![devotional information by prabhu kiran - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/25/dev.jpg.webp?itok=2EKzoHpi)
దేవుని ఔన్నత్యమేమిటంటే, పరివర్తన చెందిన ఒక పాపికి పరలోకాన్ని మరింత ఆనంద భరితం చేసే శక్తినిచ్చాడు (లూకా 15 :7,10). పరలోకంలో దేవుణ్ణి కదిలించి జవాబును పొందగలిగిన శక్తిని అబలయైన ఒక స్త్రీకిచ్చాడు. హన్నా అనే స్త్రీ ఎల్కానా అనే ఒక యూదునికి రెండవ భార్య, పైగా గొడ్రాలు. అసలే స్త్రీని చిన్న చూపు చూసే నాటి సమాజంలో ఆమె గొడ్రాలైనా, వితంతువైనా ఆమె అవమానాలకు అంతేలేదు. అందువల్ల తన భర్తతో షిలోహులోని దేవుని మందిరానికొచ్చిన ప్రతిసారీ ఆమె తన సమస్య కోసం ప్రార్థించేది. అయినా ఆమె సమస్య తీరలేదు.
కానీ ఆమె అవమానాలు అధికమైన పరిస్థితుల్లో ఒకసారి ఆమె తన’ ఆత్మనంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ’ ప్రార్థించింది (1సమూ 1:15). అవసరాల కోసం ప్రార్థించడం విశ్వాస జీవితంలో ప్రాథమిక స్థాయి. కాని దేవుని సంకల్పాలతో మన సంకల్పాలు కలిసిపోయేలా ’ఆత్మను కుమ్మరిస్తూ’ ప్రార్ధించడం అత్యున్నత స్థాయి. విశ్వాసుల ప్రార్థన ఆ స్థాయిలోనే అంటే ఆత్మతో, సత్యంతో చేసేదిగానే ఉండాలని యేసుప్రభువు బోధించాడు (యోహాను 4:24). ఆనాడు షిలోహులో యాజకులు, విశ్వాసులున్నారు. బలులు, అర్పణలు, ఆరాధనలు జరుగుతున్నాయి.
కానీ అక్కడ దేవుని ప్రత్యేక్షత లేదు. అదీ ఆనాటి ‘ఆత్మీయ సంక్షోభం’! వాళ్ళ జీవితాలు ఆలయానికి దగ్గరగా ఉన్నాయి, దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా జీవించినా, ఆలయానికొచ్చి తృణమో, ఫలమో చెల్లిస్తే చాలు దేవుడు ప్రసన్నమైపోతాడన్నది వాళ్ళ ధీమా. ఈ ‘చీకటి’తో పోరాడి ప్రజల్ని తిరిగి దేవుని వైపునకు మళ్లించే ఒక ప్రవక్త కోసం అపుడు దేవుడు ఎదురుచూస్తున్నాడు. హన్నా సరిగ్గా అదే సమయంలో దేవా నాకొక కుమారుణ్నిస్తే నీకే ప్రతిష్ఠిస్తానంటూ ప్రార్థించింది. మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే స్థాయిలో ప్రార్థించడమంటే, ప్రజలకోసమైన దేవుని సంకల్పాలతో విశ్వాసి ప్రార్థనలు ఏకీభవించడమన్నమాట.
హన్నా అదే చేసింది. నాకొక కొడుకునిస్తే నీవు ఎదురుచూస్తున్న యాజకుడిగా అతన్ని తీర్చిదిద్దుతానని తనకు తెలియకుండానే ఆమె దేవునితో ఒప్పందపడింది. మనమంతా కూడా అదే చేయాలి. వెంటనే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఇచ్చిన బాలుడే సమూయేలనే ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆయన ఇశ్రాయేలీయులకు అద్భుతమైన నాయకుడయ్యాడు. సౌలు రాజును, దావీదు చక్రవర్తిని ఆయనే అభిషేకించాడు. ఆ దావీదు ద్వారా ఇశ్రాయేలీయులలో గొప్ప విప్లవమే వచ్చింది. ఇదంతా హన్నా అనే ఒక అబల సాధించిన ప్రార్థనా విజయమే, ఆమె సంకల్పబలమే!!!
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment