
కాళ్లు కడిగిన ప్రభువాయన!
హోలీవీక్
రేపు ఉదయం యేసుకు సిలువ శిక్ష. ఈ రాత్రి తనకు అత్యంత సన్నిహితుడైన 12 మంది శిష్యులతో చివరి పస్కా పండుగ ఆచరించాడు. సిలువలో బలికావడానికి ముందుగా విందు భోజనం! విందుకు ఆహ్వానించిన వ్యక్తి అతిధుల్లో అత్యంత ప్రముఖులు, మతబోధకుల కాళ్లు కడగడం యూదా సంప్రదాయం!! ఆహ్వానించిన వ్యక్తి పాత్రను యేసు స్వీకరించి విందులో శిష్యులందరి పాదాలు వంగి కడిగి తువాలుతో శుభ్రంగా తుడవడం శిష్యులు తట్టుకోలేకపోయారు. తనకు యూదా ఇస్కరియోతు ద్రోహం చేసి అప్పగించబోతున్నాడని ఎరిగి అతని పాదాలు కూడా ప్రభువు కడిగాడు. ఏ విధంగా చూసినా శిష్యులంతా యేసుప్రభువు కన్నా తక్కువవారు, కొద్ది గడియల్లో సిలువనెక్కనున్న యేసును వదిలి ప్రాణ రక్షణ కోసం పారిపోనున్నవారు.
వారిలో ఒకరైతే యేసును అప్పగించనున్నవాడు... ఇలాంటి వారి పాదాలను ప్రేమతో కడిగాడు యేసుక్రీస్తు. పాదాభివందనాలు చేయించుకోవడం, పాదాలు కడిగించుకోవడమే గొప్పతనానికి సూచనగా విశ్వసించే లోకానికి తలవంచడం, ఒకరిపాదాలు ఒకరు కడుగుకునేంతగా ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం నిజమైన గొప్పతనమని, అలా తమను తాము తగ్గించుకునేవారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడని యేసు ఆచరణాత్మకంగా నిరూపించాడు. యేసులాంటి బోధకుడు లోకంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే బోధించిన ప్రతి అంశాన్ని జీవితంలో ఆచరించి చూపించాడాయన.
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్