World Kindness Day
-
Kindness Day: దయ చుట్టంబౌ.. నేడు ప్రపంచ దయాగుణ దినోత్సవం
దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధతో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. దయ చూపేవారికి సాటి మనిషి తోడు నిలుస్తాడు. దయే నేడు కావలసిన చుట్టం. వెతకవలసిన దైవం. దేవుడు మనుషుల పట్ల ఎంతో దయగా ఉన్నాడు. లేకుంటే ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చేవాడా? క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను వేళ్లాడగట్టేవాడా? నదులను గీత కొట్టి అంతే పారాలని చెప్పేవాడా? సముద్రానికి చెలియలికట్టలు గీచేవాడా. దేవుడు మనుషులతో ఎంతో దయగా ఉన్నాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు. మనిషి? అన్నీ ఫ్రీ. గాలిలోని ఆక్సిజన్ ఫ్రీ. సూర్యుడిలోని డి విటమిన్ ఫ్రీ. మబ్బులోని వాన ఫ్రీ. చంద్రుడిలోని వెన్నెల ఫ్రీ. చెట్ల ఆకుపచ్చదనం ఆకాశంలోని నీలిమ.. అన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ అతడు బదులుగా ఇవ్వవలసింది చూపవలసింది ఏమిటి? సాటిమనిషి పట్ల కాసింత దయ. కొంచెం కరుణ. గుప్పెడు ఆర్ద్రత. చిటికెడు చెమరింత. ఇంగ్లిష్‌వాడు మానవజాతిని ‘మేన్‌కైండ్’ అన్నాడు. ‘కైండ్’గా ఉండటమే మానవజాతి లక్షణం. మానవీయమైన గుణం కలిగినవాడే మానవుడు. మానవీయగుణం అంటే దయ, కరుణ. ‘ఇంటి దగ్గర ఉండే లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను చంపి తిను’ అన్న గోవు మాట మీద నిలబడి తిరిగి వస్తే క్రూరమృగమైన పులికి దయ కలిగింది. ఆవును వదిలిపెట్టింది. కాని నేటి మనిషి పులి కంటే కఠినంగా మారుతున్నాడా? దయ, జాలి, కరుణ అనే మాటల్నే మరుస్తున్నాడా? ఇలాంటి మనిషిని ప్రకృతి ఇష్టపడుతుందా? ఇల్లు–ఇరుగు పొరుగు ‘పిల్లల పట్ల పెద్దలు దయగా ఉండాలి’ అని అంటారు. పిల్లలకు ఇంటి పని నేర్పించడం వేరు. ఇంటి పని పిల్లల చేత చేయించడం వేరు. బాల కార్మిక వ్యవస్థ బయట శిక్షార్హమైన నేరం. కాని ఇళ్లల్లో సొంత పిల్లలను రకరకాల పనుల్లో పెట్టి వారిని చెప్పుకోలేని బాధకు గురి చేసే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి పనికీ పిల్లల్ని కేక వేయడానికి వారు పనిమనుషులు కాదు. ఇక వారిని తిట్టడం, కొట్టడం వారిని భవిష్యత్తులో నిర్దాక్షిణ్యులుగా మార్చడమే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఇరుగు పొరుగువారితో దయగా ఉంటే, ‘వాచ్‌మెన్‌కు ఈ టిఫిన్ ఇచ్చిరా’ అని పిల్లల చేత పంపిస్తే, ‘పాపం.. వాళ్ల బండి పంక్చర్ అయ్యిందట.. మన బండి తాళం ఇచ్చిరా’ అని పంపిస్తే... పిల్లలు దయను కూడా నేర్చుకుంటారు. అవును. మంచి గుణాలను నేర్పించాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో చేయి సాచగానే తండ్రి నోటి నుంచి బూతులు, తల్లి మాటల్లో ఈసడింపు కనిపిస్తే పిల్లలు అలాంటి పేదవారి గురించి భవిష్యత్తులో దయగా ఉండే అవకాశం ఉండదు. ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్‌లోని పిల్లలతో ఎంతో స్నేహంగా, దయగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు తమ ప్రవర్తనతో చూపాలి. యువతలో ఈ దయాగుణం లోపిస్తున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, యు.కెలలో క్లాస్ 12 లోపు పిల్లల కోసం ‘కైండ్‌నెస్ కరిక్యులమ్’ ప్రవేశపెడుతున్నారు. పని చోట మనతో పని చేసే వారితో మనం కఠినంగా ఉండాలి అనుకోవడమే సగం అనారోగ్యం. పని రాబట్టుకోవాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రశంసగా కూడా పని జరుగుతుంది చాలాసార్లు. కొలీగ్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడటానికి మించిన నిర్దయ లేదు. వారి నిజమైన సమస్యలకు స్పందించడం, కనీసం వినడం, వారి పని సర్దుబాటులో, సెలవుల అవసరంలో సాయంగా ఉండటం పని చోట చూపాల్సిన కనీస దయ. పని చోట రాజకీయాలు నడిపితే అనారోగ్యం వస్తుందని దయగా ఉంటే మనశ్శాంతితో ఉంటూ శరీరంలో మంచి ఎంజైమ్‌లు ఊరుతూ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందరూ పౌరులే ఈ దేశంలో అందరూ సమాన పౌరులే. అందరికీ రాజ్యాంగం శిరోధార్యమే. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. అలా జీవించే హక్కు వారికి ఉంది. ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ఆచారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలానా వారి పట్ల నిర్దయగా ఉండొచ్చు అనుకోవడానికి మించి సంకుచితత్వం లేదు. నువ్వు నిర్దయగా ఉన్నావంటేనే పైచేయి తీసుకుంటున్నట్టు అర్థం. పైచేయి తీసుకోవడం అంటే పీడన చేయడానికి సిద్ధమవడమేనని అర్థం. పీడిస్తే సంఘంలో బాధ ప్రవహిస్తుంది. దయగా ఉంటే సంతోషం, సామరస్యం పెల్లుబుకుతాయి. ఇవాళ ద్వేషం కాదు కావలÜంది దయ. బాగున్న వర్గాలు బాగలేని వర్గాల పట్ల నిర్దయను మానుకుంటే చాలు. వారి హక్కుల్ని వారు సాధించుకుంటారు. గ్రామీణులు ‘ఫలానా అతను దయగల్లోడు’, ‘ఫలానా ఇల్లాలు దయగలది’ అంటుంటారు. ఇవాళ, ఈ రోజున, మనల్ని ఎవరైనా అలా అంటున్నారా లేదా అని ఆత్మశోధన చేసుకోవడమే మనం చేయవలసిన పని. దయగా ఉంటే ఏం పోతుంది. మహా అయితే అందరూ మనతో దయగా ఉంటారు. అంతేగా? -
మనుషుల్లో లే'దయా'!
మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు?ఇవ్వాళ, రేపు అంతటా ఇదే తంతు నడుస్తోంది. ఒత్తిడితో కూడిన నేటి పోటీ ప్రపంచంలో మనుషుల్లో దయాగుణం తగ్గిపోతోంది. అందుకేనేమో.. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’వంటి పాటలు మనిషిలో మాయమైపోతోన్న గుణాన్ని గుర్తు చేస్తున్నాయి. మనిషి దయతో బతకాలనే స్ఫూర్తిని గుర్తు చేసేందుకు ఏటా నవంబర్ 13న వరల్డ్ కైండ్‌నెస్ డే నిర్వహిస్తున్నారు. చిన్న సాయమైనా పెద్ద మనసుతో.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో దయా గుణం అనేది అంతర్భాగం. దానిని నేటి తరంలో నింపడానికి మన దేశం ఏటా ఈ దినోత్సవాన్ని ఆచరిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం, పేదవారికి ఆహారాన్ని పంచడం, చిన్నారుల చదువులకు సాయపడటం, వృద్ధులకు చేయూతనివ్వడం, ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న వారిని బయటకు తెచ్చే మార్గాల్ని అన్వేషించడం.. ఇలా చేసేది ఉడతా భక్తి సాయమైనా పర్లేదు.. కాస్తంత దయతో, చిత్తశుద్ధితో చేస్తే చాలు. అమెరికాలో కైండ్ నెస్ ఇన్స్టిట్యూట్ ఇతరుల బాధను పంచుకోవాలంటే మనలో దయాగుణం పెరగాలి. భావితరాల్లో దీనిపై సామాజిక స్పృహ పెంచే లక్ష్యంతో అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ గత సెప్టెంబర్‌లో ఒక ఇన్‌స్టిట్యూట్‌నే ప్రారంభించింది. దయా గుణం అనేది అంతర్లీనంగా అందరిలో ఉన్నా.. దానిని ఎలా చూపాలో తెలియని వారికి ఈ సంస్థ దిశానిర్దేశం చేస్తుంది. పౌరుల్లో దయాగుణాన్ని పెంచడం, మానవీయ సమాజాలు నెలకొల్పే దిశగా నాయకుల్లో స్ఫూర్తి నింపడం వంటివి ఇక్కడ నేర్పిస్తారు. మనిషిలో హింసా ప్రవృత్తిని నివారించే మార్గాలను అన్వేషిస్తారు. సమాజంలో దయకు స్థానం ఎందుకు తగ్గిపోతోందో అధ్యయనం చేస్తారు. మనుషుల్లో పుట్టుకతోనే కొన్ని గుణాలు అబ్బుతాయి. వాటిపై కుటుంబం, స్నేహాల ప్రభావం ఉంటుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్ వల్ల తోటివారికి సాయపడే గుణం పెరుగుతుందని కాలిఫోరి్నయా వర్సిటీలోని కైండ్‌నెస్ ఇన్స్టిట్యూట్ డీన్ డార్నెల్ హంట్ అంటున్నారు. మయన్మార్‌లో దయాగుణం ఎక్కువ తెరవాడ బుద్ధిజం.. గౌతమబుద్ధుని బోధనల్ని, నమ్మకాల్ని ఆచరిస్తూ ప్రచారం చేసే ఒక వర్గమిది. మయన్మార్‌లో పెద్దసంఖ్యలో ఉండే వీరు సంఘ దానాలకు ప్రాధాన్యమిస్తారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఒక జాబితా ప్రకారం అత్యధికంగా చారిటీలకు విరాళాలిచ్చే దేశాల జాబితాలో మయన్మార్ టాప్‌లో ఉంది. ఈ జన్మలో చేసే మంచి పనులే వచ్చే జన్మలో మెరుగైన జీవితాన్నిస్తాయని తెరవాడ బౌద్ధుల నమ్మకం. మయన్మార్‌లో ఏకంగా 81 శాతం మంది ప్రజలు చారిటీలకు విరాళాలిస్తున్నారని చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్స్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ వెల్లడిస్తోంది. థాయ్‌లాండ్‌లోనూ తెరవాడ బౌద్ధులు ఎక్కువే.. ఆ దేశంలో 71 శాతం మంది ప్రజలు వివిధ రూపాల్లో సాటి మనుషులకు సాయపడుతుంటారని తేలింది. సంపన్న రాజ్యమైన అమెరికా దయాగుణం గల టాప్–10 దేశాల్లో లేదు. ‘దయ’లో టాప్–10 దేశాలు దయాగుణం గల వారి సంఖ్య శాతాల్లో 1. మయనన్మార్ 81 2. యూకే 71 3. మాల్టా 71 4. థాయ్‌లాండ్ 71 5. నెదర్లాండ్స్ 71 6. ఇండోనేషియా 69 7. ఐర్లాండ్ 69 8. ఆస్ట్రేలియా 68 9. న్యూజీలాండ్ 65 10. కెనెడా 63 -
రోటీ, కపడా ఔర్ మకాన్ దయతో నాస్తి దీనత్వం
కరుణ గల కళ్లల్లో అభయమిచ్చే శక్తి ఉంటుంది. సాయం చేసే చేతుల్లో అద్భుతదీపం ఉంటుంది. అన్నం పెట్టే ఆప్యాయతలో అక్షయపాత్ర ఉంటుంది. ఒళ్లు కప్పే ఆదరణలో మానవత్వం ఉంటుంది. దయగల హృదయం ఇవన్నీ చేస్తుంది. రేపు ‘ప్రపంచ దయార్ద్ర హృదయుల దినోత్సవం’. ఆ సందర్భంగా... అలాంటి హృదయాలను మీటే ప్రయత్నమే ఈవారం... ‘ప్రజాంశం’ కళ్లెదుట కూడు, గూడు, గుడ్డ కరవైన జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నప్పుడు మనం సాధించిన అభివృద్ధికి అర్థం ఏమిటి? కొందరిని ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. కొందరికి తమదైన పరిధిలో సమాధానాలు దొరుకుతుంటాయి. అన్నం శరణం గచ్ఛామి ‘‘అన్నం దొరక్కపోతే మనిషి ఆత్మగౌరవానికే భంగం’’ అంటారు డాక్టర్ సూర్యప్రకాష్. ‘‘ఆశ్రమాలు కట్టించడం, వేలరూపాయలు ఖర్చు చేయడం లాంటి పెద్దపెద్ద పనులు చేయకపోయినా ఓ ముద్ద అన్నం పెట్టలేమా?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో తాను ఏర్పాటుచేసిన ‘అందరి ఇల్లు (ఓపెన్ హౌస్)’ ద్వారా తాను కేవలం ప్రశ్నల మనిషిని మాత్రమే కానని ఆయన నిరూపించుకుంటున్నారు కూడా. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హౌస్ ఎందరో అన్నార్తుల కడుపు నింపింది. ఇంకా నింపుతోంది. దాదాపు 310 గజాల స్థలంలో నిర్మితమైన భవనంలో ఆయన నిర్వహిస్తున్న ఈ హౌస్‌కి ఎవరైనా వెళ్లవచ్చు. అక్కడ ఉన్న కూరగాయలు, దినుసులు ఉపయోగించి వంట వండుకుని కడుపునిండా తిని రావచ్చు. ఈ ఇంట్లో వండుకునేందుకు వంటసామానులతో పాటు చదువుకునేందుకు పుస్తకాలు, అత్యవసరంగా వినియోగించుకునేందుకు కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. ‘‘ఈ మహానగరానికి వచ్చినవారిలో ఎందరో నిరుద్యోగులు, వృద్ధులు, చిన్నారులు... ఒక్కోసారి కడుపునింపుకునే దారి కనపడక అల్లాడుతుంటారు. వారికోసమే ఈ ఓపెన్‌హౌస్’’ అని చెప్పారు సూర్యప్రకాష్. నీడనిచ్చిన మానవత్వం... చిన్న వయసులోనే జైలుపాలైన పిల్లలు విడుదలైన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? మామూలు వారికే నీడ దొరకడం కష్టమైపోతోంది. అలాంటిది... జైలు నుంచి వచ్చిన పిల్లలను ఆదరించేవారెవరు? ‘క్రిస్టోస్’ ఆధ్వర్యంలో హైదరాబాద్, అల్వాల్‌లోని లోతుకుంటలో నిర్వహిస్తున్న ఓ హోమ్ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకుంటోంది. ‘‘దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన కారాగారాలకు వెళ్లేందుకు నాకు అధికారిక అనుమతి ఉంది’’ అని ఈ సంస్థ నిర్వాహకుడు నాయర్ అంటున్నారు. ప్రస్తుతం ఆల్వాల్‌లో రెండు అద్దె భవనాలలో హోమ్‌ను నిర్వహిస్తున్నారు. ‘‘ఒకదాంట్లో పూర్తిగా ఆడపిల్లలు, మరో భవనంలో మగపిల్లలు, మా కుటుంబం ఉంటున్నాం’’ అని చెప్పారాయన. జైలుకు వెళ్లొచ్చినంత మాత్రాన ఆ పిల్లలు జీవితాంతం చెడ్డవారిగానే మిగిలిపోరనే తన అభిప్రాయం ఎంత గట్టిదో వారితో కలిసి జీవించడం ద్వారా చెప్పకనే చెబుతున్నారాయన. ప్రస్తుతం మానసికంగా ఎదగని పిల్లలు, కుష్ఠు వంటి తీవ్రవ్యాధులున్న చిన్నారులు సైతం హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారంటున్న నాయర్... గత పదిహేనేళ్లుగా ఈ హోమ్‌ను నిర్వహిస్తున్నానని చెప్పారు. బోలెడంత భవిష్యత్తున్న చిన్నారులకు నీడ కల్పించడం అనేది తనకు ఎంతో ఆనందాన్ని అందిస్తోందంటున్నారాయన. ఈ ఏడాది చంచల్‌గూడ జైలులో పిల్లలతో కలిసి తమ హోమ్ పిల్లలు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకోనున్నారని చెప్తున్నప్పుడు ఆయనలో ఆ ఆనందం ప్రస్ఫుటమైంది. దుస్తుల్లేని దుస్థితిని తప్పిస్తూ... తాజాగా విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న అమ్మాయి రూ.లక్షలు ఖరీదు చేసే రెండు పీలికల బికినీ వేసుకుందనేది ఓ విశేషం. ఇంత సుసంపన్నమైన ప్రపంచంలోనే సిగ్గు దాచుకోవడానికి సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో కోట్లాదిమంది జీవిస్తున్నారనేది ఓ కఠిన వాస్తవం. సరైన దుస్తులు ధరించేందుకు కూడా అవకాశంలేని నిరుపేదల కోసం షేర్ ఎ సర్వీస్ సంస్థ వస్త్రదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్త్రాలను సేకరించి వాటిని అవసరార్థులకు పంపిణీ చేసేందుకు డిసెంబరు 31ని ‘వస్త్రదానదినం’ గా మార్చింది. ‘‘సేకరించిన దుస్తులను పంపిణీ చేసేందుకు మురికివాడలకు వెళుతున్నప్పుడు... మనిషికి అవసరమైన కనీస వసతులు కూడా ఎంత కరవైపోయాయో అర్థం అవుతోంది’’ అని ఈ సంస్థ నిర్వాహకులు గౌరీశంకర్ అన్నారు. పేరుకు ఏడాదికి ఒకసారి అనుకున్నా... ప్రజల నుంచి స్పందన బాగుండడంతో... ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని వీలున్నప్పుడల్లా నిర్వహిస్తున్నామన్నారాయన. - ఎస్.సత్యబాబు