మనుషుల్లో లే'దయా'! | Special Story About World Kindness Day On November 13th | Sakshi
Sakshi News home page

మనుషుల్లో లే'దయా'!

Published Wed, Nov 13 2019 8:30 AM | Last Updated on Wed, Nov 13 2019 9:04 AM

Special Story About World Kindness Day On November 13th - Sakshi

మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు?ఇవ్వాళ, రేపు అంతటా ఇదే తంతు నడుస్తోంది. ఒత్తిడితో కూడిన నేటి పోటీ ప్రపంచంలో మనుషుల్లో దయాగుణం తగ్గిపోతోంది. అందుకేనేమో..  ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’వంటి పాటలు మనిషిలో మాయమైపోతోన్న గుణాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి దయతో బతకాలనే స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఏటా నవంబర్‌ 13న వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే నిర్వహిస్తున్నారు.

చిన్న సాయమైనా పెద్ద మనసుతో..
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో దయా గుణం అనేది అంతర్భాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం  ఏటా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం, పేదవారికి ఆహారాన్ని పంచడం, చిన్నారుల చదువులకు సాయపడటం, వృద్ధులకు చేయూతనివ్వడం, ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్న వారిని బయటకు తెచ్చే మార్గాల్ని అన్వేషించడం.. ఇలా చేసేది ఉడతా భక్తి సాయమైనా పర్లేదు.. కాస్తంత దయతో, చిత్తశుద్ధితో చేస్తే చాలు.

అమెరికాలో కైండ్‌ నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌
ఇతరుల బాధను పంచుకోవాలంటే మనలో దయాగుణం పెరగాలి. భావితరాల్లో దీనిపై సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ గత సెప్టెంబర్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌నే ప్రారంభించింది. దయా గుణం అనేది అంతర్లీనంగా అందరిలో ఉన్నా.. దానిని ఎలా చూపాలో తెలియని వారికి ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తుంది. 

  • పౌరుల్లో దయాగుణాన్ని పెంచడం, మానవీయ సమాజాలు నెలకొల్పే దిశగా నాయకుల్లో స్ఫూర్తి నింపడం వంటివి ఇక్కడ నేర్పిస్తారు. 
  • మనిషిలో హింసా ప్రవృత్తిని నివారించే మార్గాలను అన్వేషిస్తారు. సమాజంలో దయకు స్థానం ఎందుకు తగ్గిపోతోందో అధ్యయనం చేస్తారు. 
  • మనుషుల్లో పుట్టుకతోనే కొన్ని గుణాలు అబ్బుతాయి. వాటిపై కుటుంబం, స్నేహాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి ఇన్‌స్టిట్యూట్‌ వల్ల తోటివారికి సాయపడే గుణం పెరుగుతుందని కాలిఫోరి్నయా వర్సిటీలోని కైండ్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ డీన్‌ డార్నెల్‌ హంట్‌ అంటున్నారు.

మయన్మార్‌లో దయాగుణం ఎక్కువ 
తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచారం చేసే ఒక వర్గమిది. మయన్మార్‌లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్‌ టాప్‌లో ఉంది. ఈ జన్మలో చేసే మంచి పనులే వచ్చే జన్మలో మెరుగైన జీవితాన్నిస్తాయని తెరవాడ బౌద్ధుల నమ్మకం.

మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్‌ ఎయిడ్‌ ఫౌండేషన్స్‌ వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌ వెల్లడిస్తోంది. థాయ్‌లాండ్‌లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది. సంపన్న రాజ్యమైన  అమెరికా దయాగుణం గల టాప్‌–10 దేశాల్లో లేదు. 

‘దయ’లో టాప్‌–10 దేశాలు            దయాగుణం గల వారి సంఖ్య శాతాల్లో
1. మయనన్మార్‌                                     81
2. యూకే                                                71
3. మాల్టా                                                 71   
4. థాయ్‌లాండ్‌                                       71
5. నెదర్లాండ్స్‌                                        71
6. ఇండోనేషియా                                    69
7. ఐర్లాండ్‌                                              69
8. ఆస్ట్రేలియా                                         68  
9. న్యూజీలాండ్‌                                       65
10. కెనెడా                                               63

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement