నింపాల్సింది హుండీలను కాదు... పేదల కడుపులను | devotional information by prabhu kiran | Sakshi
Sakshi News home page

నింపాల్సింది హుండీలను కాదు... పేదల కడుపులను

Published Sun, Jul 15 2018 12:44 AM | Last Updated on Sun, Jul 15 2018 12:44 AM

devotional information by prabhu kiran - Sakshi

అపొస్తలుడైన పౌలు తన శరీరంలో ఉన్న ఒక ముల్లును తీసెయ్యమంటూ మూడుసార్లు దేవుని ప్రార్థించాడు. అయితే దేవుడు ఆ ముల్లు తీసెయ్యలేదు కాని నా కృపను నీకిస్తాను, అదే నీకు చాలు’ అని జవాబిచ్చాడు (2 కోరి12:8,9). ప్రార్థిస్తే్త దేవుడు దేన్నైనా అనుగ్రహిస్తాడన్న అభిప్రాయం చాలామందిది. జీవితాల్లో ముళ్లు లేని వాళ్ళంటూ ఎవరున్నారు?  కుదుటబడని ఆరోగ్యం, తీరని ఆర్థిక సమస్య, సఖ్యత కొరవడిన దాంపత్యం, స్థిరపడని పిల్లలు, పైకి అన్నీ ఉన్నట్టే ఉన్నా ఏదో కరువైనట్టున్న వెలితి, కుటుంబంలో అశాంతి... ఇలా ఆ ముల్లు ఏదైనా కావచ్చు.

కాని ప్రార్థించినా దాన్ని తీసివేయడంలో దేవుడు జాప్యం చేస్తున్నపుడు, ఒక విశ్వాసిగా మన ప్రతిస్పందన ఏమిటి? నా ముల్లునే గనుక దేవుడు తీసేస్తే, ఇంకెంతో గొప్పగా దేవుని పరిచర్య చేసి ఉండేవాడినని అనుకొంటున్నారా? సువార్త వ్యాప్తిలో, ఆదిమ చర్చిల స్థాపనలో, కొత్తనిబంధన బైబిల్‌ భాగాలు రాయడంలో అగ్రగణ్యుడు పౌలు. పౌలు మూడు మిషనరీ యాత్రలతోపాటు మరెన్నో ప్రయాణాలు చేశాడు. ‘ఈ ముల్లొకటి దేవుడు తీసేస్తే ఇంకా మరెన్నో ప్రయాణాలు చేసి సువార్తను మరిన్ని వేలమందికి ప్రకటిస్తాను, ఇంకెన్నో కొత్త చర్చిలు స్థాపిస్తాను’ అని పౌలు ఒకవేళ భావించినా అందులో తప్పేముంది?.

కానీ అతని ముల్లును తీసేయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఆ ముల్లే అతనిని నలుగగొట్టి ఒక విశిష్టమైన విశ్వాసిగా తీర్చిదిద్దుతుందని దేవునికి తెలుసు, దేవుడిచ్చిన కృప ద్వారా పౌలుకు కూడా కాలక్రమంలో అది అర్థమయింది. అదే దేవుని సార్వభౌమత్వం అంటే. మనం ఏమి చెయ్యగలం? ఏమి చేస్తున్నాం? అన్నదానికన్నా మనం ఏమిటి, మన సాక్ష్యం ఏమిటి, మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామన్నదే దేవుడు మనలో నిశితంగా చూసే విషయం.

విలియం కేరీ (1761–1834) మహా భక్తుడు. ఇంగ్లాండ్‌ దేశాన్ని వదిలేసి ఇండియాకొచ్చి ఇక్కడి భాషలు నేర్చుకొని బెంగాలీ, ఒరియా, అస్సామీస్, మరాఠీ, హిందీ, సంస్కృత భాషల్లోకి పూర్తి బైబిల్‌ను, తెలుగులోకి కొత్త నిబంధన బైబిల్‌ను తర్జుమా చేయడమే కాదు, ఆయన రామాయణాన్ని కూడా హిందీలోకి అనువదించాడు.ఇండియాలో క్రైస్తవం వ్యాప్తి చేసిన మిషనేరీలకు పితామహుడు విలియం కేరీ. మనం ఏం చేశామని కాదు, మనం ఏమిటి? అన్నది దేవుడు ప్రధానంగా పరిశీలిస్తాడు.దేవుని ఈ కొలబద్ద సంక్లిష్టమైనదే కాదు, చాలా సరళమైనది కూడా. దేవుని మెప్పించడం కష్టమే కానీ దేవుని హృదయ స్పందనను తెలుసుకోగలిగితే మాత్రం అది చాలా సులువు.

పొరుగునే ఆకలితో అలమటిస్తున్న పేదకుటుంబానికి పచ్చడి మెతుకులతో కనీసం చద్దన్నమైనా పెట్టకుండా, వంద మంది పాస్టర్లను పిలిచి వాళ్లకు విందు చేస్తే దేవుడు ప్రసన్నుడై మన ‘పరలోకపు అకౌంట్‌’లో బోలెడు పుణ్యం జమ చేస్తాడనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే!! కడుపారా తిని విలాసాలు అనుభవిస్తున్న వారికి దేవుని పేరిట పరమాన్నం పెట్టి, బెంజి కార్లు కొనివ్వడం కన్నా, ఒక పేదవాడి కడుపు నింపడానికి కాసింత గంజి పొయ్యడమే దేవుని దృష్టి్టలో అత్యంత విలువైన విషయం, అదే విశ్వాసికి ఆశీర్వాదాలు తెచ్చే మహా పుణ్యకార్యం. ఉన్నవాడికి ఇంకా ఇంకా తోడిపెట్టడం, దాన్ని దేవుడు హర్షిస్తాడనుకోవడం పూర్తిగా అవివేకం. చర్చిల్లో, ఆలయాల్లోని హుండీలను బంగారం, వెండి, వజ్రాలతో నింపేందుకు అత్యుత్సాహ పడే విశ్వాసులు చాలా మంది ఉంటారు, దేవునితో కాక తోటిప్రజలతో శభాష్‌ అనిపించుకోవడానికే వాళ్ళ తాపత్రయమంతా!!

యేసుప్రభువు చెప్పిన ఉపమానంలో, గాయాలతో రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి కూడా, పరామర్శించకుండా తమ దేవాలయ బాధ్యతలే ముఖ్యమనుకొని ముఖం తిప్పుకొని వెళ్లిపోయిన ఒక యాజకుడు, ఒక లేవీయుడు దేవుని ప్రసన్నతకు పాత్రులు కాలేదు (లూకా 1010:25–37). పొరుగువాడిని ప్రేమించకుండా, దేవుని కోసం మాత్రం గొప్ప కార్యాలు చేశామంటూ విర్రవీగిన చాలామంది ‘గొప్పవాళ్ళ’ పేర్లు దేవుని జీవగ్రంథంలో కనిపించకపోతే మనం పరలోకంలో అవాక్కైపోతామేమో జాగ్రత్త!!
పౌలు ముల్లును దేవుడు తీసెయ్యలేదు కానీ అతనికి తన కృపను సమృద్ధిగా ఇచ్చాడు.

దేవుడు ఏ విషయాల్లో ప్రసన్నుడవుతాడన్నది, దేవుని విశిష్ట హృదయ స్పందన ఏమిటన్నది దేవుని కృప తమ జీవితాల్లో సమృద్ధిగా నిండి ఉన్నవారికి ఎప్పటికప్పుడు అర్థమవుతుంది. మన జీవితాలు దైవజ్ఞానంతో కన్నా, దేవుని కృపతో నిండినవైతే అదే నిజమైన ఆశీర్వాదం. అంతేకాదు, దేవుని ప్రసన్నుని చేసే కార్యాలు చేపట్టేందుకు దేవుని కృప వారికి శక్తినిస్తుంది. అందుకే ‘హుండీలు కాదు, పేదల కడుపులు, జీవితాలు నింపండి’ అన్నదే దేవుని నినాదం, అభిమతం. దైవకృపలో, విశ్వాసంలో ఎదిగే కొద్దీ దేవుని ఈ హృదయం విశ్వాసికి స్పష్టంగా అర్థమవుతుంది.

– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement