
దేవుణ్ణి అర్థం చేసుకున్నదానికన్నా, అపార్థం చేసుకోవడమే చాలా ఎక్కువ. ఎంతసేపూ మనుషుల్లో తప్పులు వెతికి దండించేవాడు, కోపిష్టి వాడన్నది పలువురి అభిప్రాయం. అందుకే ఆయన్ని ప్రేమించే వారికన్నా, ఆయన దండిస్తాడని జడిసి భయపడే వాళ్లే చాలామంది. కాని బైబిల్ మాత్రం దేవుడు ప్రేమౖయె ఉన్నాడు. అంటుంది. (1 యోహాను 4:8). దేవుడు, ప్రేమ ఏమాత్రం విడదీయలేనివి. దేవుడు దండించిన సందర్భాలు ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఉంటాయి.
అయితే విశ్వాసిని అకారణంగా బాధించేందుకుగాక, విశ్వాసిని సరిచేసి, అతన్ని ఇంకా అత్యున్నతమైన ఆశీర్వాదాలకు పాత్రుని చేయడమే ఆయన ఉద్దేశ్యం. ఆయన స్వభావరీత్యా ప్రేమామయుడే కాదు, మనమంతా ఆయనకు అత్యంత ప్రియమైన వారమని కూడా అర్థం చేసుకోవాలి. మానవాళిని ప్రేమించి, అతనికి సర్వసౌకర్యాలు, శాంతి, సంతోషం, సంతృప్తి కలిగించేందుకుగానూ వారి కోసమే విశ్వాన్నంతా దేవుడు సృష్టించాడని కూడా బైబిలు చెబుతోంది. అందుకే యేసుప్రభువు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్ముడు పావురం లాగా ఆయన మీదికి దిగిరాగా, ‘నీవు నా ప్రియ కుమారుడవు, నీలో నేను సంతోషిస్తున్నాను’ అన్న తండ్రిౖయెన దేవుని స్వరం ఆకాశం నుండి వినబడింది.
వెంటనే అపవాది ఆయన్ను అరణ్యంలోకి కొనిపోయి 40 రోజుల పాటు ఎన్నో విధాలుగా శోధించినా, ఆయన వాటికి లొంగక విజయం సాధించడం ద్వారా తన పరలోకపు తండ్రి పట్ల తనకు గల ప్రేమను కూడా రుజువు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే విషయంలో ఎప్పుడూ లోటు చేయడు. ఆ ప్రేమకు మన ప్రతిస్పందనలోని లోపాలు, మారని మన జీవితాలే దేవుని ఆశీర్వాదానికి ప్రతిబంధకాలవుతాయి. బకెట్‌లోని వేడినీళ్ల జోలికి వెళ్లవద్దని వారించినా వినని కొడుకును తండ్రి ఒక దెబ్బ వేస్తాడు ప్రేమగానే. అయినా వినకుండా వేడి నీళ్లతో ఒళ్లు కాల్చుకున్న కొడుకును తండ్రి భుజాన వేసుకుని డాక్టర్ వద్దకు ఏడుస్తూ పరుగెత్తుతాడు. అంతకన్నా మించిన ప్రేమతో. దేవుని ప్రేమ లోతు, వెడల్పు, పొడవెంతో అనుభవిస్తేనే అర్థమవుతుంది.
బైబిలంతా క్షుణ్ణంగా చదివినా దేవుని ప్రేమ మాత్రం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయగల భాషను, పదజాలాన్ని మానవుడిప్పటికీ కనిపెట్టలేడు. బైబిల్ చదివి దేవుడుతో కొంత అవగాహన పొందవచ్చు కాని నిరంతర ప్రార్థన అనే ఆత్మీయ వ్యాయామం, క్రమశిక్షణ, సంపూర్ణి విధేయతతోనే దేవుని ప్రేమ అర్థమవుతుంది. మనకు గుచ్చుకునే ముల్లు మనకన్నా దేవున్ణే ఎక్కువగా బాధిస్తుందన్న పారలౌకిక సత్యం ఆ స్థాయిలోనే బోధపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడి బల్ల లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు.
కాని మన సమయాన్ని, ధనాన్ని, ప్రతిభా పాటవాలను దేవుణ్ణి ప్రేమించి ఆయనకోసం పెట్టుబవడిగా పెడితే నష్టం వచ్చే ప్రసక్తే లేదు. డబ్బుతో కొలవలేని, కొనలేని శాంతి సమాధానాలు ఆ దారిలో పుష్కలంగా మన సొంతమవుతాయి. చాచిన హస్తాలతో దేవుడు మనకోసం ఎప్పుడూ సిద్ధమే!! ఆ దృశ్యం కనపడకుండా మనల్ని ప్రబోధాలు, ప్రతికూలతలు శాసిస్తున్నాయి.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment