అద్భుతాలమయం మోషే జీవితం
అగ్నిగుండాన్ని తలపించే దుర్భరమైన సీనాయి ఎడారి వేడిమిలో అక్కడక్కడా కనిపించే పచ్చని పొదలే పశువులకు ఆహారం, కాస్త నయనానందకరం కూడా! అలాంటి ఒక పచ్చని పొదలో మంటలు లేవడం విచిత్రమనిపించి మోషే దాని వద్దకు వెళ్తే, అద్భుతంగా అందులో నుండి దైవస్వరం వినిపించింది. చారిత్రాత్మకమైన గొప్ప బాధ్యతను దేవుడక్కడ మోషేకిచ్చాడు. నాలుగొందల ఏళ్ల ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించి వాగ్దాన దేశమైన ఇజ్రాయెల్ దాకా నడిపించే బాధ్యత అది. నిజానికి మోషే జీవితం నిండా అద్భుతాలు, విచిత్రాలే! జన్మరీత్యా యూదుడైనా బద్ధశత్రువైన ఈజిప్టురాజు ఫరో సంరక్షణలో మోషే పెరగడం ఒక అద్భుతం. ఆదరించవలసిన సొంత ప్రజలైన యూదులే తరిమి కొట్టడం మరో విచిత్రం.
అలా ప్రాణభయం, అవమాన భారంతో మిద్యానుగా పిలిచే సీనాయి ఎడారికి చేరి, ఫరో పెంపకపు వైభవాన్ని, సకలశాస్త్ర పాండిత్యాన్ని వీడి ఐగుప్తీయులు ఏవగించుకునే పశువుల కాపరి వృత్తి చేపట్టి మోషే తన మామగారి మందలు మేపుతూ నలభైఏళ్ల పాటు అనామకుడుగా బతకడం మరో విచిత్రం. పిదప మండే పొద ద్వారా పొందిన దైవ దర్శనానికి విధేయుడై యూదుల స్వేచ్ఛోద్యమానికి సారథ్యం చేసి ఆరు లక్షలమంది యూదులను దాస్యవిముక్తులను చేసి వాగ్దానదేశపు దారిలో ఒక మహారణ్యంలో నలభై ఏళ్లపాటు వారికి దేవుని విధి విధానాలు, క్రమశిక్షణ నేర్పించి ఆయన వారిని తిరుగులేని దేవుని జనాంగంగా తీర్చిదిద్దడం అద్భుతాల్లో కెల్లా మహాద్భుతం. అంతటి ఘనచరిత్రను కలిగే దేవునిలో నిశ్చలంగా ఉంటూ, మోషే మిక్కిలి సాత్వికుడు... నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటూ దేవుని చేతే కితాబు పొందడం అద్భుతం (సంఖ్యా 12:3, 7). తన నిరాడంబరత్వాన్ని, భక్తిని, సాత్వికత్వాన్ని, నమ్మకత్వాన్ని, నిబద్ధతను కాపాడుకున్న మోషే వంటివారు లోకంలో ఎందరున్నారు? దేవుని ఉనికి ఒకప్పుడు చరిత్రలో తత్వశాస్త్రం, తర్కశాస్త్రం పరిధిలోనిది. ఆధునిక శాస్త్ర విజ్ఞానయుగం దేవుణ్ణిప్పుడు ప్రయోగశాలల్లో నిలబెట్టి ఆయన్ను రుజువు చేసే విఫలయత్నం చేస్తోంది.
ఆది సంభూతుడు, అనంత శక్తిసంపన్నుడు, సర్వానికి సృష్టికర్తయైన దేవున్ని నిన్న మొన్నే కళ్లు తెరిచ్చిన సైన్సు ఎలా రుజువు చేస్తుందన్నది ఎప్పటికీ ప్రశ్నార్థకమే! మహాసముద్రపు నీటిని ముంతలతో కొలిచే ప్రయత్నమే! తన ఉనికిని చాటుకొని తనను తాను రుజువు చేసుకునే అవసరం దేవునికి లేదు. అయితే దేవుడున్నాడనడానికి, దేవుని అత్యున్నతమైన ప్రేమకు మోషే వంటి మహానాయకుల జీవితాలు, వారి విజయాలే నిదర్శనాలు. దేవునికి తలవంచిన వారి ముందు లోకం తలవంచుతుందన్నదే దేవుడు వారి జీవితాల ద్వారా చాటే అసమాన సందేశం. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్