Bible stories
-
ఆర్ద్రహృదయం
ఒకసారి ఒకవ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి, గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను, వస్త్రాలనూ దోచుకుని ఆ వ్యక్తిని అక్కడే పడేసి వెళ్లిపోయారు, ఆ వ్యక్తికి స్పృహ లేదు... అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు (దేవుని పని చేసేవాడు) వెళుతూ ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసి పక్కనుండి తప్పుకుని వెళ్లి పోయాడు, అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకుని వెళ్లాడే తప్ప అతనికి ఏ సహాయమూ చేయలేదు, ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా భక్తుడే, అప్పుడు అక్కడ నుండి ఒక మనిషి ఆ దారి గుండా వెళుతూ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్లి అతని మీద జాలిపడి తనవద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి, అతడిని దగ్గర్లో ఉన్న ఒక పూటకూళ్ల ఇంటికి తీసుకెళ్లి అతడిని అక్కడ ఉంచాడు, అంతే కాకుండా మళ్లీ తిరిగి తెల్లవారు ఝామున ఆ పూటకూళ్లవాని వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకొనమని, అతడికి ఇంకా ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే చే యించమని, ఆ ధనాన్ని తాను ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ సహాయం చేసిని వ్యక్తికీ ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు, అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్లిన ఇద్దరి వ్యక్తుల దృష్టిలో ఈ సహాయం చేసిన వ్యక్తి చెడ్డవాడుగా ఉండేవాడు...ఇప్పుడు ఆలోచించండి, మొదలు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోకం దృష్టిలో చాలా గొప్పవారిగా, భక్తులుగా చెలామణి అయ్యేవారు, దేవుని వద్ద పూజలు చేస్తూ అందరికీ కనిపించేట్టు ప్రార్థనలు చేస్తూ భక్తుల ముద్ర వేసుకున్నవారు. అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు (మత్తయి 22:39), అని క్రీస్తు చెప్పిన మాట పరమార్థం ఇదే కదా... ఒక వ్యక్తి సహాయం కోసం చూస్తుంటే అతనికి సహాయ పడకుండా త్వరగా వెళ్లి ప్రార్థన చేయాలనో లేదా సమయానికి గుడికి వెళ్లకపోతే దేవునికి కోపం వస్తుందనో అనుకునే భక్తులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవునికి ఇష్టమైనట్టు బతకడమే నిజమైన భక్తి అని ఈ ఉపమానం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని పని చేసేవాడు ముందుగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి, భక్తుడు దేవునికి నచ్చిన దానిని చేయాలి. – బెల్లంకొండ రవికాంత్ -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవజ్ఞానమే దీవెన
నీకున్నదంతా వదిలేసి నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపిస్తే, అబ్రాహాము మరో ప్రశ్న దేవునికి వెయ్యకుండా సంపూర్ణ విధేయతతో తానున్న గొప్ప మెసొపొటేమియా ప్రాంతాన్ని వదిలి అదేమిటో కూడా తెలియకుండానే కనాను దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. దాదాపు ఏడొందల ఏళ్ళ తర్వాత ఆయన సంతానమైన ఆరు లక్షలమంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు వదిలి అదే వాగ్దాన దేశానికి అరణ్యం గుండా మళ్ళీ వెళ్తున్నపుడు, ’కనాను దేశమెలా ఉంటుందో, అక్కడి పరిస్థితులేమిటో తెలుసు కునేందుకు మొదట మన వాళ్లలో కొందరిని అక్కడికి పంపిద్దాం’ అని సూచిస్తే, దేవుని సమ్మతితో గోత్రానికి ఒక్కరు చొప్పున 12 మందిని కనాను దేశానికి మోషే పంపాడు. దేవుని నిర్ణయాలకు నిర్ద్వందంగా తలవంచిన అబ్రాహాము విశ్వాసానికి, ‘ముందు ఆ దేశాన్ని చూద్దాం ఆ తర్వాతే అక్కడికెళదాం’ అన్న ఇశ్రాయేలీయుల అవిశ్వాసానికి అసలేమైనా పోలిక ఉందా? మరేం జరిగింది?’ అంత గొప్ప దేశాన్ని, అంతటి బలవంతులను మనలాంటి బలహీనులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ అవిశ్వాసంతో గుండెలు బాదుకొంటూ మాట్లాడిన పదిమందిని బట్టి, యొహోషువ, కాలేబు తప్ప మిగిలిన ఆరు లక్షలమందీ దేవుని ఉగ్రత వల్ల అరణ్యంలోనే రాలిపోగా, అరణ్యంలో జన్మించిన వారి సంతానమైన కొత్త తరం మాత్రమే వాగ్దాన దేశాన్ని చేరింది (ద్వితీ 1:22–40). అందుకే జీవం, మరణం కూడా మన నాలుక వశంలోనే ఉంటాయని బైబిల్ బోధిస్తోంది (సామె18:21). తనను తాను ఓడించుకోవడంలో, తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడంలో మనిషి తనకు తానే సాటి. కారు చీకట్లో తదుపరి అడుగు ఎక్కడ పడబోతోందో తెలియకున్నా, తనను నడిపించే దేవుని నమ్మి అద్భుతంగా, అత్యంత భద్రంగా విశ్వాస ప్రయాణాన్ని పూర్తి చేసి గమ్యాన్ని చేరిన అబ్రాహాము కోవకు చెందిన విశ్వాసులు కొందరైతే, జీవితంలో ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ,‘గొప్ప ప్లానింగ్’ తో ముందుకు సాగాలన్న లోకజ్ఞానంతో ప్రయాణించి గమ్యం తప్పి, అగాధమైన గుంటలో పడే అవిశ్వాసులు చాలా మంది. దేవుని వాగ్దానాలు, నిర్ణయాలు ఎప్పటికీ నమ్మదగినవే, శిరోధార్యమే!! విశ్వాసానికి లోకజ్ఞానాన్ని జోడిస్తే అదే అవిశ్వాసమవుతుంది. ఆ అవిశ్వాసం వల్లనే చాలా జీవితాల్లో శాపాలు, అపజయాలు, అనర్థాలు. అందుకే విశ్వాస ప్రయాణం మన పంచేంద్రియాల పర్యవేక్షణలో కాకుండా, పరిశుద్ధాత్ముని నేతృత్వంలో సాగాలన్నది మనపట్ల దేవుని నిత్య సంకల్పం (2 కొరింథీ 5:6). పంచేంద్రియాల శక్తినే మహా జ్ఞానమనుకొంటున్న నేటి ‘భ్రష్ట సంస్కృతి’కి పూర్తిగా భిన్నమైనది దేవుని సన్నిధి, వాగ్దానాలతో కూడిన దైవజ్ఞానం. దైవజ్ఞానం అనే పవిత్రమైన తైలంతో నిండిన విశ్వాసిలో లౌక్యం, లాభార్జన, స్వార్థం, పేరుప్రఖ్యాతులతో కూడిన ‘లోకజ్ఞానం’ అనే నీళ్లు ఏ మాత్రం ఇమడవు. దైవజ్ఞానానికి, లోకజ్ఞానానికి మధ్య, తోటకూరకు, కలుపుమొక్కకు, తేనె చుక్కకూ, ఆముదానికీ మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. తన జ్ఞానంతో మనిషి అత్యున్నత శిఖరాలకు ఎదగడం దేవునికి కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఆ జ్ఞానం మనిషిని దేవుని నుండి, మానవీయ, నైతిక విలువల నుండి వేరు చేస్తేనే సమస్యలొస్తాయి. పరలోకాన్ని, అపారమైన ఆశీర్వాదాలనూ పొందేందుకు దేవుని విశ్వసించాలి, దైవజ్ఞానాన్నిచ్చే బైబిల్‌ను విశ్వాసి శ్రద్ధగా చదవాలి. ఆ దైవజ్ఞానం లేనందువల్లే ఆనాడు లక్షల మంది ఎంతో తెలివున్నా అవిశ్వాసులై అరణ్యంలో రాలిపోయి, పరలోకానికి సాదృశ్యమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేక పోయారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్, prabhukirant@gmail.com -
దేవుడే సర్వం స్వాస్థ్యం
ఏది కొరతగా ఉంటుందో దానికి ఖరీదెక్కువ అంటుంది అర్థశాస్త్రం. ఆ లెక్కన ప్రపంచంలో ‘ఆనందానికి’ ఉన్నంత కొరత మరి దేనికీ లేదు. అందుకే జీవితంలో ఆనందాన్ని పొందేందుకు మనిషి దేనికైనా సిద్ధపడుతున్నాడు. ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలు రాజు అతని కుమారులు కూడా గిల్బోవ పర్వతం వద్ద హతం కాగా, ఆ వెంటనే దేవుని అభీష్టం మేరకు ఇశ్రాయేలు పెద్దలంతా కలిసి హెబ్రోను రాజధానిగా దావీదుకు పట్టాభిషేకం చేశారు. పిదప ఇశ్రాయేలీయులలో పన్నెండు గోత్రాల ప్రజలు, వారి పెద్దలు కూడా మనస్ఫూర్తిగా దావీదుకు మద్దతు తెలిపారు. వాళ్ళ మధ్య ఎన్నో తగాదాలున్నా, దావీదుతో కలిసి తమ ఇశ్రాయేలు దేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దుకోవాలన్న ప్రగాఢమైన కోరికే వారిని కలిపింది, అందుకు పురికొల్పింది (1 దిన. 11,12,13 అధ్యాయాలు). దావీదు పట్టాభిషేక మహోత్సవం తర్వాత ఇశ్రాయేలు ప్రజలంతా కలిసి హెబ్రోనులో కూడుకొని ఒక గొప్ప పండుగ చేసుకున్నారని, ఎంతో సంతోషాన్ని పొందారని, ఆయా గోత్రాల యుద్ధ వీరులంతా తమ తమ ఆయుధాలు ధరించి మరీ ఆ వేడుకకొచ్చారని బైబిల్ చెబుతోంది (1 దిన 12:37–40). వాళ్ళ సంతోషానికంతటికీ ఒకే ఒక కారణం దావీదు!! ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా ఆనందించడమెలాగో దావీదుకు తెలుసు. తన జీవితంలో ఆనందం ఉన్నవాడే ఇతరులను ఆనందింపజేయగలడు. సౌలును రాజుగా తిరస్కరించి దావీదును దేవుడు ముందే అభిషేకించినా, సింహాసనాన్ని కుట్రలతో కాక దేవుని సమయంలో పొందేందుకు ఆయన దైవభయంతో కనిపెట్టాడు. ఆ లోగా సౌలు చేతుల్లో ఎన్నెన్నో కష్టాలు, విపత్తులననుభవించాడు. దైవాభిషిక్తుడైన రాజై ఉండికూడా, నలభై ఏళ్ళు తలవంచుకొని జీవించాడు. తొందరపడితే రాజ్యం ముందే దొరికేది కానీ రాజ్యప్రజల ప్రేమ అతనికి దొరికుండేది కాదు. ప్రజలంతా సౌలు వర్గం, దావీదు వర్గంగా విడిపోయి తమలో తామే పోరాటాలకు దిగితే, రాజ్యమంతా అల్లకల్లోలమై ఉండేది. కాని ఇపుడు జరిగిన దావీదు పట్టాభిషేకంతో ఇశ్రాయేలీయుల రాజ్యమంతా ఆనందం వెల్లివిరుస్తోంది. జీవితంలో దేవుని సంకల్పాల నెరవేర్పు కోసం, ప్రతిదానికి దేవుని సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూడటమే విశ్వాసి సాధించగల నిజమైన విజయం. ‘ఎదురుచూడటం’ అనే మాట అర్థాన్ని కోల్పోయిన అత్యంత వేగవంతమైన కాలంలో మనం బతుకుతున్నాం. కాలానికి అసలు యజమాని దేవుడే!!. ఆయన తన సంకల్పాలు మనం నెరవేర్చేందుకు తన కాలంలో కొంత మనకు ‘ఆయుష్కాలం’ రూపంలో కానుకగా ఇచ్చాడు. అదే జీవితమంటే!! అందువల్ల దేవుణ్ణి అర్థం చేసుకొంటూ ఆయన అభీష్టం మేరకు జీవించడంలోని ఆనందాన్ని ఒక్క విశ్వాసి మాత్రమే అనుభవించగలడు. దేవుణ్ణే కాదు, మనచుట్టూ ఉన్న పరిస్థితులను, మారుతున్న సంస్కృతులను, వాటి ఒత్తిడులను కూడా మనం దైవజ్ఞానంతోనే అర్థం చేసుకోవాలి. అలా కాక సొంతజ్ఞానంతో వాటిని అనుసరించేవారు, వాటికి బానిసలవుతారు. నాటి ఇశ్రాయేలీయులకు దేవుని లేఖనాల జ్ఞానం బాగా ఉండేది. అందుకే తమ దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను లేఖనజ్ఞానంతోనే అర్థం చేసుకొని ఆనందించారు. ఆ దైవజ్ఞానం ఈనాడు విశ్వాసుల్లో, వారి కుటుంబాల్లో, చర్చిల్లో కూడా కొరతగా ఉంది. అందుకే అన్ని హంగులున్నా ఆనందం, శాంతి ఎండమావులయ్యాయి. ప్రాథమికంగా మనం ఈ లోకానికి ఎక్కడినుండి వచ్చాం, ఎందుకొచ్చాం, ఎక్కడికి వెళతాం? అన్నది తెలుసుకోవడానికే దైవజ్ఞానం అవసరం. ఆ స్పష్టతే జీవితంలో ఆనందానికి మూలకారణం అవుతుంది. మరుక్షణంలో బతికుంటామో లేదో తెలియకున్నా, కాలమంతా నాదే, లోకమంతా నాదే అన్న పద్ధతిలో విశృంఖలంగా బతకడమే అన్ని వత్తిళ్లకు, ఆనందం పొందలేకపోవడానికి కారణం. అందుకే ‘దేవా, నీవు నాకు తెలిసిన దానికన్నా బాగా నేను నీకు తెలుసు. అందుకే నీ నిర్ణయాలు నాకు శిరోధార్యం, నీవే నా స్వాస్థ్య భాగం’ (1 దిన. 17:18–27) అన్న దావీదు విశ్వాసమే అతని ఆనందమయ జీవిత రహస్యం. - డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఒక్క బైబిల్... వంద రచనలకు స్ఫూర్తి!
వరల్డ్ లిటరేచర్ బైబిల్ కథలు, జీసస్ జీవితం, బోధనల ఆధారంగా క్రైస్తవమతం తొలినాళ్లనుండే పశ్చిమ దేశాలలో కథలూ కావ్యాలూ రాస్తూ ఉన్నారు. ఈ రచయితల్లో కొందరిది మతదృష్టి అయితే మరి కొందరిది సామాజిక స్ఫూర్తి. తల్లిదండ్రుల్ని ఆదరించాలి, హత్య చెయ్యకూడదు, వ్యభిచారమూ దొంగతనమూ నిషిద్ధం, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, పరస్త్రీనీ పరుల ఆస్తినీ కాంక్షించకూడదు అని ఆ దేవుడే స్వయంగా శాసించినా, నిజ జీవితంలో, నిత్యజీవితంలో జనం వాటిని ఏనాడూ తు.చ. తప్పకుండా ఆచరించలేదు. ఇలా చెయ్యడం పాపమని తెలిసినా, చట్టవ్యతిరేకమని భయపెట్టినా, దుష్టబుద్ధులకు ఇవేమీ అడ్డురాలేదు. సమాజ కల్యాణాన్ని కోరిన రచయితలు ఈ సమస్యలకే స్పందించారు. తమ కావ్యాలలో నిరసన తెలిపారు. ఉదాహరణకు, ఇటాలియన్ మహాకవి దాంతె అలిహెయిర్ (1265-1325) రాసిన డివైన్ కామెడీ, సమకాలీన అధి కారాల వర్గాల అవినీతిని ఎండగట్టడానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ గురించీ, ఈ పాపాలు చేసిన ఆ నాటి ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తా విస్తాడు దాంతె. నరకం, పాపప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో కవి ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యా లనూ అనుభవించినవాళ్లే. ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి అని అన్యాపదేశంగా ప్రశ్నిస్తాడు. అలాగే మరో మూడు వందల ఏళ్ల తర్వాత, ఇంగ్లిష్ కవి జాన్ మిల్టన్ (1608-1674) ప్యారడైజ్ లాస్ట్ రాశాడు. ఈడెన్ ఉద్యానవనంలో ఆడమ్, ఈవ్లు నిషేధింపబడిన ఆపిల్ తిని, తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. భగవదాజ్ఞను ఉల్లంఘించకూడదంటాడు కవి. మిల్టన్ సమకాలీనుడే జాన్ బర్డన్ (1628-1682). మత విశ్వాసమే మనిషికి సంస్కృతి అంటాడు. 1678లో తొలిసారి అచ్చయిన ‘ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్’ అనే ఈయన పుస్తకం కేవలం క్రైస్తవ ప్రచార గ్రంథంగానే గాక, సత్ప్రవర్తన, సచ్ఛీలత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. భాష కూడా సరళంగా ఉండడంతో ఇంగ్లిష్ భాషలోనే అత్యంత ప్రాచుర్యం చెందిన పుస్తకంగా కూడా పేరు గాంచింది. ఇప్పటి దాకా ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్లో లేదట. 200 భాషల్లోకి అనువాదమైన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ గాంధీజీని బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ఈ క్లాసిక్స్ మాత్రమేగాక బైబిల్‌తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ కూడా) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్‌ల గురించి మార్క్ ట్వెయిన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి ‘ద బైబిల్ ఎకార్డింగ్ టు మార్క్ ట్వెయిన్’ పేరుతో వచ్చిన ప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారె న్స్ (ద మ్యాన్ హూ డైడ్); జాన్ శరమాగో(కాయిన్; ద గాస్పెల్ ఎకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్) నార్మల్ మైలర్ (ద గాస్పెల్ ఎకార్డింగ్ టు ద సన్)లు తమ రచనలతో దుమారం లేపారు. ఇంకా పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్స్ కూడా బైబిల్ ప్రేరణతోనే వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీపాటర్ చివరి పుస్తకంలో, కథానాయకుడు లోకకల్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుత్థానం పొందుతాడు. జోషస్టర్ సృష్టించిన సూపర్ మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్టశిక్షణ- శిష్టరక్షణ. డాన్ బ్రాన్ రాసిన డావిన్సీ కోడ్‌కు మూలాలు బైబిల్లో ఉన్నాయని ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. మతగ్రంథాలు ఇష్టపడని వాళ్లకోసం, బైబిల్‌ను బుక్ ఆఫ్ గాడ్ (1996)పేరుతో వాల్టర్ వాంగెరిన్ ఒక నవలగా కూడా ప్రచురించాడు. ప్రస్తుతానికి ఇదో బెస్ట్ సెల్లర్. - ముక్తవరం పార్థసారథి