
మతం మనిషికుంది. దేవునికి లేదు. ఈ విధి విధానాలను బోధించడానికి, అమలు చేయడానికీ తనకంటూ ప్రత్యేక జనాంగంగా యూదులను ఏర్పర్చుకున్నా, యేసుకీస్తు వంశావళిలోనే రూతు అనే మోయాబీయురాలిని దేవుడు చేర్చడం ఆయన సార్వత్రికతకు స్పష్టమైన నిదర్శనం (మత్త 1:5). రూతు మోయాబీయాలనే అన్యురాలు. యూదు దేశంలో క్షామం ఏర్పడినప్పుడు నయోమి అనే తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకుని ఎలీమెలెకు అనే వ్యక్తి మోయాబు దేశానికి వలస వెళ్లాడు.
కాని అక్కడ మరిన్ని కష్టాలెదురై, ఎరీమెలకు, అతని ఇద్దరు కుమారులు చనిపోగా, వారిద్దరిలో ఒకరికి భార్యౖయెన రూతు తన అత్తను, ఆమె దేవుణ్ణి గొప్పగా విశ్వసించి ఆమెతో సహా వారి స్వస్థలమైన బెత్లెహాముకు తిరిగొచ్చింది. బతకడానికి వలస వెళ్లిన నయోమి కుటుంబం అక్కడ మరింత చితికిపోయి అలా తిరిగొచ్చింది. అయితే ధర్మశాస్త్రం వితంతువుల పునర్వివాహాన్ని అదే వంశంలో కొన్ని షరతులకు లోబడి జరిగేందుకు అనుమతించింది.
ఆ పరిస్థితులలో పూట గyì చేందుకుగాను రూతు కోతలు జరుగుతున్న కాలంలో పరిగె ఏరుకోవడానికి, బోయజు అనే గొప్ప యూదు విశ్వాసికి చెందిన పొలానికి వెళ్లింది. చేలల్లో పంట కోసే సమయంలో కొన్ని పనలు, ధాన్యం నిరుపేదలు, పరదేశుల కోసం వదలాలన్న దేవుని నిబంధన మేరకు బోయజు ఆమెను తన పొలంలో పరిగె ఏరుకోమన్నాడు. పైగా ఆమె గురించి ఎంతో దయగా మాట్లాడి ఆమెను బాధించ వద్దని తన పనివారిని హెచ్చరించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో, బోజయు తన ‘బంధువు ధర్మం’ చొప్పున రూతును పెళ్లాడగా వారికి మనుమడైన యెష్షయికి దావీదు జన్మించాడు. ఆ దావీదు వంశంలోనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు. అలా రూతు మోయాబీయురాలైనా, ఒక రాజవంశంలో భాగమైంది.
దేవుని సంకల్పాలు అనూహ్యమైనవి, అమరమైనవి కూడా!! పరిగె ధాన్యాన్ని ఏరుకోవడానికి ఒక పరదేశిగా, నిరుపేదగా వెళ్లిన రూతును దేవుడు కనికరించి బోయజు అనే సద్వర్తనుడు, సొంత వంశస్తుని పొలానికి నడిపించి, చివరికి అతన్నే భర్తగా అనుగ్రహించి, యేసుక్రీస్తు వంశావళిలో భాగమయ్యే ధన్యతను దేవుడామెకిచ్చాడు. దేవుని విశ్వసించడమే రూతు చేసిన పని.
ఆ తరువాత జరిగిందంతా దేవుని సంకల్పం మేరకు జరిగిపోయింది. అందుకే ఆయన మన గురించి చింతించే దేవుడని బైబిలు చెబుతోంది (1 పేతురు 5:7). విశ్వాసానికి విరుద్ధాంశం సంశయం!! విశ్వాసుల జీవితాల్లో అశాంతిని రేపేవే సంశయాలు, సందిగ్ధాలు!! దేవుని పట్ల మనకున్న విశ్వాసంలో స్పష్టత, దృఢత్వం ఉండాలి. ఆశీర్వాదాల వరదకు అవే కారణాలవుతాయి.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment