ఏది కొరతగా ఉంటుందో దానికి ఖరీదెక్కువ అంటుంది అర్థశాస్త్రం. ఆ లెక్కన ప్రపంచంలో ‘ఆనందానికి’ ఉన్నంత కొరత మరి దేనికీ లేదు. అందుకే జీవితంలో ఆనందాన్ని పొందేందుకు మనిషి దేనికైనా సిద్ధపడుతున్నాడు. ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలు రాజు అతని కుమారులు కూడా గిల్బోవ పర్వతం వద్ద హతం కాగా, ఆ వెంటనే దేవుని అభీష్టం మేరకు ఇశ్రాయేలు పెద్దలంతా కలిసి హెబ్రోను రాజధానిగా దావీదుకు పట్టాభిషేకం చేశారు. పిదప ఇశ్రాయేలీయులలో పన్నెండు గోత్రాల ప్రజలు, వారి పెద్దలు కూడా మనస్ఫూర్తిగా దావీదుకు మద్దతు తెలిపారు.
వాళ్ళ మధ్య ఎన్నో తగాదాలున్నా, దావీదుతో కలిసి తమ ఇశ్రాయేలు దేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న ప్రగాఢమైన కోరికే వారిని కలిపింది, అందుకు పురికొల్పింది (1 దిన. 11,12,13 అధ్యాయాలు). దావీదు పట్టాభిషేక మహోత్సవం తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి హెబ్రోనులో కూడుకొని ఒక గొప్ప పండుగ చేసుకున్నారని, ఎంతో సంతోషాన్ని పొందారని, ఆయా గోత్రాల యుద్ధ వీరులంతా తమ తమ ఆయుధాలు ధరించి మరీ ఆ వేడుకకొచ్చారని బైబిల్ చెబుతోంది (1 దిన 12:37–40). వాళ్ళ సంతోషానికంతటికీ ఒకే ఒక కారణం దావీదు!! ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా ఆనందించడమెలాగో దావీదుకు తెలుసు. తన జీవితంలో ఆనందం ఉన్నవాడే ఇతరులను ఆనందింపజేయగలడు.
సౌలును రాజుగా తిరస్కరించి దావీదును దేవుడు ముందే అభిషేకించినా, సింహాసనాన్ని కుట్రలతో కాక దేవుని సమయంలో పొందేందుకు ఆయన దైవభయంతో కనిపెట్టాడు. ఆ లోగా సౌలు చేతుల్లో ఎన్నెన్నో కష్టాలు, విపత్తులననుభవించాడు. దైవాభిషిక్తుడైన రాజై ఉండికూడా, నలభై ఏళ్ళు తలవంచుకొని జీవించాడు. తొందరపడితే రాజ్యం ముందే దొరికేది కానీ రాజ్యప్రజల ప్రేమ అతనికి దొరికుండేది కాదు. ప్రజలంతా సౌలు వర్గం, దావీదు వర్గంగా విడిపోయి తమలో తామే పోరాటాలకు దిగితే, రాజ్యమంతా అల్లకల్లోలమై ఉండేది. కాని ఇపుడు జరిగిన దావీదు పట్టాభిషేకంతో ఇశ్రాయేలీయుల రాజ్యమంతా ఆనందం వెల్లివిరుస్తోంది.
జీవితంలో దేవుని సంకల్పాల నెరవేర్పు కోసం, ప్రతిదానికి దేవుని సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూడటమే విశ్వాసి సాధించగల నిజమైన విజయం. ‘ఎదురుచూడటం’ అనే మాట అర్థాన్ని కోల్పోయిన అత్యంత వేగవంతమైన కాలంలో మనం బతుకుతున్నాం. కాలానికి అసలు యజమాని దేవుడే!!. ఆయన తన సంకల్పాలు మనం నెరవేర్చేందుకు తన కాలంలో కొంత మనకు ‘ఆయుష్కాలం’ రూపంలో కానుకగా ఇచ్చాడు. అదే జీవితమంటే!! అందువల్ల దేవుణ్ణి అర్థం చేసుకొంటూ ఆయన అభీష్టం మేరకు జీవించడంలోని ఆనందాన్ని ఒక్క విశ్వాసి మాత్రమే అనుభవించగలడు.
దేవుణ్ణే కాదు, మనచుట్టూ ఉన్న పరిస్థితులను, మారుతున్న సంస్కృతులను, వాటి ఒత్తిడులను కూడా మనం దైవజ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి. అలా కాక సొంతజ్ఞానంతో వాటిని అనుసరించేవారు, వాటికి బానిసలవుతారు. నాటి ఇశ్రాయేలీయులకు దేవుని లేఖనాల జ్ఞానం బాగా ఉండేది. అందుకే తమ దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను లేఖనజ్ఞానంతోనే అర్థం చేసుకొని ఆనందించారు. ఆ దైవజ్ఞానం ఈనాడు విశ్వాసుల్లో, వారి కుటుంబాల్లో, చర్చిల్లో కూడా కొరతగా ఉంది. అందుకే అన్ని హంగులున్నా ఆనందం, శాంతి ఎండమావులయ్యాయి.
ప్రాథమికంగా మనం ఈ లోకానికి ఎక్కడినుండి వచ్చాం, ఎందుకొచ్చాం, ఎక్కడికి వెళతాం? అన్నది తెలుసుకోవడానికే దైవజ్ఞానం అవసరం. ఆ స్పష్టతే జీవితంలో ఆనందానికి మూలకారణం అవుతుంది. మరుక్షణంలో బతికుంటామో లేదో తెలియకున్నా, కాలమంతా నాదే, లోకమంతా నాదే అన్న పద్ధతిలో విశృంఖలంగా బతకడమే అన్ని వత్తిళ్లకు, ఆనందం పొందలేకపోవడానికి కారణం. అందుకే ‘దేవా, నీవు నాకు తెలిసిన దానికన్నా బాగా నేను నీకు తెలుసు. అందుకే నీ నిర్ణయాలు నాకు శిరోధార్యం, నీవే నా స్వాస్థ్య భాగం’ (1 దిన. 17:18–27) అన్న దావీదు విశ్వాసమే అతని ఆనందమయ జీవిత రహస్యం.
- డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment