భ్రష్టత్వంతో నిండిపోయిన లోకాన్నంతా మహా జలప్రళయం ద్వారా నిర్మూలించి ఒక సరికొత్త లోకాన్ని పునర్నిర్మించాలనుకున్న దేవుడు, అందుకు నోవహును, అతని కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు. దేవుని తీర్పు నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఒక ఓడను నిర్మించుకొమ్మని దేవుడే ఆదేశించాడు. విశ్వంలోని జీవులన్నింటిలో ఒక ఆడ, మగ జతను కూడా దాంట్లో చేర్చి ప్రళయం నుండి కాపాడేందుకు వీలైనంత పెద్ద ఓడ నిర్మాణం కోసం దేవుడు నోవహుకు కొలతలిచ్చాడు. లోకమంతా బలాత్కారం, భ్రష్టత్వంతో నిండిన నేపథ్యంలో దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన విశ్వాసులుగా నోవహు, అతని కుటుంబం అలా చరిత్ర, బైబిల్ పుటలకెక్కారు.
ఒక సరికొత్త లోకంలో భాగం కానున్న జీవరాశి తాలూకు ‘విత్తనాలన్నీ’ ఓడలోకి ప్రవేశించిన తర్వాత, దేవుడు ఇంత పెద్ద లోకంలో నీవొక్కడివే నాకు నీతిమంతుడివిగా కనిపించావంటూ ప్రకటించి నోవహును, అతని కుటుంబాన్ని ఓడలోకి ప్రవేశించమని ఆదేశించి, వాళ్ళు లోనికి వెళ్లిన తర్వాత దేవుడే ఓడ తలుపును బయటి నుండి మూసివేశాడు(ఆది7:1,16). నీతిమంతుడైన నోవహును అతని కుటుంబాన్ని ఓడ లోపల భద్రపరిచిన దేవుని ప్రణాళికలో, ఆ ఓడ తలుపును దేవుడే బయటినుండి మూసివేయడం ఒక ప్రాముఖ్యమైన భాగం!! లేకపోతే జలప్రళయం ఆరంభమైన తర్వాత ఓడలోకి ప్రవేశించేందుకు తలుపు బయట జరిగే విపరీతమైన తొక్కిసలాటను, అలా ఎదురయ్యే తీవ్రవత్తిడిని తట్టుకోవడం నోవహుకు సాధ్యమై ఉండేది కాదు.
అందుకే ఆ తలుపును బయటి నుండి తానే మూసేసి తాననుకున్నపుడు తెరిచే వీలును దేవుడు తన వశంలో పెట్టుకున్నాడు. జీవితం, కుటుంబం మనదే అయినా వాటిలో కొన్ని అంశాలను మాత్రం దేవుడు తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. అదే మనకు ఆశీర్వాదం కూడా!! ఓడలో నోవహు ఒక ఏడాదిపాటు ఉన్నాడు. బయట ఏం జరుగుతోందో అతనికి తెలియదు, ఓడ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా అతనికి తెలియదు. కాని దేవుడు ఆ తలుపును తన సంరక్షణ కోసమే మూసి ఉంచాడని, దేవుడు తప్పక దాన్ని ఒకరోజు తెరిచినప్పుడు తాను తన కుటుంబం ఒక సరికొత్త ప్రపంచంలోకి కాలుపెడతామన్న గొప్ప విశ్వాసం నోవహుది. చుట్టూ గాఢాంధకారం ముసిరిన అననుకూల పరిస్థితుల్లో కూడా, ఒకరోజు దేవుడు తన తేజోమయ పరిస్థితుల్లోకి తనను ప్రవేశపెడతాడన్న అద్భుతమైన విశ్వాసం నోవహుది.
రాత్రి పడుకొంటూ తెల్లారి ఉదయాన్ని చూస్తాననుకోవడం విశ్వాసమే. కాని కొన్ని వందల కాళరాత్రుల అనుభవాల నేపథ్యంలో కూడా, దేవుడివ్వబోయే ఒక గొప్ప సూర్యోదయం కోసం ఎదురుచూడటం, నోవహు జీవితంలో మనం చూసే, దేవుడు కోరుకునే అసామాన్యమైన విశ్వాసం. ఓడ లోపలున్న నోవహు తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా? అని ఎదురు చూడలేదు. ఓడ లోపలి జీవకోటినంతా కొత్త ప్రపంచం కోసం భద్రపరిచేందుకు, సిద్ధపర్చేందుకు దేవుడు తనకిచ్చిన పరిచర్యలో, తన కుటుంబంతో సహా సంపూర్ణంగా నిమగ్నమయ్యాడు.
‘దేవుడు తన పని తన సమయంలో చేసేలోగా, దేవుడు అప్పగించిన పనిని నేను నిబద్ధతతో చేస్తాను’ అన్నది నోవహు విశ్వాసం, సిద్ధాంతం!! దేవుడిచ్చిన కొలతల్లో, దేవుని అభీష్టం మేరకు ఓడను నిర్మించడం ద్వారా, లోకం తనను చూడకున్నా, తనను దేవుడు చూస్తు్తన్నాడన్న దైవభయంతో ఓడ లోపలి పరిచర్యనంతా నిబద్ధతతో చేసిన మహా దైవజనుడు నోవహు. మహా ప్రళయం లో అంతా తుడిచిపెట్టుకుపోగా నోవహు ఉన్న ఓడ ఒక్కటే మిగిలింది, తద్వారా నోవహు విశ్వాసం కూడా ఇన్ని తరాలుగా సజీవంగా మిగిలింది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment