ప్రజల కోర్టుగా దాని పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలి
పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదు
సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పష్టీకరణ
పనాజీ: పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు.
గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్‌ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు.
అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు.
ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు
న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు.
కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం
మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు.
అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత
వాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment