భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్‌.. ఎక్కడంటే.. | Astronauts To Spend Four Weeks In Israels Negev Desert | Sakshi
Sakshi News home page

భూమ్మిదే మనుషులు సృష్టించిన మార్స్‌.. ఎక్కడంటే..

Published Wed, Oct 13 2021 1:54 AM | Last Updated on Wed, Oct 13 2021 8:47 AM

Astronauts To Spend Four Weeks In Israels Negev Desert - Sakshi

అవును.. భూమ్మీదే మార్స్‌.. మనుషులే దాన్ని సృష్టించేశారు.. ఎక్కడ అంటే.. ఇజ్రాయెల్‌లోని నెగేవ్‌ ఎడారిలో.. ఇంతకీ ఎందుకిలా చేశారు.. అక్కడ స్పేస్‌ సూట్స్‌ వేసుకుని వీళ్లంతా ఏం చేస్తున్నారు? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే.. చలో ఇజ్రాయెల్‌...  

భవిష్యత్‌ సంక్షోభాల దృష్ట్యా ప్లానెట్‌ ‘బి’ సృష్టించడం కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. అంగారకుడి మీద కొంత అనుకూల వాతావరణం కనిపిస్తున్నా... ఇప్పటి దాకా జీవం ఉన్న దాఖలాలు లేవు. రెడ్‌ప్లానెట్‌ మీద మానవులు జీవించడానికి ఏ మాత్రం అవకా శం ఉందనే పరిశోధనలకోసం నాసా 2030లో మార్స్‌ మీదకు వ్యోమగాములను పంపనుంది. ఆ ప్రయోగం కోసమే అంగారక గ్రహం భౌగోళిక స్థితులను పోలిన ఇజ్రాయిల్‌లోని ‘నెగేవ్‌’ ఎడారిలో రెడ్‌ప్లానెట్‌ నమూనాను తయారు చేసింది. ఇక్కడ ఆరుగురు వ్యోమగాములు, నాలుగు వారాలపాటు నివసించనున్నారు. ఏఎమ్‌ఏడి ఈఈ–20గా పిలుచుకునే ఈ బృందంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. 

ఆ నమూనా ఎలా ఉంటుంది?
మార్స్‌ బేస్‌ లోపలి వాతావరణాన్ని పోలిన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉండటం కోసం ఏర్పాటు చేసినట్లుగానే ఈ ఆవాసం ఉంటుంది. అంగార కుడి మీద ప్రయోగాలకోసం ఉన్న సానుకూలత లను, పరిమితులను కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ఆవాసాన్ని తయారు చేశారు.

బయటికి వచ్చినప్పుడు స్పేస్‌సూట్స్‌
అంతే కాదు... రోవర్లు, డ్రోన్లతోపాటు ఇతర పరిక రాలన్నింటినీ ఈ అంగారకుడిమీద పరీక్షించనున్నారు ఆస్ట్రోనాట్స్‌. జీవం ఉండేందుకు ఉన్న అవ కాశాలు, వ్యోమగాముల ఆరోగ్యపరిస్థితులు, వాళ్ల మానసిక స్థితిగతులు, మార్స్‌ మీద పరిస్థితులు, ఇంజనీరింగ్‌ విభాగాల్లో 20కిపైగా ప్రయోగాలను 4 వారాలపాటు నిర్వహించనున్నారు. మార్స్‌ మీద బయటకు వెళ్లినప్పుడు ధరించినట్టుగా నే ఇక్కడా ఆ ఆవాసం నుంచి బయటికి వచ్చిన ప్పు డు, రోవర్స్, డ్రోన్స్‌ నిర్వహించేప్పుడు వ్యోమ గా ములు తప్పనిసరిగా స్పేస్‌ సూట్స్‌ను ధరిస్తారు. 

తీసుకునే ఆహారం, పీల్చేగాలి... 
వ్యోమగాములు తీసుకునే ఆహారం, పీల్చేగాలి పూర్తిగా మార్స్‌పైన బేస్‌లో ఉన్నట్టుగానే ఉంటాయి. వ్యర్థాల రీసైక్లింగ్, నీటిబుడగలకు అనువైన ఉన్నట్టుగానే అసాధారణ పరిస్థితులను సృష్టించి ఒంటరిగానూ, ఇద్దరు ముగ్గురు కలిసి సహకరించుకుంటూ ప్రయోగాలు చేస్తారు. ఇతర గ్రహాల మీద ఉన్న దుమ్ము, ధూళి వ్యోమగాములకు శ్వాస సంబంధిత ఇబ్బందులను కలిగించడమే కాదు... యంత్రాలను పనిచేయకుండా చేసే అవకాశం ఉంది. అందుకే దుమ్ము, ధూళిని శుభ్రం చేసే టెక్నాలజీని సైతం ఇక్కడ పరీక్షించనున్నారు. 

నాలుగువారాలపాటు ఐసోలేషన్‌...
మార్స్‌ మిషన్‌ కోసం ఏరోస్పేస్‌ ఇంజనీర్లు, ఔత్సాహికుల నెట్‌వర్క్‌తో ఏర్పాటైన ఆస్ట్రియన్‌ స్పేస్‌ ఫోరమ్‌ నిర్వహిస్తున్న 13వ అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ మిషన్‌ ఇది. ఇందుకు అవసరమైన క్రూ, పరికరాలు, సౌకర్యాలను ఇజ్రాయేల్‌ స్పేస్‌ ఏజెన్సీ సమకూర్చింది. సోమవారం ప్రారంభమైన ఈ ఐసోలేషన్‌ దశ అక్టోబర్‌ 31తో ముగియనుంది. అప్పటివరకు మిషన్‌ కంట్రోల్‌తో మాత్రమే వ్యోమగాములు మాట్లాడతారు. యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నిధులు అందిస్తున్న అతి పెద్ద ప్రయోగం ఇది. ఈ మిషన్‌లో 25 దేశాల నుంచి 200 మంది పరిశోధకులు పాలుపంచుకున్నారు.   

 – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement