ఆత్మను శుద్ధి చేసే ఆరాధన... | devotional information by prabhu kiran | Sakshi
Sakshi News home page

ఆత్మను శుద్ధి చేసే ఆరాధన...

Published Sun, Apr 22 2018 1:05 AM | Last Updated on Sun, Apr 22 2018 1:06 AM

devotional information by prabhu kiran - Sakshi

విశ్వాసికున్న రెండు నేత్రాలు ‘ఆరాధన’, ‘పరిచర్య’. విశ్వాసికి, దేవునికి మధ్య ఉండే అనుబంధం ఆరాధనైతే. విశ్వాసికి, తోటి ప్రజలకు మధ్య ఉండే అనుబంధం పరిచర్య. విశ్వాసి పరిచర్యకు గుండెకాయలాంటిది ఆరాధన, అతన్ని గొప్ప పరిచారకుడిగా మార్చేది కూడా ఆరాధనే!! ఆరాధనా జీవితంలో మనం ఎంత బలంగా ఉంటామో, పరిచర్యలో అంత ఫలభరితంగా ఉంటాము.

బేతని గ్రామ సోదరీమణుల్లో మరియ ఆరాధనను, మార్త పరిచర్యను ఎన్నుకున్నారు. అయితే నేనెన్నుకున్న మార్గమే గొప్పదని చెప్పుకోబోయి మార్త యేసుప్రభువు మందలింపునకు గురయ్యింది. ‘నీ కోసం నేను చాలా పరిచర్య సన్నాహాల్లో ఉన్నాను, మరియను కూడా నాకు తోడుగా పంపించవా?’ అన్న మార్తతో, ‘మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు కాని మరియ ఉత్తమమైనదాన్ని ఎన్నుకుంది’ అన్నాడు యేసుప్రభువు (లూకా 10:38–42). ఆరాధన, పరిచర్య ఈ రెండూ ప్రాముఖ్యమైనవే కాని వాటిలో ఆరాధన ఉత్తమమైనదని ప్రభువే ఇలా స్పష్టం చేశాడు.

తీరికే లేనంత పరిచర్యలో తలమునకలై ఉన్నట్టు వ్యవహరించే విశ్వాసులు, పరిచారకులు తమ జీవితాల్లో నిజమైన ‘ఆరాధన’కు ఎంత సమయం కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకమే. పోనీ, చర్చిల్లో గడిపే రెండు గంటల్లోనూ ‘ఆరాధన’ ఎంత సేపుంటుందన్నది కూడా మరో పెద్ద ప్రశ్న!! ఈ రోజుల్లో చర్చిలో జరిగేదంతా ‘కార్యక్రమమే’ కదా!! వాస్తవానికి Program అనే ఆంగ్ల పదం రంగస్థల వినోదానికి అంటే ‘నటన’కు సంబంధించింది. మధ్యయుగాల్లో అది చర్చి ఆరాధనల్లో ప్రధాన భాగమైంది.

చర్చిలో పరిచయాలు, మెచ్చుకోవడాలు (గొప్ప కానుకలు వేసే వారిని, గొప్ప వారిని), నివేదికలు, ప్రకటనలు, కొరియోలు, డాన్సులు, పాటలు, ప్రార్థనలు పోగా సింహ భాగం ప్రసంగానిదే అయితే ఇక ఆరాధనేది? పోతే కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి రెండు పాటలు పాడి (మధ్యలో మినీ ప్రసంగం...) చాలా గొప్ప ఆరాధన చేశామనుకొంటున్నాం. ఆనాడు బేతనిలో మరియ చేసిన ఆరాధనలో కాని, సమరయ స్త్రీ యాకోబు బావి వద్ద ప్రభువు సమక్షంలో నేర్చుకొని చేసిన ఆత్మ, సత్యంతో కూడిన ఆరాధనలో కాని ఇవేవీ జరుగలేదని గమనించండి. ఆత్మతో, సత్యంతో విశ్వాసి చేసే ఆరాధనలో, పరితప్త భావనతో విశ్వాసి గుండె పగిలి ముక్కలై ప్రభు పాదాలమీద పరుచుకొంటుంది.

అప్పుడు దేవుడు ఒక కొత్త గుండెను తనకు అమర్చి తనను ఆలింగనం చేసుకున్న క్షమానుభవానికి విశ్వాసి లోనవుతాడు. ఇది అప్పుడప్పుడూ కాదు, నిరంతర ఆత్మీయ ప్రక్రియ. మన శరీరంలోని ఐదారు లీటర్ల రక్తాన్ని కిడ్నీలు రోజుకు 400 సార్లు శుద్ధి చేసినట్టే, ఆత్మీయ శుద్ధి ప్రక్రియ కూడా ప్రభువు పాదాల వద్ద నిరంతరంగా సాగడమే నిజమైన ఆరాధన!! శరీరం కన్నా, ఆత్మకే ఎక్కువ శుద్ధీకరణ అవసరం. ఆత్మతో, సత్యంతో జరిగే ఆరాధనలోనే, ముఖ్యంగా ప్రభువుతో ఏకాంతంలోనే అది సాధ్యం.

ఈ రహస్యం  తెలియనందువల్లనే చర్చిలు, విశ్వాసులు బలహీనులుగా ఉన్నారు. పైగా నిండా అపరిశుద్ధత ఉన్నా, పైకి గొప్ప పరిచర్య చేస్తున్న పరిచారకులు ఆ కారణంగానే పుట్టుకొస్తున్నారు. నటనతో కలుషితమైన నేటి ఆరాధనల దుష్పభ్రావమిది. ఆత్మతో, సత్యంతో చేసే నిజమైన ఆరాధనలో మనం పవిత్రులమవుతాం, దేవుని వెయ్యి పర్వతాల ఆత్మీయశక్తికి వారసులమవుతాం.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement