
సరికొత్త రూపంలో న్యాయదేవత
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలసపాలన నాటి కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడిన ప్రస్తుత తరుణంలో న్యాయదేవతకు సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త రూపునిచ్చింది. ఖడ్గధారి అయిన న్యాయదేవత ఎడమ చేతిలో ఇకపై భారత రాజ్యాంగ ప్రతికి స్థానం కల్పించారు. చట్టానికి కళ్లు లేవు అనే పాత సిద్ధాంతాన్ని పక్కనబెట్టి న్యాయదేవతకు ఉన్న గంతలనూ తీసేశారు. కళ్లారా చూస్తూ సమన్యాయం అందించే న్యాయదేవతను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో కొలువుతీర్చారు.
సీజేఏ డీవై చంద్రచూడ్ ఆదేశానుసారం న్యాయదేవత శిల్పంలో మార్పులు తీసుకొచ్చారు. చట్టం కళ్లులేని కబోదికాదని, బ్రిటిష్ వలస వాసనలను వదిలించుకుని భారత న్యాయవ్యవస్థ ఆధునికతను సంతరించుకోవాలని.. రాజులకాలంనాటి ఖడ్గంతో తీర్పు చెప్పడానికి బదులు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తీర్పు చెప్పినట్లు విగ్రహం ఉండాలని సీజేఐ చేసిన సూచనల మేరకు ఈ మార్పులు జరిగాయి. విదేశీవనిత వేషధారణలోకాకుండా గాజులు, నగలు, నిండైన చీరకట్టుతో అచ్చమైన భారతీయ వనితలా స్వచ్ఛతను స్ఫురణకు తెస్తూ శ్వేతవర్ణ న్యాయదేవతకు తుదిరూపునిచ్చారు.