దీనులు ధన్యులు
ధన్యత
యేసు ప్రభువు తాను భూలోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. దేవుని రాజ్య వారసులు ఎవరు? తన కొండమీద ప్రసంగంలో యేసు తన రాజ్య వారసుల లక్షణాలను వివరించాడు. మొదటి లక్షణం తాను చెప్పిన మొదటి ధన్యత ద్వారా మనకర్థమౌతుంది.
మొదటి ధన్యత ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది’’ (మత్తయి 5:3). మన ఆత్మీయ దారిద్య్రతను అంగీకరించమని యేసు చెప్తున్నాడు. బైబిల్ ప్రకారం మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా ఇవి ఏవీ మన ఆత్మీయ జీవితానికి తోడ్పడవు. దేవుని దృష్టిలో మనమందరం ఆత్మీయ దరిద్రులమే. ‘‘జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా... యెహోవాను నేనే అని గ్రహించి, నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టే అతిశయింపవలెను’’ అని యెహోవా అంటున్నాడు (యిర్మీ 9:23-24)
ఇద్దరు వ్యక్తులు దేవున్ని ఆరాధించడానికి మందిరంలోకి వెళ్లారట. వారిలో ఒకడు తన గొప్పతనమును గూర్చి, తన భక్తిని గురించీ పొగుడుకుంటూ ప్రార్థించాడట. ఇంకొకడు ‘దేవా, పాపినైన నన్ను క్షమించు’ అని ప్రార్థించాడు. ఈ రెండవ వాడు దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడని యేసు చెప్తున్నాడు. మనమందరం దేవుని ముందర పాపులమే. మన గొప్పతనాలు, మన భక్తి, మన మంచి క్రియలు ఏవీ దేవుని యెదుట మనలను యోగ్యులనుగా చేయవు. మన ఆత్మీయ దరిద్రతను అంగీకరించి మనలను మనం తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొన్నప్పుడే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతాము. ఇందుచేతనే మన పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు బలిగా మరణించి, తిరిగి లేచాడు. ఆయన ద్వారా దేవునితో సమాధానం పొంది దేవుని రాజ్యాన్ని ఈ జీవితంలోనే అనుభవించగలము.
ఇది దేవుని రాజ్యవారసుల మొదటి లక్షణం.
- ఇనాక్ ఎర్రా