సామర్లకోట: మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడుకొన్నప్పటికీ, సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేశారు. సామర్లకోట సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రం కాకినాడలోని డెయిరీ ఫార్మ్ సెంటర్ రాజీవ్ గృహకల్పకు చెందిన పెంకె మోజెస్ 2020 మార్చిలో మార్గదర్శి ఏజెంట్ ద్వారా సామర్లకోట బ్రాంచిలో రూ.లక్ష విలువ కలిగిన రెండు చిట్స్ తీసుకొన్నారు.
ఒక్కో చిట్‌కు నెలకు రూ.2,500 చెల్లిస్తున్నారు. నాలుగు నెలల తరువాత ఒక చిట్‌ను రూ.20 వేలకు పాడుకున్నారు. ఆయనకు రావలసిన రూ.80 వేలకు సంబంధించి మార్గదర్శి బ్రాంచి మేనేజరును సంప్రదించగా ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు, ఒక ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ కావాలని చెప్పారు.
ఇద్దరు ప్రైవేటు ఉద్యోగుల స్యూరిటీ ఇవ్వగా, ప్రభుత్వ ఉద్యోగి స్యూరిటీ ఇవ్వలేకపోయారు. దాంతో రూ.80 వేలు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మోజెస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగకపోవడంతో మోజెస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనిచ్చిన ఫిర్యాదుపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment