క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
కర్నూలు(న్యూసిటీ): బైబిల్, క్రీస్తు వ్యతిరేక కథనాలతో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రిన్సిపాళ్లు ఎం.ఎల్.ఆండ్రూస్, దేవపాల్, జయరాజ్‌లు హెచ్చరించారు. క్రీస్తు వివాహితుడని మూడు దినపత్రికల్లో(సాక్షి కాదు) వచ్చిన కథనాలపై కర్నూలు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
స్థానిక పాత బస్టాండ్‌లోని కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ పెద్ద పార్కు, రాజ్‌విహార్ సర్కిల్, బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడుతూ లండన్ రచయిత రాసిన చైత పుస్తకం దిలాస్ గాస్పెల్ ఆధారంగా పత్రికలు పనికట్టుకొని ఏసు పెళ్లి చేసుకున్నాడని, పిల్లలు ఉన్నారని ప్రచురించడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీయడమేనన్నారు.
ఇలాంటి పత్రికలను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో గంగాధర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో వైస్ ప్రిన్సిపాల్ అబ్రహం లింకన్, టీడీపీ క్రిష్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాస్ తదితరులు పాల్గొన్నారు.