ఒకసారి ఒకవ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళుతున్నప్పుడు దారి మధ్యలో కొందరు దొంగలు ఆ వ్యక్తిని కొట్టి, గాయపరిచి అతడి వద్ద ఉన్న విలువైన వస్తువులను, వస్త్రాలనూ దోచుకుని ఆ వ్యక్తిని అక్కడే పడేసి వెళ్లిపోయారు, ఆ వ్యక్తికి స్పృహ లేదు... అయితే కాసేపటికి ఆ మార్గం గుండా ఒక యాజకుడు (దేవుని పని చేసేవాడు) వెళుతూ ఆ దొంగలు కొట్టి పడేసిన ఆ వ్యక్తిని చూసి పక్కనుండి తప్పుకుని వెళ్లి పోయాడు, అలాగే ఇంకో వ్యక్తి కూడా అలాగే తప్పుకుని వెళ్లాడే తప్ప అతనికి ఏ సహాయమూ చేయలేదు, ఇలా రెండోసారి వెళ్ళిన వ్యక్తి కూడా భక్తుడే, అప్పుడు అక్కడ నుండి ఒక మనిషి ఆ దారి గుండా వెళుతూ ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి అతడి వద్దకు వెళ్లి అతని మీద జాలిపడి తనవద్ద ఉన్న నూనెతో అతడి గాయాలను కట్టి, అతడిని దగ్గర్లో ఉన్న ఒక పూటకూళ్ల ఇంటికి తీసుకెళ్లి అతడిని అక్కడ ఉంచాడు, అంతే కాకుండా మళ్లీ తిరిగి తెల్లవారు ఝామున ఆ పూటకూళ్లవాని వద్దకు వచ్చి అతనికి కొంత ధనం ఇచ్చి ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తిని జాగ్రత్తగా చూసుకొనమని, అతడికి ఇంకా ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే చే యించమని, ఆ ధనాన్ని తాను ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ సహాయం చేసిని వ్యక్తికీ ఆ దొంగలు కొట్టి పడవేసిన వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు, అయితే ముందు ఆ మార్గం గుండా వెళ్లిన ఇద్దరి వ్యక్తుల దృష్టిలో ఈ సహాయం చేసిన వ్యక్తి చెడ్డవాడుగా ఉండేవాడు...ఇప్పుడు ఆలోచించండి, మొదలు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు లోకం దృష్టిలో చాలా గొప్పవారిగా, భక్తులుగా చెలామణి అయ్యేవారు, దేవుని వద్ద పూజలు చేస్తూ అందరికీ కనిపించేట్టు ప్రార్థనలు చేస్తూ భక్తుల ముద్ర వేసుకున్నవారు. అయితే ఆ సహాయం చేసిన వ్యక్తి లోకం దృష్టిలో చాలా చెడ్డవాడు.
నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు (మత్తయి 22:39), అని క్రీస్తు చెప్పిన మాట పరమార్థం ఇదే కదా... ఒక వ్యక్తి సహాయం కోసం చూస్తుంటే అతనికి సహాయ పడకుండా త్వరగా వెళ్లి ప్రార్థన చేయాలనో లేదా సమయానికి గుడికి వెళ్లకపోతే దేవునికి కోపం వస్తుందనో అనుకునే భక్తులకు ఈ ఉపమానం గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవునికి ఇష్టమైనట్టు బతకడమే నిజమైన భక్తి అని ఈ ఉపమానం ద్వారా మనకు తెలుస్తుంది. దేవుని పని చేసేవాడు ముందుగా దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి, భక్తుడు దేవునికి నచ్చిన దానిని చేయాలి. – బెల్లంకొండ రవికాంత్
Comments
Please login to add a commentAdd a comment