
దేవాలయాన్ని శుద్ధి చేసిన యేసు
దాదావీదు సమకూర్చిన సామాగ్రి, సంపదతో రాజధాని యెరూషలేములో సొలొమోను ఓ ఆలయాన్ని నిర్మించాడు. దేవుడు దాన్ని తన మహిమతో నింపాడు. కాలక్రమంలో ఇశ్రాయేలీయులకు దేవుని కన్నా ఆలయమే ప్రాముఖ్యమైంది. ఈ రోజుల్లో కూడా దేవునికి విశ్వాసికి మధ్య వారధిగా ఉండాల్సిన ఆలయం, వారిద్దరికీ మధ్య అడ్డుగోడగా మారింది. అప్పటికే ఆలయాన్ని నెబుకద్నెజరు అనే బబులోను రాజు ధ్వంసం చేస్తే, హేరోదు దాన్ని పునర్నిర్మించాడు.
అయినా ఆలయం మతపరమైన అవినీతికి, మతదౌర్జన్యానికి నిలయంగా మారగా నాటి యూదు మతపెద్దలు, యాజకులు కలిపి ఒక ‘దళారీ వ్యవస్థ’గా మారి ప్రజల్ని దేవుని పేరిట పీడించి ధనార్జనకు పూనుకున్నారు. దైవకుమారుడైన యేసు ఆలయ ప్రక్షాళనకు పూనుకొని అక్కడి వ్యాపారులు, దళారుల మీద కొరడా ఝుళిపించాడు. ఎంతో సౌమ్యుడు, శాంతిపిపాసి అయినా యేసుప్రభువు ఆలయావినీతి పట్ల ఉగ్రరూపమెత్తాడు. దైవ నివాసాన్ని దొంగల గుహగా మార్చారంటూ అక్కడి వారిని పారదోలాడు.
దేవుడు సృష్టించని ‘డబ్బు’ క్రమేణా ఆలయంలో దేవుని స్థానాన్నే ఆక్రమించిన దుర్మార్గతను, ప్రేమకు మారుపేరుగా ఉండాల్సిన దైవమానవ బంధాల్లో ‘వ్యాపార సంస్కృతి’ విస్తరించడాన్ని యేసు జీర్ణించుకోలేకపోయాడు. స్వయంగా దేవాలయ ప్రక్షాళనకు పూనుకున్నాడు. దేవునికన్నా దేవాలయాలు, చర్చిలే ఎక్కువ విశిష్టతను పొందడం దేవుని అవమానించడమే! దేవుని దృష్టిలో డబ్బు చిత్తుకాగితాలే, వెండి బంగారాలు ఇనుపముక్కలే! ఆయనకు కావలసింది విశ్వాసిలో నిర్మలత్వం, ప్రేమ, పదిమందికీ ప్రయోజనకరంగా మారగల విశ్వాసం, పేదల పట్ల ఆదరణ!
– రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్