ఆశకు మరో పేరు క్రిస్మస్ | Special Story About Christmas By Rev Dr Prabhu Kiran In Funday On 22/12/2019 | Sakshi
Sakshi News home page

ఆశకు మరో పేరు క్రిస్మస్

Published Sun, Dec 22 2019 12:42 AM | Last Updated on Sun, Dec 22 2019 12:42 AM

Special Story About Christmas By Rev Dr Prabhu Kiran In Funday On 22/12/2019 - Sakshi

గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను  కొలంబస్‌ చిగురింప చేశాడు. మనిషిని బతికించే పనిని ఆక్సిజన్‌ కన్నా ‘ఆశ’  ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్‌’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్‌’!!

ఇటలీకి చెందిన మహా నావికుడు క్రిస్టఫర్‌ కొలంబస్‌ అప్పటి స్పెయిన్‌ రాజుగారి ఆజ్ఞ మేరకు సుగంధ ద్రవ్యాల వర్తకం కోసం ఇండియాను చేరేందుకు పశ్చిమ దిక్కు నుంచి ఒక కొత్త దారి కనుక్కోవడానికి 15వ శతాబ్దంలో నౌకాయానం చెయ్యడానికి పూర్వం ప్రపంచమంతా బల్లపరుపుగా ఉందని,  అందువల్ల నౌక సముద్ర ప్రయాణంలో ఎక్కడో ఒక చోట, ప్రపంచం చివరి అంచు నుంచి లోతుల్లేని అగాథంలోకి పడిపోతుందని అంతా నమ్మేవారు, భయపడేవారు కూడా.  అయితే కొలంబస్‌ నౌకాయానం విజయవంతం కావడం వల్ల రెండు విషయాలు తెలిశాయి. యూరోప్‌ తదితర ప్రాంతాలకు అంతవరకు తెలియని అమెరికా అనే ఒక ఖండమున్నదని కొలంబస్‌ అక్కడికి చేరడం వల్ల లోకానికి తెలిసింది.  పైగా ప్రపంచం బల్లపరుపుగా లేదని, ఒక అంచు నుంచి అగాథం లోకి పడిపోవడం కాదు, గోళాకారంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడి నుండి ప్రయాణించినా భూగోళం చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే రావచ్చునని రుజువు చేసి, ప్రపంచానికి అంతం అనేది లేదన్న ‘ఆశ’ను  కొలంబస్‌ చిగురింప చేశాడు.

మనిషిని బతికించే పనిని ఆక్సిజన్‌ కన్నా ‘ఆశ’  ఎక్కువగా చేస్తుంది. కారుచీకట్ల చివర్లో ఒక కాంతి కిరణముందన్న ఆశను, దౌర్జన్యం, దోపిడీ, అవినీతి, దిగజారిన జీవిత విలువలు, పెచ్చరిల్లే హింసాకాండ నడుమ అకస్మాత్తుగా శాంతి కిరణాలు ప్రభవించవచ్చునన్న ఆశను రేకెత్తించిన ‘క్రిస్మస్‌’, ఇప్పటికీ దాన్ని బతికిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మానవాళి ‘ఆశ’కు మరోపేరు ‘క్రిస్మస్‌’!! లోకాన్నితన ప్రేమ, క్షమతో నింపి తద్వారా సరికొత్త దైవిక రాజ్యాన్ని నిర్మించాలన్న దేవుని అనాది సంకల్పంతో, దృఢమైన అభిమతంతో రెండు వేల ఏళ్ళ క్రితమే తొలి క్రిస్మస్‌ వెలిసింది, మరొక మతాన్ని ఆరంభించేందుకు కాదు, మనిషి తన కోసం తాను కాకుండా, తనను తాను ప్రేమించుకున్నంతగా తన పొరుగువాణ్ణి కూడా ప్రేమించడంలోనే అతనికి జీవన సాఫల్యమున్నదని తెలిపే ఒక విలక్షణమైన, విశిష్టమైన జీవన విధానాన్ని ఆవిష్కరించిన రక్షకుడుగా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఆవిర్భవించాడు.

అంతే తప్ప ఒక కొత్త మతాన్ని ఆరంభించే ఉద్దేశం యేసుకు లేదు. ఆ కారణంగా, కత్తుల నడుమ నిర్మలమైన కలువపూవై, నెత్తుటి మరకలతో ఎర్రబారిన ఆకాశంలో ఎగిరే శ్వేత శాంతికపోతమై,  ఒంటరితనంతో నిరాశాజీవిగా బతుకుతున్న మనిషితో, నీకు నేనున్నానంటూ అభయాన్నిచ్చిన ఒక ప్రియనేస్తమై యేసుక్రీస్తు రక్షకుడుగా క్రిస్మస్‌ ద్వారా లోకంలోకి అడుగుపెట్టాడు...ఆయన ఆకాశాన్ని తన సింహాసనంగా, భూమిని తన పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన ప్రభువని బైబిల్‌ వర్ణిస్తుంది (యెషయా 66:1–4). అయితే ఆనాడు విశ్వమంతటికీ సృష్టికర్త, పాలకుడు, యజమాని అయిన దైవకుమారుడైన యేసుక్రీస్తు  ఆగమనాన్ని సూచించే ఆర్భాటం లేదు, కోలాహలం కూడా లేదు. స్వాగతోత్సవాలు, సన్మాన సభలు, విందులు, వినోదాల సందడే లేదు. రక్షకుని ఆగమన సూచనగా దేవుడు ఆకాశంలోనే ఒక అసాధారణమైన తారను పుట్టిస్తే, అది చూపే దారిలో తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని చూసేందుకు యెరూషలేముకొస్తే, అక్కడి యూదుల రాజైన హేరోదు పిలిపిస్తే యూదు పండితులు వచ్చి,  యూదయ దేశపు చిన్న గ్రామమైన బేత్లెహేములో రక్షకుడు అంటే మెస్సియా పుడతాడని బైబిల్‌ చెబుతోందంటూ వివరించారు (మత్తయి 2:5). యెరుషలేములాంటి గొప్ప పట్టణముండగా, అక్కడికి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలోని బేత్లెహేము అనే అనామకమైన ఒక పేద గ్రామంలో రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తియైన దైవకుమారుడు పుట్టడమేమిటో ఆ జ్ఞానులకు అర్థం కాలేదు, హేరోదు చక్రవర్తికీ అదేంటో అర్థం కాలేదు, ఆ బైబిల్‌ వచనాన్ని చదివి వినిపించిన యూదు పండితులకైతే ఆ వచనం పట్ల అసలు విశ్వాసమే లేదు.

వాస్తవమేమిటంటే ఆ వచనాన్ని ఆనాడు ఎవ్వరూ నమ్మలేదు. ఒకవేళ నమ్మి ఉంటే, హేరోదు పురమాయింపుతో అతని సైనికులు లేదా  బైబిల్‌ ప్రవచనాన్ని విశ్వసించే ఎవరైనా యూదు పెద్దలు పక్కనే ఉన్న బేత్లెహేముకు ఆ జ్ఞానులతో పాటే ఆ రోజే వెళ్లే వాళ్లు. అప్పుడు ప్రపంచానికంతటికీ రక్షకుని జన్మశుభవార్త ‘బ్రేకింగ్‌ న్యూస్‌’గా ఆరోజే తెలిసి ఉండేది. కాని దేవుడు తన మహా కార్యాలు, అనాది సంకల్పాల నెరవేర్పు కోసం, ధనవంతులు, పండితులు, అధికారమున్న గొప్పవాళ్లను కాక, పామరులను, నిరుపేదలను, బలహీనులను ఏర్పరచుకొని వారిని వాడుకొంటాడని బైబిల్‌ చెబుతోంది (మత్తయి 11:25). యేసుక్రీస్తు నూటికి నూరు పాళ్లూ పేదల పక్షపాతి, దీనబాంధవుడని చెప్పడానికి బైబిల్‌ నిండా, ముఖ్యంగా కొత్తనిబంధన నిండా వచనాలున్నాయి.మెస్సీయాగా యేసు రాజభవనాల్లో, చక్రవర్తులు, కుబేరుల ఇళ్లలో పుట్టబోడని దేవుడు స్పష్టం చేశాడు. పుడమినేలే రారాజు పశువుల పాకలో పుడతాడని చెప్పే ప్రవచనాలు బైబిల్‌లో ఎన్నో ఉన్నాయి.

పేద కుటుంబానికి చెందిన భక్తిపరురాలైన ఒక కన్యక పరిశుద్ధాత్మ శక్తితో యేసును గర్భం దాల్చుతుందని, యోసేపు అనే భక్తిపరుడు, నీతిమంతుడైన మరో పేద యువకుడు యేసుప్రభువుకు ఇహలోకంలో సంరక్షక తండ్రిగా ఉంటాడని, ఆయన జననం బేత్లెహేములో జరుగుతుందని దేవుడు ముందే వెల్లడించాడు. అలా, కోటానుకోట్ల నక్షత్ర మండలాల సముదాయమైన మహా విశ్వానికంతటికీ సృష్టికర్త, పాలకుడూ అయిన దైవకుమారుడు ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, చడీ చప్పుడు చెయ్యకుండా, ఒక నలుసంత పరిమాణానికి తనను తాను తగ్గించుకొని, కన్య గర్భంలోకి ప్రవేశించి, తొమ్మిది నెలల పాటు మరియ గర్భంలో పిండస్థ శిశువుగా ఎదిగి, బేత్లెహేములోని  సత్రంలో కూడా మరియ, యోసేపులకు తలదాచుకునే చోటు దొరక్కపోగా, వాళ్ళున్న పశువుల పాకలోనే యేసు జన్మించాడు.

ప్రపంచంలో మానవాళి దృష్టికొచ్చిన అద్భుతాల్లోకెల్లా, అత్యంత అద్భుతమైన సంఘటన, చరిత్రను తిరగ రాసిన పరిణామమిది. బైబిల్‌లో మొత్తం 66 పుస్తకాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాల్లోనూ యుద్ధాలు, మరణాలు, రక్తపు మరకల హింసాత్మక ఘటనలుండగా, కొత్త నిబంధనగా పిలిచే చివరి 27 పుస్తకాలూ యేసుప్రభువు వారి శాంతి సందేశంతో నిండి ఉన్నాయి. యుద్ధాలు, హింసాకాండ నేపథ్యంలో శాంతిదూతగా యేసు జననాన్ని ఎలా సమర్థిస్తారు? ఒక మార్గాన్ని వేస్తున్నప్పుడు, నేలను తవ్వి గుల్ల చేయాల్సివస్తుంది, అడ్డుగా ఉన్న కొండల్ని పేల్చి, లేదా తొలచి చదును చేయాల్సి వస్తుంది. అలా బలప్రయోగంతో సరళం చెయ్యబడిన పర్యవసానంగా రక్షణ మార్గం ఏర్పడగా,  అందుకోసమే అనివార్యమైన హింసాత్మకత పాత నిబంధనలో చెలరేగింది.

అయినా యేసుప్రభువు రక్షకుడుగా దిగివచ్చిన తర్వాత కూడా క్రై స్తవం పేరుతో ఈ రెండువేల ఏళ్లలో చాలాసార్లు చరిత్ర రక్తసిక్తమయ్యింది. కారణం?  యేసుప్రభువు ఈ లోకానికి సంపూర్ణంగా అర్థం కాకపోవడం ఒక కారణమైతే,.దేవుని కుమారుడుగా శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రబోధాల ప్రత్యేకతను, విశిష్టతను  అర్థం చేసుకోలేని మధ్య యుగాల చర్చిల్లో పేరుకు మాత్రమే క్రై స్తవులైన వాళ్ళు ఎక్కువగా ఉన్న కారణంగా, ఆచరణలో నియంతృత్వపు  పోకడలతో క్రై స్తవాన్ని ‘విస్తరించడానికి’ పూనుకున్న యూరోప్‌ దేశాల చక్రవర్తులు మరొక కారణం. యేసుప్రభువు  శాంతి సందేశాన్ని, ప్రేమ, క్షమాపణే పునాదిగా కలిగిన విలక్షణమైన, విశిష్టమైన ఆయన రక్షణ సువార్త మార్గాన్ని, వాళ్లంతా  ఒక ‘మతం’ స్థాయికి దిగజార్చారు. దైవిక మార్గం ఏదైనా  సరే అది మతం స్థాయికి దిగజారిన ప్రతిసారీ మానవాళి తీవ్రంగా నష్టపోయి, దిగజారిన విలువల రూపంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

దేవుని కన్నా యాజకులు, పరిచారకులు, పూజారులుండే చర్చిలు, దేవాలయాల వ్యవస్థ ప్రాబల్యం నానాటికీ ఎక్కువ కావడమే ఒక మతం స్థాయికి దైవికత దిగజారిందనడానికి స్పష్టమైన సూచన.  ముఖ్యంగా మధ్య యుగాల్లో ఈ కారణం వల్లనే చర్చి దేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకొని విశ్వాసుల మీద కనీ వినీ ఎరుగని దమనకాండను, దౌర్జన్యాన్ని సాగించింది. అయితే చరిత్రలో ఇలా హింసకు పాల్పడిన ఘటనలున్నా, మరోవైపు క్రై స్తవానిదైన ప్రత్యేక ప్రేమ, క్షమా సౌరభం లోకాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే, తమ జీవితాలనే ప్రేమపూర్వక క్రీస్తు సందేశంగా మలచుకున్న మదర్‌ థెరిసాలాంటి ఎంతోమంది నిస్వార్ధపరులైన పరిచారకులు, గొప్ప అపొస్తలులు, దైవ జనులు ఒక మతం స్థాయికి దిగజారకుండా  క్రై స్తవాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఉద్యోగాలు, అడ్మిషన్ల దరఖాస్తుల్లో ‘మతం’ అనే కాలమ్‌ ఉంటే, దాన్ని క్రై స్తవులు వాడుకోవడానికి బైబిల్‌ ఒప్పుకోదు. ఎందుకంటే, క్రై స్తవం ఒక మతం కాదు. అది యేసు జీవించి, తన అనుచరులు కూడా అలాగే జీవించాలని ఆశించి, ఆదేశించిన ఒక విలక్షణమైన జీవన శైలి. క్రీస్తులాగా జీవించడం, తాను ఒకవైపు కరుగుతూ మరోవైపు లోకానికి ప్రేమ అనే వెలుగును పంచే కొవ్వొత్తి లాంటి జీవితం క్రై స్తవం!!

క్రైస్తవం అంటే కొన్ని ఆచారాలు, నియమాలు,ఆరాధనా విధానాలు, నమ్మకాలు, సంప్రదాయాలు కాదు. ముందు క్రీస్తు అనుచరుని జీవితం మారాలి. అలా అతనిలో వచ్చిన మార్పు వల్ల ప్రభావితమైన లోకంలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. అదే నిజ క్రై స్తవానికున్న శక్తి. విశ్వాసులు, పరిచారకులు ముందు తమకున్న మతం ముసుగు తీసేసి, నిజాలు చెప్పడం ఆరంభించాలి. సొంత డబ్బా వాయించుకునే ప్రచారార్భాటాలు మానెయ్యాలి. ‘నా సభకు లక్షమంది వచ్చారు’ అని ప్రకటించుకోవడం ‘అర్ధసత్యమే’ అని తెలుసుకోవాలి. ఎవరికి వారు గొప్పగా చాటింపు వేసుకోవడం మతపరమైన డాంబికం. అలా కాక ‘నా సభలో వాక్యం విన్న వారిలో వంద మంది తమ జీవితాన్ని మార్చుకున్నారు’ అని చెబితే అది పూర్తి సత్యం. అర్ధసత్యాలమీద, పరిచారకుల అతిశయాస్పద ప్రకటనల మీద, అసత్యాల మీద ఆధారపడేది మతం!! పరిచారకుల జీవితమే నిత్య సందేశంగా, నిస్వార్థం, పారదర్శకత, ప్రేమ, క్షమాపణే సూత్రంగా పరిఢవిల్లేది యేసు బోధించి, ఆచరించిన నిజ క్రై స్తవం. అదే బేత్లెహేములో నాటి తొలి క్రిస్మస్‌లో పరిమళించిన నిరాడంబరమైన, నిస్వార్థమైన, అనంతమైన దేవుని స్వచ్ఛమైన ప్రేమ!!!

రక్తంకన్నా చిక్కనిది దేవుని ప్రేమ...
‘క్రిస్మస్‌’ను ఇపుడు మనమంతా ఆనందోత్సాహాలు, వేడుకలకు ప్రతీకగా జరుపుకొంటున్నాము కాని చరిత్రలో రెండువేల ఏళ్ల క్రితం తొలి క్రిస్మస్‌ జరిగిన బేత్లెహేములో పట్టపగలే చీకట్లు కమ్మి, అక్కడి వీధుల్లో రక్తపుటేరులు ప్రవహించాయన్నది వాస్తవం. యూదులరాజుగా యేసు జన్మించాడంటూ తూర్పు దేశపు జ్ఞానులు తెచ్చిన వార్త నాటి యూదులదైన యూదా రాజ్యానికి రాజుగా ఉన్న హేరోదులో కలవరాన్ని సృష్టించింది. తన సింహాసనానికి అడ్డొస్తారేమోనన్న అనుమానంతో తన సొంత కొడుకులిద్దరినే చంపిన నియంత, అత్యంత క్రూరుడు హేరోదు రాజు. ఇపుడు యూదుల రాజుగా పుట్టిన యేసును వదిలేస్తాడా? బేత్లెహేములో పుట్టినట్టుగా లేఖనాలు చెబుతున్న యేసును పూజించి తిరిగొచ్చి, ఆ వివరాలను తనకు తెలిపితే తాను కూడా వెళ్లి పూజిస్తానంటూ హేరోదు జ్ఞానులకు మాయ మాటలు చెప్పి పంపగా, దేవుడు దర్శనంలో కనిపించి వారికి హేరోదు కుట్రను బట్టబయలు చేశాడు. జ్ఞానులు యేసును దర్శించుకొని, కానుకలు సమర్పించి, పూజించి, దైవాజ్ఞ మేరకు హేరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా, మరో మార్గంలో తమ దేశాలకు వెళ్ళిపోయి నిజంగానే జ్ఞానులనిపించుకున్నారు. తాను మోసపోయానని గ్రహించిన హేరోదు రాజు, శిశువైన యేసును హతమార్చే కుట్రలో భాగంగా, యూదయలోని రెండేళ్ల లోపు మగ శిశువులందరినీ చంపించగా, దేశమంతటా హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. కాని దేవుడప్పటికే యోసేపు, మరియ, బాలుడైన యేసును బేత్లెహేము నుండి ఐగుప్తుకు దాటించి హేరోదు కుట్రను భగ్నం చేశాడు.

నీళ్లకన్నా రక్తం చిక్కనిదైతే కావచ్చు, కాని దేవుని ప్రేమ రక్తం కన్నా చిక్కనిది. శాంతి ప్రదాతయైన యేసు ఆగమన శుభవేళ, బేత్లెహేము ఆ పరిసర ప్రాంతాలన్నీ తమ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లాయి, అక్కడి వీధులు రక్తసిక్తమయ్యాయి.  కాని దైవకుమారుడైన యేసు స్థాపించబూనిన  ప్రేమ, శాంతి, క్షమాపణా సామ్రాజ్యాన్ని బలవంతులు,పాలకులు తమ స్వార్ధం,ఈర‡్ష్య,ఆగ్రహం, అభద్రతాభావం, నియంతృత్వం, క్రూరత్వం, దౌర్జన్యంతో ఆదిలోనే మట్టుపెట్టేందుకు చరిత్రలో చేసిన తొలి ప్రయత్నం విఫలమయింది. ఈ పిలాతు దుర్మరణం తర్వాత, ఇతని స్థానంలో యూదయ రాజుగా నియమింపబడిన పొంతి పిలాతు పిరికివాడు, అందరితో రాజీపడటమే తన సింహాసనాన్ని పదిలపరచుకునే మార్గమని నమ్మినవాడు.

అందుకే యూదులతో మంచివాడిననిపించుకునేందుకు  యేసును సిలువవేసి ఆయన చరిత్రకు ముగింపు పలకాలన్న అతని కుట్ర కూడా యేసు పునరుత్థానంతో, ఆ తర్వాత క్రై స్తవచర్చి ఆవిర్భావంతో భగ్నమైంది. అమాయకుల కన్నీళ్లతో తడిసిన ఈ తొలి క్రిస్మసే ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిన క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి తొలి వేదిక అయ్యింది. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యం, హింస, హత్యల నేపథ్యంలోనే యేసు ప్రభువు వారి క్షమా, కృపా, రక్షణా కేతనం ఉవ్వెత్తున రెప రెపలాడింది. విశేషమేమిటంటే ఒకప్పుడు లోకాన్నంతా గడగడలాడించిన రోమా సామ్రాజ్యం కాలగర్భంలో కలిసి ఆనవాళ్లే లేకుండా పోయింది. కాని శుభవార్త ఏమిటంటే యేసుప్రభువు ఆవిష్కరించిన ప్రేమ సామ్రాజ్యం మాత్రం పరలోక ప్రాభవంతో ఇన్నివేల ఏళ్లుగా అణువణువునా విస్తరిస్తూనే ఉంది. చెడుపైన శాశ్వత విజయం ఎప్పుడూ శాంతిదే అన్నది కేవలం ఒక నినాదం కాదు, అది చరిత్ర చెప్పే సత్యమన్నదే క్రిస్మస్‌ ప్రకటించే నిత్య సందేశం.

క్రిస్మస్‌ను ప్రత్యేకం చేసుకోండి...
ఈ క్రిస్మస్‌ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్‌గా మీ జీవితంలో మిగిలిపోవాలనుకుంటే ఆ నాటి తొలి క్రిస్మస్‌ స్ఫూర్తితో కొన్ని పనులు చేయవచ్చు. బహుశా ఎంతోకాలంగా మాటలు నిలిచిపోయిన మిత్రులు, బంధువులకు ఈరోజు సెల్‌ఫోన్‌లో హలో చెప్పండి! ఏవో చిన్న చిన్న గొడవలు (పెద్దవైనా ఫర్వాలేదు), మాటపట్టింపులు ఉన్న కారణంగా రాకపోకలు ఆగిపోయిన మీ బంధువులు, మిత్రుల ఇంటికి ఒక చిన్న ‘క్రిస్మస్‌ కేక్‌’తో వెళ్లి వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తండి. మీరన్న ఒక మాట లేదా మీ పొరపాటు కారణంగా మనసు నొచ్చుకుని మీతో ముభావంగా ఉన్నవారిని ఒకసారి ప్రేమతో పలకరించి వారికి క్షమాపణ చెప్పండి. మీ సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎంతోకొంత సాయం అందచేయండి. ఆప్తులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వారిని, ఆసుపత్రులలో పడక మీద ఉన్న మీకు తెలిసిన వారిని వారి బంధువులను పరామర్శించి మీ ప్రేమను తెలుపండి. మీరు మీకోసం తయారు చేసుకున్న కేక్‌లు ఎంత తీయగా ఉంటాయో అప్పుడు తెలుసుకోండి.

మీ ఇంట్లో ఈ క్రిస్మస్‌కు అలంకరించిన దీపాలు ఎంతగా మిరుమిట్లు గొలుపుతాయో అప్పుడు మీరే గ్రహిస్తారు. ఒక్కసారిగా మీ హృదయం, జీవితం కూడా ఎంత తేలికవుతుందో మీరే గ్రహిస్తారు. అన్నీ ఈ ఒక్కరోజే చేయాల్సిన అవసరం లేదు. ఈ వారమంతా క్రిస్మస్‌ వారమే! ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఈ పనులకు పూనుకోండి. ఇవి పుట్టెడు ఆనందాన్నిచ్చే చిట్టిచిట్టి పనులు. ఇదే ఏసుప్రభువు బోధించిన ప్రేమమార్గం. ఈ మార్గంలో ఎవరికీ ఓటమి లేదు. అంతా విజేతలే! సారీ చెప్పినవారు, చెప్పించుకున్న వారు అంతా సమానులే! ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఇది ఎన్నటికీ విఫలంకాని విజయసూత్రమని ప్రభువే రుజువు చేసి చూపించాడు. ఇదే మనమంతా అనుసరించాల్సిన మార్గమనీ ఉద్బోధించాడు. అంతా యేసుప్రభువులు కానక్కరలేదు. ఎందుకంటే కాలేరు కూడా! అయితే ఆయన బోధించిన ఈ మార్గంలో మనమంతా ఒకటి రెండు అడుగులు వేసినా ఈ లోకం అనూహ్యంగా ఆనందమయమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అంతా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా క్రిస్మస్‌ జరుపుకోవడానికి ఇది అత్యుత్తమమైన మార్గం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement