
జలప్రళయం తర్వాత మానవ సమాజాన్ని సరికొత్తగా నిర్మించాలని దేవుడు సంకల్పించాడు. అంతే! షీనారు (ఇప్పటి ఇరాన్, ఇరాక్ ప్రాంతం) ప్రజలు ఆకాశాన్ని అంటే రాజగోపురాన్ని నిర్మించడం ఆరంభించారు. భూమిని సేద్యం చేసి తమకోసం, సమాజం కోసం ధాన్యం పండించే సమయాన్ని, శక్తిసామర్థ్యాలను ఒక గోపుర నిర్మాణం కోసం తద్వారా పేరు సంపాదించుకోవడానికి వెచ్చించడంలోని నిషీ ప్రయోజకత్వాన్ని, స్వార్థాన్ని దేవుడు పసిగట్టి వారిలో అనేక భాషలు సృష్టించి ఒకరి మాటలు మరొకరికి అర్థం కాకుండా చేసి గోపుర నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. అదే బాబెలు గోపురం!! ఆ తర్వాత ప్రజలంతా ప్రపంచం నలుమూలలకూ చెదరిపోయారు (ఆది 11:1–9).
అలా బాబెలు గోపురమైతే ఆగిపోయింది కాని, అలా చెదరిపోయిన ప్రజలు స్థాపించిన బబులోను, పర్షియా రోమ్, గ్రీకు, బెజెంటైన్, అరేబియా, బ్రిటిష్, తాలూకు ‘గోపురాలు’ వెలిసి చరిత్రలో మానవాళిని యథాశక్తి పీడించాయి, దోచుకున్నాయి, ఆధిపత్యం చేశాయి. సమాజానికి దేవుడు కేంద్రంగా లేకుండా చేసే చాలా ప్రయత్నాలకు అవి ఆజ్యం పోశాయి. ఆనాడు భవన నిర్మాణాన్ని రాళ్లకు బదులు ఇటుకలతో, అడుసుకు బదులు మట్టికోటతో చేయవచ్చునన్న‘టెక్నాలజీ’ ని షీనారు ప్రజలు కనుగొన్నారని, అందుకే గోపురం నిర్మించాలనుకున్నారని బైబిలు చెబుతోంది (ఆది 11:3).
అలా నానాటికీ విస్తరిస్తున్న ‘మానవజ్ఞానం’ అంటే నేటి భాషలో టెక్నాలజీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా, అంతర్గతంగా, ఆత్మీయంగా మనిషిని నానాటికీ ఒంటరివాణ్ణి, నిస్సహాయుణ్నీ చేస్తున్నదన్నది వాస్తవం. మనిషికీ మనిషికీ మధ్య, మనిషికీ, దేవునికీ మధ్య అంతరాన్ని అది నానాటికీ అధికం చేస్తోందన్నది కూడా వాస్తవం!! ఆ నేపథ్యంలోనే దేవుడు యేసుక్రీస్తుగా పరలోకాన్ని వదిలి మనిషికి అందుబాటులోకి వచ్చాడు. దేవుడే కేంద్రంగా ఉండే కొత్త నిబంధన తాలూకు కృపాయుగానికి ఆవిష్కరణ చేశాడు. అది యేసు ఆరోహణం తర్వాత 50 వ రోజున అంటే పెంతెకొస్తు పండుగనాడు ఆరంభమయ్యింది.
(అపొ.కా.2:1–13). బాబెలు గోపురంతో ఆరంభమైన సంక్షోభానికి దేవుడు పెంతెకొస్తు పండుగతో పరిష్కారాన్నిచ్చాడు. బాబెలు గోపురం వద్ద ఒకే ప్రాంతపు ప్రజలు తమ మాటల్ని ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోయారు. కాని పెంతెకొస్తు నాడు ఎన్నో దేశాల వారు మరెన్నో భాషల్లో మాట్లాడుతూ కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే అద్భుతాన్ని దేవుడు చేశాడు. అలా శక్తినొందిన క్రైస్తవం ప్రపంచం నలుమూలలకు హతసాక్షులను పంపింది. బాబెలు అయోమయానికి పెంతెకొస్తు అనుభవం స్పష్టతనిచ్చి, దిశానిర్దేశం చేసింది.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment