విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలను కాలదన్నుకున్నట్లే! | story about zesus christ | Sakshi
Sakshi News home page

విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలను కాలదన్నుకున్నట్లే!

Published Sun, May 15 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలను కాలదన్నుకున్నట్లే!

విశ్వాసాన్ని పోగొట్టుకుంటే ఆశీర్వాదాలను కాలదన్నుకున్నట్లే!

దేవుడు వాగ్దానం చేసిన దేశం ఎంత గొప్పదో ముందే తెలిస్తే అక్కడికెళ్లడానికి ఇశ్రాయేలీయులు వేగిరపడ్తారని భావించి, నాటి నాయకుడైన మోషే 12మంది గోత్రనాయకులను ఆ దేశానికి పంపాడు. వారు కనాను దేశమంతా తిరిగి చూసి ఆ దేశ వైభవానికి అబ్బురపడ్డారు. అయితే అక్కడి ప్రజల దేహదారుఢ్యం చూసి భయపడ్డారు. అందువల్ల వారిలో పదిమంది అది గొప్పదేశమే కానీ, అక్కడి రాక్షసుల్లాంటి ప్రజలను ఓడించి, దాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యమని తేల్చి చెప్పారు. వాళ్లెంతమందైనా, దాన్ని వాగ్దానం చేసిన దేవుడు మహాబలవంతుడు కాబట్టి ఆ దేవుని సాయంతో గెల్చుకోవడం సాధ్యమేనని యొహోషువా, కాలేబు అనే మిగిలిన ఇద్దరూ విశ్వాసంతో మాట్లాడారు. (సంఖ్యా 13, 14 అధ్యాయాలు).

 సాతానుకు దేవునితో పోరాడే శక్తి లేనే లేదు. అందువల్ల దేవునితో పోరాడే సాహసం చేయడు. కాని దేవుని పిల్లలతో పోరాటానికి దిగుతాడు. వారి విశ్వాసాన్ని ఏదో ఒక విధంగా బలహీన పరచి రాక్షసానందం పొందుతాడు. యుగయుగాలుగా అతడు చేస్తున్న పరోక్ష పోరాటమిది. ఈజిప్టు దాస్య విముక్తి పోరాటంలో కనీసం నాడు గుక్కెడు నీళ్లు కూడా దొరకని మహారణ్యంలో లక్షలాదిమంది ఏ కొదవా లేకుండా జీవించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతాలను, ఆయన బాహుబలాన్ని అడుగడుగునా చవి చూశారు. ఆయన చేసిన మహాద్భుతాలకు ప్రత్యక్ష సాక్షులయ్యారు.

అయినా తమ గమ్యాన్ని చేరే విషయంలో అనుమానాల పీడితులై డీలా పడ్డారు. ముందుకెళ్లి ఆ రాక్షసుల చేతిలో చావడం కంటే వెనుదిరిగి ఈజిప్టుకు వెళ్లి అక్కడ బానిసలుగా బతకడం మంచిదన్న ‘చావుపాట’ పాడటం మొదలు పెట్టారు. సాతాను బలవంతుడు కాదు కానీ చాలా కుయుక్తిపరుడు. ఆ దేశం ప్రమాదభరితమని, మళ్లీ బానిసత్వమే ప్రాణాలతో బతికేందుకున్న ఏకైక మార్గమని వారిని ఒప్పించడంలో సాతాను తన కుయుక్తిని వాడాడు. ప్రాణాలతో బతికేందుకు వెనుదిరుగుతామన్న ప్రజలెవరూ ఇక వాగ్దాన దేశంలో కాలుపెట్టరని ప్రకటించిన దేవుడు, ఆ అవిశ్వాసులంతా చనిపోయేంతవరకు, వారిని నలబై ఏళ్ల పాటు అరణ్యంలోనే తిప్పాడు. తమ అవిశ్వాసానికి వాళ్లు చెల్లించిన మూల్యమిది. దేవుడివ్వదలచుకున్న ఆశీర్వాదాలను పోగొట్టుకోవడమే అవిశ్వాసానికి మనం చెల్లించే మూల్యం.

 విశ్వాసులకు జనకుడైన అబ్రాహాము ‘ఊర్’ అనే ప్రాంతంలో (ఇప్పటి ఇరాక్‌లో ఉంది)  ఉండగా దేవుడు పిలిచి ‘నేను చూపించే దేశానికి వెళ్లు’! అని ఆదేశించాడు. దేవుడు చూపించ బోయే గమ్యమేమిటో తెలియకున్నా అణుమాత్రం కూడా అనుమానపడకుండా కొండంత విశ్వాసంతో అబ్రాహాము వేలాది మైళ్లు ప్రయాణం చేసి కనాను చేరి అక్కడ పరదేశిగా బతుకుతూనే ఆ దేశం తన సంతానానికి స్వంతమవుతుందని విశ్వాసంతో కలలు కన్నాడు. (ఆది 12:1). మన జ్ఞానాన్ని, లోకదృష్టిని పక్కన పెట్టి ఆయన్ను విశ్వసించి ఆయన చేతుల్లో మన చేయి వేస్తే, మనం కళ్లు మూసుకున్నా దేవుడు మనల్ని ముందుకు నడిపించడమే ‘నిజమైన విశ్వాస ప్రయాణం’. ఆ ప్రయాణంలో దేవుని గొప్పతనాన్ని అడుగడుగునా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. దేవుని గొప్పతనం అనుభవిస్తేనే అర్థమవుతుంది. అదే అనుభవ విశ్వాసమంటే!  - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement