మరణాన్ని జయించిన రోజు | Devotional information by prabhu kiran | Sakshi
Sakshi News home page

మరణాన్ని జయించిన రోజు

Published Sun, Apr 1 2018 12:58 AM | Last Updated on Sun, Apr 1 2018 12:58 AM

Devotional information by prabhu kiran  - Sakshi

యెరూషలేము పట్టణం శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి కూడా నిద్రపోలేదు. ఎంతో సౌమ్యుడు, సాధుజీవి, సద్వర్తనుడైన యేసుక్రీస్తును అత్యంత పైశాచికంగా సిలువకు మేకులు కొట్టి, రక్తం ఏరులై  పారేలా కొరడాలతో కొట్టి చంపిన తరువాతి రాత్రులవి. అయితే ఆదివారం తెల్లవారు జామునే ఆయన పార్థివ దేహానికి సుగంధద్రవ్యాలు పూసే ఒక యూదు తంతును పూర్తిచేసేందుకు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలేనే మరియ తదితర స్త్రీలకు ఆయన దేహం కనిపించలేదు.

రోమా ప్రభుత్వం యూదు మతపెద్దల అభ్యర్థన మేరకు యేసును ఉంచిన సమాధికి రాజముద్రవేసి కావలి వారిని కూడా నియమించింది. ఆయన దేహాన్ని ఎవరైనా దొంగిలించుకు పోయారా? అని అంతా భయపడుతూ వుండగా, అంతలోనే యేసుప్రభువు మగ్దలేనే మరియకు కనిపించి ఆమె పేరు పిలిచి మరీ పలకరించాడు. అక్కడ సమాధిలో ఒక దూత కూడా యేసు తిరిగి సజీవుడయ్యాడన్న ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ను ప్రకటించింది.

యెరూషలే మంతటా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. అంతా యేసు సమాధి వైపే పరుగెత్తడం ఆరంభించారు. అంతటా ఎంతో ఆశ్చర్యం, మహదానందంతో నిండిన వాతావరణం వ్యాపించింది. ఆనందం పట్టలేక పట్టణస్థులంతా ముఖ్యంగా నిరుపేదలు, సామాన్యులు, బలహీనులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆడవారికైతే వారి ఆనందానికి హద్దే లేదు. అదే ఈస్టర్‌ ఆదివారంగా క్రైస్తవ లోకంలో ప్రాచుర్యం పొందింది.

మానవ చరిత్రలో ఆ శుక్రవారం, ఆ ఆదివారం కూడా ఎన్నటికీ మరపురానివి. మనిషిలోని దుర్మార్గం, అతని చేతిలో అసత్యంగా రూపాంతరం చెందిన  ఒకప్పటి ‘సత్యం’, యేసుక్రీస్తును సిలువవేసి చంపడం ద్వారా విజయం సాధించిన రోజు శుక్రవారమైతే, యేసుక్రీస్తు అన్ని కుట్రలు, దుర్మార్గమూ, దౌర్జన్యాన్ని పటాపంచలు చేసి సమాధిని, మరణాన్నీ గెలిచి సజీవుడు కావడం ద్వారా  దీనులు, పాపులు, నిరాశ్రయులందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం... యేసుక్రీస్తు మానవరూప ధారియైన రక్షకుడుగా ఈ లోకానికి తన పరమ తండ్రి ఆదేశాలు, సంకల్పాలను అమలు పర్చడానికి విచ్చేసిన దైవకుమారుడు, అంటే అన్నివిధాలా దేవుడే!!!. అలాగైతే జననానికి, మరణానికి, పునరుత్థానానికి దేవుడు అతీతుడు కదా... మరి ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న తప్పక రావాలి.

నాలుగేళ్ల ఒక బాలుడు నీళ్లు పెద్దగాలేని ఒక బావిలో పడ్డాడు. అయ్యో అంటూ బోలెడు జనం బావి చుట్టూ గుమి కూడారు. అంతా ఎవరికి తోచినట్టు వారు వాడికి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలిస్తున్నారు. వాడసలే భయకంపితుడై ఉన్నాడు. పైగా పసితనం, అంతా గందరగోళం.. గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒకాయన బావి వద్దకొచ్చి లోనికి తొంగి చూచాడు. వెంటనే అక్కడున్న ఒక తాడు తన నడుముకు కట్టుకొని అక్కడున్నవారితో తనను లోనికి దించమన్నాడు. అతన్ని చూసి పిల్లాడు మహదానందంతో డాడీ అని గట్టిగా అరిచి తండ్రిని కరిచి పట్టుకున్నాడు.

తండ్రి కూడా వాడిని చంకకేసుకొని గట్టిగా కరుచుకొని, తమను పైకి లాగమన్నాడు. పిల్లాడు బావిలో పడిపోతే అందరికీ సానుభూతే!! కాని పర్యవసానాలోచించకుండా చనిపోయేందుకు కూడా తెగించి కొడుకును కాపాడుకునే శక్తి ఒక్క తల్లి, తండ్రి ప్రేమకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు సిలువలో అదే జరిగింది. పాపిని కాపాడేందుకు పరమతండ్రి కుమారుడిగా, రక్షకుడుగా చనిపోయేందుకు కూడా సిద్ధపడి యేసుప్రభువు బావిలోకి దూకాడు.

నేను చనిపోయినా ఫరవాలేదు, నా కొడుకు బతికితే చాలు అనుకునేదే నిజమైన తండ్రి ప్రేమ. పరమతండ్రిలో ఆయన అద్వితీయ కుమారుడు, కుమారునిలో పరమ తండ్రి సంపూర్ణంగా విలీనమైన అపారమైన ప్రేమ ఆ దైవత్వానిది. బావిలోనుండి కొడుకుతో సహా బయటికొచ్చిన సమయమే యేసు మరణాన్నీ గెలిచి సజీవుడైన ఈస్టర్‌ ఆదివారపు నవోదయం. యేసు సజీవుడయ్యాడన్న వార్త యెరూషలేములో ప్రకంపనలు రేపింది. యేసుమరణంతో విర్రవీగి రెండు రోజులపాటు మీసాలు మెలేసిన చాందస యూదుమతాధిపతులకు ఇపుడు ఏం చేయాలో తోచడం లేదు. యేసు శిష్యులు ఆయన మృతదేహాన్ని దొంగిలించారంటూ డబ్బిచ్చి వదంతులు సృష్టించబూనారు.

అయితే ఎప్పుడూ సత్యం ముందు అసత్యం వెలవెల బోతుంది. ఆయన సజీవుడైన రోజు తర్వాత సరిగ్గా 50 రోజులకు పెంతెకొస్తు అనే పండుగ నాడు వందలాదిమంది తన అనుచరులు చూస్తుండగా యేసుప్రభువు పరలోకానికి ఆరోహణమయ్యాడు. అలా యేసు సిలువలో చనిపోవడం, మూడవనాడు సజీవుడు కావడం, మళ్ళీ పెంతెకొస్తు నాడు ఆయన ఆరోహణుడు కావడం కళ్లారా చూసిన అనుభవంతో ఆయన అనుచరుల జీవితాలు సమూలంగా పరివర్తన చెందాయి. ఆయన సజీవుడైన దేవుడు అన్న నిత్యసత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఒక బలమైన చర్చిగా శక్తిగా ఏర్పడి, ఆ తర్వాత సువార్త సత్యం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యాన్ని వారికిచ్చింది.

యేసుప్రభువు దీన్నంతా ఒక చిన్న ఉదాహరణతో వివరించాడు. గోధుమగింజ ఫలించాలంటే, అది నేలలో ముందుగా చావాల్సి ఉంటుందని యేసు ఒకసారి అన్నాడు (యోహాను 12 :24 ). మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది.

మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్‌ అనుభవం. యేసుప్రభువు నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అని కూడా ప్రకటించి, తానన్నట్టే చనిపోయి తిరిగి లేవడం ద్వారా తానే జీవాన్నని రుజువు చేసుకున్నాడు. తనలాగే విశ్వాసులు కూడా పురుత్థానం చెంది పరలోకంలో తమ దేవుని సహవాసంలో నిత్య జీవితాన్ని పొందుతారని ప్రభువు బోధించాడు.
మొక్కగా పునరుజ్జీవనం పొందే ముందు విత్తనం నేలలో అనుభవించే ప్రక్రియను ఆయన మరణంతో పోల్చాడు. మొలకెత్తి పెద్దదైన తర్వాత నేలను తవ్వి చూసినా ఆ విత్తనం కనిపించదు. విత్తనంగా అది తన గుర్తింపును కోల్పోవడం ద్వారా ఒక మొక్కగా రూపించబడి ఎన్నో ఫలాలిచ్చే ఆశీర్వాదస్థితికి చేరుతుంది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్‌ అనుభవం.

– రెవ.డా.టి.ఎ.ప్రభు కిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement