తన 90:10). అయితే దేవుడతని ఆలోచనలు తారుమారు చేస్తూ, హోరేబు కొండమీద ఒక మండే పొద ద్వారా ప్రత్యక్షమై ‘ఇది నీ జీవితానికి అంతం కాదు, ఆరంభం’ అన్నట్టుగా తన దర్శనాన్నిచ్చాడు. తన ప్రజల్ని దాస్య విముక్తులను చేసి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచర్యను మోషేకు అప్పగించాడు. ఆ నలభై ఏళ్ల పరిచర్యతో మోషే జీవితానికి సాఫల్యత, సార్థకత లభించి, తాననుకున్నట్టుగా 80 ఏళ్లకు కాక, 120 ఏళ్లకు విజయవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడు.
దేవునికున్న అత్యంత విశేషమైన లక్షణాల్లో ఒకటి ‘ఆయన ఆశ్చర్యకరుడు’ అన్నది (యెషయా 9:6). మానవాళిని, లోకాన్ని ఆశ్చర్యపర్చడంలో దేవుని మించిన వారు లేరు. కరోనావైరస్ లోకాంతానికి సూచన అంటూ హడావుడి చేస్తున్నారు. చర్చిల్లో, విశ్వాసుల్లో నాణ్యత, పరిపక్వత, నిబద్ధత తగ్గి, మాలిన్యం, రాజకీయాలు, ప్రచారాలు, ధనమొహం, వేషధారణ, ఆడంబరాలు, అహంకారం పెచ్చరిల్లి, దేవుని స్థానాన్ని అవి ఆక్రమించిన పరిస్థితుల్లో, కరోనావైరస్ ఒక ప్రమాద ఘంటిక!! కరోనావైరస్ ఈ అవలక్షణాలన్నింటినీ అంతం చెయ్యాలి, అంతం చేస్తోంది కూడా. పది నెలలుగా చర్చిలు నడవడం లేదు, మొన్నటిదాకా దేవుని స్థానాన్ని చర్చి తీసేసుకుంటే, కరోనావైరస్ విశ్వాసుల్ని ఇపుడు మళ్ళీ దేవుని పాదాల వద్దకు తెచ్చింది. మనిషి ఆలోచనల్ని తారుమారు చేసి, ఆయన తన పద్ధతిలో తన ప్రణాళికల్ని అమలు చేసి ఆశ్చర్యపరిచే దేవుడని మరోసారి రుజువైంది. తాను మహా అయితే 80 ఏళ్ళు బతుకుతానేమో అని మోషే అనుకుంటే, దేవుడతనికి 120 ఏళ్ళ ఆయుష్షునివ్వడమేకాక, జీవితంలోని అతని చివరి దశను అద్భుతమైన పరిచర్యతో నింపి దేవుడతణ్ణి ఆశ్చర్యపరిచాడు.
తననాశ్రయించిన ఎవరి జీవితాన్నైనా అనూహ్యమైన ఆశీర్వాదాలతో నింపి, అంతాన్ని ఆరంభంగా, ఆనంద సముద్రంగా మార్చగల సమర్థుడు దేవుడు. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు దుర్భరమైన ఏకాంత కారాగారావాసాన్ని గడిపినా, అతని దీక్ష, దర్శనం మసకబారలేదు. మనసుని పిండి పిప్పి చేసే ఏకాంతంలోనూ దేవుడే తనతోపాటు ఉండి జైల్లో తాను బలహీనపడకుండా కాపాడాడని తనకు అత్యంత సన్నిహితుడైన మెథడిస్ట్ బిషప్ పుంవలానాకు జైలు నుండి రాసిన ఒక లేఖలో మండేలా పేర్కొన్నాడు. అయితే తన క్రైస్తవ సాక్ష్యాన్ని బహిరంగం చేసి ప్రజల్లో రాజకీయవిభేదాలకు కారణం కావడం కన్నా, ఆ విశ్వాసాన్ని తనకు, తన దేవునికి మధ్య గల అత్యంత అపురూపమైన బంధంగా దాచుకోవడమే తనకిష్టమని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సంకుచితత్వానికి మారుపేరైన డాంబిక క్రైస్తవులకు ఈ మార్మికత అర్థం కాదు. దుర్భరమైన జైలుజీవితం నేపథ్యంలో కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఆయన అందించినసేవల్లో అణువణువునా క్రైస్తవ క్షమ, ప్రేమా సౌరభమే గుబాళిస్తుంది. తనను ఆశ్రయించిన వారికెవరికైనా జీవనసార్థకతను, సాఫల్యాన్నివ్వడానికి దేవుడు ఏ దశలోనైనా సిద్ధమే.
– రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్