the Bible
-
అంతటాశోభ
మానవాళికి శుభసందేశమందించిన పరిశుద్ధాత్ముడి జన్మదిన వేడుకలు శనివారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రార్థనామందిరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ప్రార్థన మందిరంలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే ఘట్టాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. యేసు ప్రభువు పుట్టిన రోజున ఆకాశంలో ఒక తార తళుక్కుమని మెరిసిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగా క్రైస్తవులు విద్యుద్దీపాలతో కూడిన స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా క్రిస్మస్ చెట్లను అందంగా ఏర్పాటు చేశారు. -
దీనులు ధన్యులు
ధన్యత యేసు ప్రభువు తాను భూలోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. దేవుని రాజ్య వారసులు ఎవరు? తన కొండమీద ప్రసంగంలో యేసు తన రాజ్య వారసుల లక్షణాలను వివరించాడు. మొదటి లక్షణం తాను చెప్పిన మొదటి ధన్యత ద్వారా మనకర్థమౌతుంది. మొదటి ధన్యత ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది’’ (మత్తయి 5:3). మన ఆత్మీయ దారిద్య్రతను అంగీకరించమని యేసు చెప్తున్నాడు. బైబిల్ ప్రకారం మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బలవంతులమైనా ఇవి ఏవీ మన ఆత్మీయ జీవితానికి తోడ్పడవు. దేవుని దృష్టిలో మనమందరం ఆత్మీయ దరిద్రులమే. ‘‘జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా... యెహోవాను నేనే అని గ్రహించి, నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టే అతిశయింపవలెను’’ అని యెహోవా అంటున్నాడు (యిర్మీ 9:23-24) ఇద్దరు వ్యక్తులు దేవున్ని ఆరాధించడానికి మందిరంలోకి వెళ్లారట. వారిలో ఒకడు తన గొప్పతనమును గూర్చి, తన భక్తిని గురించీ పొగుడుకుంటూ ప్రార్థించాడట. ఇంకొకడు ‘దేవా, పాపినైన నన్ను క్షమించు’ అని ప్రార్థించాడు. ఈ రెండవ వాడు దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాడని యేసు చెప్తున్నాడు. మనమందరం దేవుని ముందర పాపులమే. మన గొప్పతనాలు, మన భక్తి, మన మంచి క్రియలు ఏవీ దేవుని యెదుట మనలను యోగ్యులనుగా చేయవు. మన ఆత్మీయ దరిద్రతను అంగీకరించి మనలను మనం తగ్గించుకొని మన పాపములను ఒప్పుకొన్నప్పుడే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడతాము. ఇందుచేతనే మన పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు బలిగా మరణించి, తిరిగి లేచాడు. ఆయన ద్వారా దేవునితో సమాధానం పొంది దేవుని రాజ్యాన్ని ఈ జీవితంలోనే అనుభవించగలము. ఇది దేవుని రాజ్యవారసుల మొదటి లక్షణం. - ఇనాక్ ఎర్రా -
తిరిగిరాని క్షణం... కాంతికన్నా వేగం!
సృష్టిలో, మనకు తెలిసినంత వరకు అత్యంత వేగంతో ప్రయాణించేది ‘కాంతి’. సెకనుకు లక్షా ఎనభై ఆరు వేల మైళ్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. అయితే సూర్యునిలో తరచు సంభ విస్తుండే సునామీని మించిన అగ్ని తుపానులు, మహావిస్ఫోటాలు కలిగినప్పుడు ఉద్భవించే అతి సూక్ష్మ ధూళి కణాలైన ‘న్యూట్రినో’లు... వేగంలో కాంతితో పోటీపడి మరీ ఈ విశ్వంలోకి దూసుకెళ్తాయని ఇటీవల ‘నాసా’ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు! అయితే వీటన్నిటినీ మించి వేగంగా ప్రయాణించినట్టనిపించేది మరొకటుందనిపిస్తుంది. అదే ‘గతించిపోయిన కాలం’. సూర్యుడు ఆవిర్భవించి నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలైందని శాస్త్రజ్ఞుల అంచనా. అంటే ఇప్పటికి క్షణికంలో అన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయాయన్న మాట. నిమిషానికి అరవై సెకన్లు. సెకనును వంద కోట్ల భాగాలుగా విభజించినప్పుడు దానిని ‘నానో సెకను’ అంటారు. మీరు ఈ వాక్యం చదివే లోపు కొన్ని లక్షల నానో సెకన్లు గతించి పోతాయి. వాటిలో ఒక్క సెకనును కూడా వెనక్కు లాగే శక్తి మనకు లేదు. కనుక మానవ జీవితం నూరు సంవత్సరాలైనా, అంతకు మించినా, అది కాలయానంలో అతి సూక్ష్మమైన, అణువు కన్నా సంక్షిప్తమైనదని చెప్పాలి. మనకు ముందు కొన్ని వేల, లక్షల తరాలు గతించి పోయాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి: ‘మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అది అప్పుడే పూసి, సమసిపోయే గడ్డిపువ్వు లాంటిది’ అని. జీవితకాలం ఇంత సంక్షిప్తమైనప్పుడు, స్వార్థపూరితంగా జీవించి ప్రయోజనం ఏమిటి? బైబిల్లో ఇలా ఉంటుంది: ‘అన్యాయంగా మీరు సంపాదించుకున్న వాటికి మీ పేర్లు, పిల్లల పేర్లు పెట్టుకుంటారు కానీ చివరకు అవి అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ నీతియుక్తంగా లభిస్తాయి. అంతకుమించిన నిత్యజీవానికి, పరలోక రాజ్యానికి మీరు వారసులవుతారు’ అని. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. - యస్.విజయ భాస్కర్ -
క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
కర్నూలు(న్యూసిటీ): బైబిల్, క్రీస్తు వ్యతిరేక కథనాలతో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రిన్సిపాళ్లు ఎం.ఎల్.ఆండ్రూస్, దేవపాల్, జయరాజ్‌లు హెచ్చరించారు. క్రీస్తు వివాహితుడని మూడు దినపత్రికల్లో(సాక్షి కాదు) వచ్చిన కథనాలపై కర్నూలు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్‌లోని కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ పెద్ద పార్కు, రాజ్‌విహార్ సర్కిల్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ లండన్ రచయిత రాసిన చైత పుస్తకం దిలాస్ గాస్పెల్ ఆధారంగా పత్రికలు పనికట్టుకొని ఏసు పెళ్లి చేసుకున్నాడని, పిల్లలు ఉన్నారని ప్రచురించడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీయడమేనన్నారు. ఇలాంటి పత్రికలను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో గంగాధర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వైస్ ప్రిన్సిపాల్ అబ్రహం లింకన్, టీడీపీ క్రిష్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాస్ తదితరులు పాల్గొన్నారు. -
యంగ్ లింకన్
లింకన్‌కు పుస్తకపఠనం అంటే వల్లమాలిన ఇష్టం. తాను చదివిన విషయాలను ఫ్రెండ్స్‌తో పంచుకునేవాడు. చదవాల్సిన పుస్తకం గురించి ఎవరైనా చెబితే అది చదివే వరకు ఊరుకునేవాడు కాదు. బైబిల్, షేక్స్పియర్ పుస్తకాలతో లింకన్‌కు పుస్తకపఠనం మీద ఆసక్తి పెరిగింది. పుస్తకాలను చదువుతూ గ్రంథాలయాలలో గంటల కొద్దీ సమయాన్ని గడిపేవాడు. దాంతో లింకన్‌ను కొందరు స్నేహితులు ఆటపట్టించేవారు. కొత్త వాళ్లతో స్నేహం చేయడమంటే లింకన్‌కు ఇష్టం. ఆయన స్నేహబృందంలో అన్ని వయసుల వారు ఉండేవారు. ఇతరుల నుంచి తాను ప్రేరణ పొందడమే కాదు తన నుంచి ఇతరులు ప్రేరణ పొందేలా ఉండేది లింకన్ పని విధానం. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడు. ‘బాగా విన్నవారే...బాగా మాట్లాడగలరు’ అనేదాన్ని నమ్మేవాడు. ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు రాబట్టుకోవడంలో ముందుండేవాడు. చర్చా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.