ఆత్మదర్శిని
దైవం ఒక నమ్మకం కాదు. సత్యమే, దైవం. నమ్మకాలన్నీ మనస్సుకు సంబంధించినవి. మనస్సు సత్యం కానే కాదు. నమ్మకాలేవీ నిజాలు కాదు. నమ్మకాలకు, విషయజ్ఞానానికి అతీతమైనదే సత్యం. దైవాన్ని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. సత్యాన్ని నీలోపల అన్వేషించాలి. భౌతికమైన ఆచారాలు, క్రతువులు ఏవీ కూడా నీకు దైవాన్ని తెలియజేయలేవు. అహం అనే అడ్డును తొలగించుకోనంత వరకు దైవాన్ని తెలుసుకోలేవు. నిన్ను దైవం నుండి వేరు చేసేది అహమే. అహం అనే భ్రమ వీడితే మిగిలేది దైవమే... దివ్యచైతన్యమే... అదే అసలైన నీవు... అదే నీ సహజస్థితి.. అదే దైవం. ప్రతిక్షణం చైతన్యంతో ఉండాలి. ఏపని చేస్తున్నా దానితో కలిసిపోకుండా ఒక సాక్షీ చైతన్యంగా ఉండాలి. చేసేవాడివి నీవు కాదు. అనుభవించేవాడివి కూడా నీవు కాదు. వీటిని చూస్తున్న ద్రష్టవే నీవు. అదే ఆత్మ, అదే దైవం, ఆ అద్వైతస్థితే దైవం.
మనస్సు ‘నేను’ కాదు. మనస్సు వెనుక దాన్ని సాక్షిగా చూస్తున్న చైతన్యమే ‘నేను’. ఈ ‘నేను’ కి పుట్టుక లేదు చావు కూడా లేదు ద్వంద్వాలకు అతీతం. దాన్ని ఏదీ కలుషితం చేయలేదు. ఆ ఆత్మస్థితే నీ సహజస్థితి. విషయాలకు అంటని ఆ సాక్షివి కావాలి. అప్పుడే భ్రమలతో పుట్టిన ‘నేను’ అంతమై అసలైన ‘నేను’ (ఆత్మ) ప్రజ్వలిస్తుంది. ఆలోచనలన్నీ అంతమై ఆత్మ ప్రకాశిస్తుంది. ఏమి జరుగుతున్నా సరే నీవు ఈ అత్మస్థితిలోనే ఉండాలి. నడుస్తున్నా, మాట్లాడుతున్నా, తింటున్నా, వింటున్నా, నిద్ర΄ోతున్నా... నీవు సాక్షిగా ఉండిపోవాలి. మనం ఇప్పుడు అనుకుంటున్నది మెలకువ కానే కాదు. కళ్ళు తెరిచినా నిద్రలోనే ఉంటున్నాం. మన నిజతత్వం పట్ల ఎరుకలేకుండా శరీరమే నేను, మనస్సే నేను అనే భ్రమలో ఉంటూ ఉన్నాం.
నేను సాక్షీ చైతన్యాన్ని అనే సత్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం. అది తెలిసిన క్షణం ఆలోచనలు అగిపోతాయి. నీ నిజతత్వాన్ని ప్రతిబింబిస్తావు, నీవే ఆత్మగా ఉండి΄ోతావు. ఆ స్థితిలో సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. నమ్మవలసిన అవసరమే లేదు. నీవే సత్యం, నీవే దైవం. సత్యం అంటే ఆలోచనలు, నమ్మకాలు, సూత్రాలు, వర్ణనలు, విషయజ్ఞానం మొదలైనవేవీ కావు. సత్యం నీలోనే ఉంది. నీ నిజతత్వమే సత్యం. దైవం గురించిన వర్ణనలు, సిద్ధాంతాలు, పుస్తక జ్ఞానం మొదలైనవేవీ దైవాన్ని అనుభవంలోకి వచ్చేలా చేయలేవు. పైగా ఇంకా అడ్డుపడతాయి. అహాన్ని పెంచుతాయి. మనస్సును బలపరుస్తాయి. ఈ మనస్సు ఖాళీ ఐనపుడే సత్యం అనుభవమౌతుంది.
ఈ సమాజమంతా మనస్సుతో నిర్మితమైదే. నీవు చూడాలనుకున్నదే కనబడుతుంది. మనస్సు భ్రమలతోనే నిర్మితం. దైవాన్ని కూడా వివిధ రూ΄ాల్లో ఊహించుకుంటుంది. అసలు మనస్సు, పదార్థం అనేవి కూడా లేవు. స్వచ్ఛమైన చైతన్యమే నీవు. అదే సత్యం... అదే దైవం.
– స్వామి మైత్రేయ
Comments
Please login to add a commentAdd a comment