Moses
-
మార్గదర్శిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సామర్లకోట: మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడుకొన్నప్పటికీ, సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు. సామర్లకోట సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం కాకినాడలోని డెయిరీ ఫార్మ్ సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన పెంకె మోజెస్ 2020 మార్చిలో మార్గదర్శి ఏజెంట్ ద్వారా సామర్లకోట బ్రాంచిలో రూ.లక్ష విలువ కలిగిన రెండు చిట్స్ తీసుకొన్నారు. ఒక్కో చిట్కు నెలకు రూ.2,500 చెల్లిస్తున్నారు. నాలుగు నెలల తరువాత ఒక చిట్‌ను రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయనకు రావలసిన రూ.80 వేలకు సంబంధించి మార్గదర్శి బ్రాంచి మేనేజరును సంప్రదించగా ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ కావాలని చెప్పారు. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల స్యూరిటీ ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ ఇవ్వలేకపోయారు. దాంతో రూ.80 వేలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మోజెస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో మోజెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనిచ్చిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!
దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితనాన్ని నైలు నదిలో, ఒక జమ్ముపెట్టెలో ఒంటరిగా గడిపాడు. ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచినా, అక్కడా తనవాళ్లెవరూ లేని ఒంటరితనమే నలభై ఏళ్ళ పాటు మోషేను వెంటాడింది. తన వాళ్ళనుకొని హెబ్రీయుల వద్దకు వెళ్తే వాళ్ళతణ్ణి ఈసడించి మరింత ఒంటరి వాణ్ణి చేశారు. ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి, అక్కడ తనకు పిల్లనిచ్చిన మామతో మందలు మేపుతూ, తన జీవితానికంటూ ఒక గమ్యం, లక్ష్యం, అర్ధం కనబడని పరిస్థితుల్లో మోషే మరో నలభై ఏళ్ళు గడిపాడు. అలా ఎనభై ఏళ్ళు నిండిన పండు వృద్ధుడై జీవితాంతంలో తానిక ప్రజలకు కాని, తన దేవునికి కాని చేయగలిగిందేమీ లేదనుకొని తీవ్ర నిస్పృహకు, తీరని ఒంటరి భావనకు లోనైన దశలో మోషే రాసిన 90వ కీర్తన, బైబిల్లోని 150 కీర్తనల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ఎంతో ప్రతిభ కలిగి, దేవునిలో అత్యున్నతంగా ఎదిగి కూడా, దేవుడు తన ద్వారా ఏం చెయ్యాలనుకొంటున్నాడో తెలియని పరిస్థితుల్లో, అదిక తన జీవిత చరమాంకమనుకొని ‘మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు, అధికబలముంటే ఎనభై సంవత్సరాలు’ అని ఆ కీర్తనలో మోషే పాడుకున్నాడు (కీర్తన 90:10). అయితే దేవుడతని ఆలోచనలు తారుమారు చేస్తూ, హోరేబు కొండమీద ఒక మండే పొద ద్వారా ప్రత్యక్షమై ‘ఇది నీ జీవితానికి అంతం కాదు, ఆరంభం’ అన్నట్టుగా తన దర్శనాన్నిచ్చాడు. తన ప్రజల్ని దాస్య విముక్తులను చేసి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచర్యను మోషేకు అప్పగించాడు. ఆ నలభై ఏళ్ల పరిచర్యతో మోషే జీవితానికి సాఫల్యత, సార్థకత లభించి, తాననుకున్నట్టుగా 80 ఏళ్లకు కాక, 120 ఏళ్లకు విజయవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడు. దేవునికున్న అత్యంత విశేషమైన లక్షణాల్లో ఒకటి ‘ఆయన ఆశ్చర్యకరుడు’ అన్నది (యెషయా 9:6). మానవాళిని, లోకాన్ని ఆశ్చర్యపర్చడంలో దేవుని మించిన వారు లేరు. కరోనావైరస్ లోకాంతానికి సూచన అంటూ హడావుడి చేస్తున్నారు. చర్చిల్లో, విశ్వాసుల్లో నాణ్యత, పరిపక్వత, నిబద్ధత తగ్గి, మాలిన్యం, రాజకీయాలు, ప్రచారాలు, ధనమొహం, వేషధారణ, ఆడంబరాలు, అహంకారం పెచ్చరిల్లి, దేవుని స్థానాన్ని అవి ఆక్రమించిన పరిస్థితుల్లో, కరోనావైరస్ ఒక ప్రమాద ఘంటిక!! కరోనావైరస్ ఈ అవలక్షణాలన్నింటినీ అంతం చెయ్యాలి, అంతం చేస్తోంది కూడా. పది నెలలుగా చర్చిలు నడవడం లేదు, మొన్నటిదాకా దేవుని స్థానాన్ని చర్చి తీసేసుకుంటే, కరోనావైరస్ విశ్వాసుల్ని ఇపుడు మళ్ళీ దేవుని పాదాల వద్దకు తెచ్చింది. మనిషి ఆలోచనల్ని తారుమారు చేసి, ఆయన తన పద్ధతిలో తన ప్రణాళికల్ని అమలు చేసి ఆశ్చర్యపరిచే దేవుడని మరోసారి రుజువైంది. తాను మహా అయితే 80 ఏళ్ళు బతుకుతానేమో అని మోషే అనుకుంటే, దేవుడతనికి 120 ఏళ్ళ ఆయుష్షునివ్వడమేకాక, జీవితంలోని అతని చివరి దశను అద్భుతమైన పరిచర్యతో నింపి దేవుడతణ్ణి ఆశ్చర్యపరిచాడు. తననాశ్రయించిన ఎవరి జీవితాన్నైనా అనూహ్యమైన ఆశీర్వాదాలతో నింపి, అంతాన్ని ఆరంభంగా, ఆనంద సముద్రంగా మార్చగల సమర్థుడు దేవుడు. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు దుర్భరమైన ఏకాంత కారాగారావాసాన్ని గడిపినా, అతని దీక్ష, దర్శనం మసకబారలేదు. మనసుని పిండి పిప్పి చేసే ఏకాంతంలోనూ దేవుడే తనతోపాటు ఉండి జైల్లో తాను బలహీనపడకుండా కాపాడాడని తనకు అత్యంత సన్నిహితుడైన మెథడిస్ట్ బిషప్ పుంవలానాకు జైలు నుండి రాసిన ఒక లేఖలో మండేలా పేర్కొన్నాడు. అయితే తన క్రైస్తవ సాక్ష్యాన్ని బహిరంగం చేసి ప్రజల్లో రాజకీయవిభేదాలకు కారణం కావడం కన్నా, ఆ విశ్వాసాన్ని తనకు, తన దేవునికి మధ్య గల అత్యంత అపురూపమైన బంధంగా దాచుకోవడమే తనకిష్టమని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సంకుచితత్వానికి మారుపేరైన డాంబిక క్రైస్తవులకు ఈ మార్మికత అర్థం కాదు. దుర్భరమైన జైలుజీవితం నేపథ్యంలో కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఆయన అందించినసేవల్లో అణువణువునా క్రైస్తవ క్షమ, ప్రేమా సౌరభమే గుబాళిస్తుంది. తనను ఆశ్రయించిన వారికెవరికైనా జీవనసార్థకతను, సాఫల్యాన్నివ్వడానికి దేవుడు ఏ దశలోనైనా సిద్ధమే. – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలను కాలదన్నుకున్నట్లే!
దేవుడు వాగ్దానం చేసిన దేశం ఎంత గొప్పదో ముందే తెలిస్తే అక్కడికెళ్లడానికి ఇశ్రాయేలీయులు వేగిరపడ్తారని భావించి, నాటి నాయకుడైన మోషే 12మంది గోత్రనాయకులను ఆ దేశానికి పంపాడు. వారు కనాను దేశమంతా తిరిగి చూసి ఆ దేశ వైభవానికి అబ్బురపడ్డారు. అయితే అక్కడి ప్రజల దేహదారుఢ్యం చూసి భయపడ్డారు. అందువల్ల వారిలో పదిమంది అది గొప్పదేశమే కానీ, అక్కడి రాక్షసుల్లాంటి ప్రజలను ఓడించి, దాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పారు. వాళ్లెంతమందైనా, దాన్ని వాగ్దానం చేసిన దేవుడు మహాబలవంతుడు కాబట్టి ఆ దేవుని సాయంతో గెల్చుకోవడం సాధ్యమేనని యొహోషువా, కాలేబు అనే మిగిలిన ఇద్దరూ విశ్వాసంతో మాట్లాడారు. (సంఖ్యా 13, 14 అధ్యాయాలు). సాతానుకు దేవునితో పోరాడే శక్తి లేనే లేదు. అందువల్ల దేవునితో పోరాడే సాహసం చేయడు. కాని దేవుని పిల్లలతో పోరాటానికి దిగుతాడు. వారి విశ్వాసాన్ని ఏదో ఒక విధంగా బలహీన పరచి రాక్షసానందం పొందుతాడు. యుగయుగాలుగా అతడు చేస్తున్న పరోక్ష పోరాటమిది. ఈజిప్టు దాస్య విముక్తి పోరాటంలో కనీసం నాడు గుక్కెడు నీళ్లు కూడా దొరకని మహారణ్యంలో లక్షలాదిమంది ఏ కొదవా లేకుండా జీవించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను, ఆయన బాహుబలాన్ని అడుగడుగునా చవి చూశారు. ఆయన చేసిన మహాద్భుతాలకు ప్రత్యక్ష సాక్షులయ్యారు. అయినా తమ గమ్యాన్ని చేరే విషయంలో అనుమానాల పీడితులై డీలా పడ్డారు. ముందుకెళ్లి ఆ రాక్షసుల చేతిలో చావడం కంటే వెనుదిరిగి ఈజిప్టుకు వెళ్లి అక్కడ బానిసలుగా బతకడం మంచిదన్న ‘చావుపాట’ పాడటం మొదలు పెట్టారు. సాతాను బలవంతుడు కాదు కానీ చాలా కుయుక్తిపరుడు. ఆ దేశం ప్రమాదభరితమని, మళ్లీ బానిసత్వమే ప్రాణాలతో బతికేందుకున్న ఏకైక మార్గమని వారిని ఒప్పించడంలో సాతాను తన కుయుక్తిని వాడాడు. ప్రాణాలతో బతికేందుకు వెనుదిరుగుతామన్న ప్రజలెవరూ ఇక వాగ్దాన దేశంలో కాలుపెట్టరని ప్రకటించిన దేవుడు, ఆ అవిశ్వాసులంతా చనిపోయేంతవరకు, వారిని నలబై ఏళ్ల పాటు అరణ్యంలోనే తిప్పాడు. తమ అవిశ్వాసానికి వాళ్లు చెల్లించిన మూల్యమిది. దేవుడివ్వదలచుకున్న ఆశీర్వాదాలను పోగొట్టుకోవడమే అవిశ్వాసానికి మనం చెల్లించే మూల్యం. విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ‘ఊర్’ అనే ప్రాంతంలో (ఇప్పటి ఇరాక్‌లో ఉంది) ఉండగా దేవుడు పిలిచి ‘నేను చూపించే దేశానికి వెళ్లు’! అని ఆదేశించాడు. దేవుడు చూపించ బోయే గమ్యమేమిటో తెలియకున్నా అణుమాత్రం కూడా అనుమానపడకుండా కొండంత విశ్వాసంతో అబ్రాహాము వేలాది మైళ్లు ప్రయాణం చేసి కనాను చేరి అక్కడ పరదేశిగా బతుకుతూనే ఆ దేశం తన సంతానానికి స్వంతమవుతుందని విశ్వాసంతో కలలు కన్నాడు. (ఆది 12:1). మన జ్ఞానాన్ని, లోకదృష్టిని పక్కన పెట్టి ఆయన్ను విశ్వసించి ఆయన చేతుల్లో మన చేయి వేస్తే, మనం కళ్లు మూసుకున్నా దేవుడు మనల్ని ముందుకు నడిపించడమే ‘నిజమైన విశ్వాస ప్రయాణం’. ఆ ప్రయాణంలో దేవుని గొప్పతనాన్ని అడుగడుగునా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. దేవుని గొప్పతనం అనుభవిస్తేనే అర్థమవుతుంది. అదే అనుభవ విశ్వాసమంటే! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
కుక్కల్ని చంపిన ఇద్దరి అరెస్ట్
బెంగళూరు(బనశంకరి): దొంగతనానికి వె ళ్లిన సమయంలో మొరిగిన ఐదు కుక్కలకు విషమిచ్చి చంపిన మోసెస్, ప్రభాకర్ అనే ఇద్దరిని జేజేనగర పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 5వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో రంగనాథకాలనీ 4 వక్రాస్ లో సుమారు 5 కుక్కలు, 5 కాకులు, మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానిక నివాసి సత్య జేజే నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం పశ్చిమవిభాగం డీసీపీ లాబూరామ్ నేతృత్వంలో ఓ బృంధాన్ని ఏర్పాటు చేశారు. ఏసీపీ సత్యనారాయణ మార్గదర్శనంలో ఇన్స్‌స్పెక్టర్ వసంత్‌కుమార్, ఎస్ఐ అంజనప్ప సిబ్బందితో తీవ్రగాలింపులు చేపట్టారు. పోలీసులు నిందితుడు మోసెస్ ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనతో పాటు ప్రభాకర్ కూడా ఉన్నట్లు నోరువిప్పడంతో అతన్నీ అరెస్ట్ చేశారు. -
అద్భుతాలమయం మోషే జీవితం
అగ్నిగుండాన్ని తలపించే దుర్భరమైన సీనాయి ఎడారి వేడిమిలో అక్కడక్కడా కనిపించే పచ్చని పొదలే పశువులకు ఆహారం, కాస్త నయనానందకరం కూడా! అలాంటి ఒక పచ్చని పొదలో మంటలు లేవడం విచిత్రమనిపించి మోషే దాని వద్దకు వెళ్తే, అద్భుతంగా అందులో నుండి దైవస్వరం వినిపించింది. చారిత్రాత్మకమైన గొప్ప బాధ్యతను దేవుడక్కడ మోషేకిచ్చాడు. నాలుగొందల ఏళ్ల ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించి వాగ్దాన దేశమైన ఇజ్రాయెల్ దాకా నడిపించే బాధ్యత అది. నిజానికి మోషే జీవితం నిండా అద్భుతాలు, విచిత్రాలే! జన్మరీత్యా యూదుడైనా బద్ధశత్రువైన ఈజిప్టురాజు ఫరో సంరక్షణలో మోషే పెరగడం ఒక అద్భుతం. ఆదరించవలసిన సొంత ప్రజలైన యూదులే తరిమి కొట్టడం మరో విచిత్రం. అలా ప్రాణభయం, అవమాన భారంతో మిద్యానుగా పిలిచే సీనాయి ఎడారికి చేరి, ఫరో పెంపకపు వైభవాన్ని, సకలశాస్త్ర పాండిత్యాన్ని వీడి ఐగుప్తీయులు ఏవగించుకునే పశువుల కాపరి వృత్తి చేపట్టి మోషే తన మామగారి మందలు మేపుతూ నలభైఏళ్ల పాటు అనామకుడుగా బతకడం మరో విచిత్రం. పిదప మండే పొద ద్వారా పొందిన దైవ దర్శనానికి విధేయుడై యూదుల స్వేచ్ఛోద్యమానికి సారథ్యం చేసి ఆరు లక్షలమంది యూదులను దాస్యవిముక్తులను చేసి వాగ్దానదేశపు దారిలో ఒక మహారణ్యంలో నలభై ఏళ్లపాటు వారికి దేవుని విధి విధానాలు, క్రమశిక్షణ నేర్పించి ఆయన వారిని తిరుగులేని దేవుని జనాంగంగా తీర్చిదిద్దడం అద్భుతాల్లో కెల్లా మహాద్భుతం. అంతటి ఘనచరిత్రను కలిగే దేవునిలో నిశ్చలంగా ఉంటూ, మోషే మిక్కిలి సాత్వికుడు... నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటూ దేవుని చేతే కితాబు పొందడం అద్భుతం (సంఖ్యా 12:3, 7). తన నిరాడంబరత్వాన్ని, భక్తిని, సాత్వికత్వాన్ని, నమ్మకత్వాన్ని, నిబద్ధతను కాపాడుకున్న మోషే వంటివారు లోకంలో ఎందరున్నారు? దేవుని ఉనికి ఒకప్పుడు చరిత్రలో తత్వశాస్త్రం, తర్కశాస్త్రం పరిధిలోనిది. ఆధునిక శాస్త్ర విజ్ఞానయుగం దేవుణ్ణిప్పుడు ప్రయోగశాలల్లో నిలబెట్టి ఆయన్ను రుజువు చేసే విఫలయత్నం చేస్తోంది. ఆది సంభూతుడు, అనంత శక్తిసంపన్నుడు, సర్వానికి సృష్టికర్తయైన దేవున్ని నిన్న మొన్నే కళ్లు తెరిచ్చిన సైన్సు ఎలా రుజువు చేస్తుందన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే! మహాసముద్రపు నీటిని ముంతలతో కొలిచే ప్రయత్నమే! తన ఉనికిని చాటుకొని తనను తాను రుజువు చేసుకునే అవసరం దేవునికి లేదు. అయితే దేవుడున్నాడనడానికి, దేవుని అత్యున్నతమైన ప్రేమకు మోషే వంటి మహానాయకుల జీవితాలు, వారి విజయాలే నిదర్శనాలు. దేవునికి తలవంచిన వారి ముందు లోకం తలవంచుతుందన్నదే దేవుడు వారి జీవితాల ద్వారా చాటే అసమాన సందేశం. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్